2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం.. కాంగ్రెస్ హాజరయ్యేనా?

2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం.. కాంగ్రెస్ హాజరయ్యేనా?
హైదరాబాద్ నగరంలో హెక్టిక్ పొలిటికల్ యాక్టివిటీ జరుగుతోంది. ఒక వైపు హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు అదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను అధికార టీఆర్ఎస్ నగరానికి ఆహ్వానించింది. ఈ నెల 2న అంటే బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్మా హైదరాబాద్ రానున్నారు.

అదే రోజు టీఆర్ఎస్ జల విహార్ లో టీఆర్ఎస్ ఆయనతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలాగే జలవిహార్ లో ర్యాలీ కూడా తీయనున్నది. మోడీ హైదరాబాద్ లో బస చేసిన నేపథ్యంలో నగరంలో ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే ఆ ఆంక్షలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్  లిమిట్స్ కే పరిమితం కావడంతో హైదరాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే జలవిహార్ లో ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ హాజరౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు ఈ సమావేశానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఆహ్వానించిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ హాజరయ్యాయి. ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామనీ ప్రకటించాయి. జాతీయ స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో టీఆర్ఎస్ కు  వచ్చే ఎన్నికలలో బీజేపీ కాదు కాంగ్రెస్సే ప్రధాన పోటీదారని ఇటీవల కేసీఆర్ లీక్ చేసిన పీకే సర్వే నివేదికలలో తేలింది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానిస్తుందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆహ్వానించినా  కాంగ్రెస్ హాజరౌతుందా అన్న సందేహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు విషయంలో ఏకతాటిపైకి వచ్చిన విధంగానే.. యశ్వంత్ సిన్హాకు మద్దతు గా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సమావేశానికి కాంగ్రెస్ హాజరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇలా ఉండగా నగరంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను కేసీఆర్ ఆహ్వానించడం వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. యశ్వంత్ సిన్హాకు బీజేపీ నేతలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఆయనతో టచ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ హైదరాబాద్ కు ఆహ్వానించడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.