ప‌వ‌న్‌ను వైసీపీ కావాల‌నే రెచ్చ‌గొడుతోందా? టీడీపీని సైడ్ చేసే వ్యూహ‌మా?

బ‌ల‌మైన శ‌త్రువును దెబ్బ‌కొట్ట‌డం అంత ఈజీ కాదు. మ‌న‌కు అంత బ‌లం లేన‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థి బ‌లాన్ని త‌గ్గించ‌డం ఓ ఎత్తుగ‌డ‌. రాజ‌కీయాల్లో ఇది బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. ప్ర‌స్తుం వైసీపీ ఇదే పొలిటిక‌ల్ స్ట్రాల‌జీని అప్లై చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఇప్ప‌టికీ అత్యంత బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉంది. నిజాయితీగా ఎలాంటి బెదిరింపులు, కుట్ర‌లు లేకుండా ఎన్నిక‌లు జ‌రిపితే తెలుగుదేశం స‌త్తా ఏంటో తెలుస్తుంది. ఈ విష‌యం అంద‌రికంటే అధికార‌పార్టీకే బాగా తెలుసు. అందుకే, బ‌ల‌మైన టీడీపీని రాజ‌కీయంగా సైడ్ చేసేందుకు.. వైసీపీ ద్విముఖ వ్యూహం అమ‌లు చేస్తోంది. వివిధ అంశాల్లో బీజేపీని, జ‌న‌సేన‌ని క‌వ్వించి, రెచ్చ‌గొట్టి.. ఆ రెండు పార్టీలు నిత్యం వార్త‌ల్లో ఉండేలా చేయ‌డమే ఆ ఎత్తుగ‌డ‌. అలా ఆ రెండు పార్టీలను యాక్టివ్ పాలిటిక్స్‌లో లైమ్‌లైట్‌లో ఉంచి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీని సైడ్‌వేస్‌లోకి పంపించేయాల‌నేది వైసీపీ స్కెచ్ అంటున్నారు. అందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. 

ఇటీవ‌ల టిప్పు సుల్తాన్ విగ్ర‌హం విష‌యంలో బీజేపీ నానార‌చ్చ చేసింది. ఎక్క‌డో ఓ ప‌ట్ట‌ణస్థాయి ఇష్యూని స్టేట్‌వైడ్ ప్రాబ్ల‌మ్‌గా క్రియేట్ చేసి.. బీజేపీ ర్యాలీల‌తో హోరెత్తించి.. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు తామే క‌రెక్ట్ అనేలా సీన్ క్రియేట్ చేశారు. అంత‌కుముందు, ఆల‌యాలపై దాడులు, మ‌త‌మార్పిడిలు, టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల అంశంలోనూ బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ చేసి.. టీడీపీని డ‌మ్మీ చేసే ప్ర‌య‌త్నం చేసింది. సేమ్ ఇలాంటి స్ట్రాట‌జీనే జ‌న‌సేన విష‌యంలోనూ ప్ర‌యోగిస్తోంది వైసీపీ. గిల్లితే గిల్లించుకోకుండా.. గూబ ప‌గ‌ల‌గొట్టేలా మాట్లాడే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌వ్వించ‌డం చాలా సింపుల్‌. జ‌స్ట్ ఒక్క మాటంటే చాలు.. మాట‌ల తూటాల‌తో ఎదురుదాడి చేయ‌డం పీకే నైజం. ఆ వీక్‌నెస్‌ను వైసీపీ ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంద‌ని అంటున్నారు. కావాల‌నే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టేందుకే.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల టైమ్‌లో వ‌కీల్‌సాబ్‌ను టార్గెట్ చేశార‌ని.. అద‌లా కంటిన్యూ చేస్తూ.. ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకురావ‌డం.. ఇలా మొత్తం మేట‌ర్‌ను పీకే చుట్టూ తిప్పేసింది ప్ర‌భుత్వం. వైసీపీ ట్రాప్‌లో ప‌వర్‌స్టార్ ఈజీగా ప‌డిపోయారు. స్వ‌త‌హాగా అస‌మ‌నం, ఆవేశం ఫుల్లుగా ఉండే ప‌వ‌న్‌క‌ల్యాన్‌.. ఓపిక ప‌ట్టీ ప‌ట్టీ.. రిప‌బ్లిక్ వేదిక‌గా బ్లాస్ట్ అయ్యారు. ఏపీ పాల‌కుల‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. దానికి మ‌రింత మ‌సాలా ద‌ట్టిస్తూ.. పేర్ని నాని, పోసాని, స‌జ్జ‌ల లాంటి వాళ్లు ఆ అగ్నిగుండం ఆర‌కుండా.. మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. ప‌వ‌న్ సైతం ట్విట‌ర్‌లో ర‌చ్చ కంటిన్యూ చేస్తున్నారు. ఈ టోట‌ల్ ఎపిసోడ్‌లో ఎక్క‌డా టీడీపీ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం.. జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ వార్ ర‌క్తిక‌ట్ట‌డం ఆస‌క్తిక‌ర‌మే కాదు వ్యూహాత్మ‌క‌మూ అంటున్నారు. 

వైసీపీకీ కావ‌ల‌సింది ఇదే. ప్ర‌భుత్వంపై బాగా పోరాడుతున్నారంటూ ప్ర‌జ‌ల అటెన్ష‌న్ జ‌న‌సేన వైపో, బీజేపీ వైపో షిఫ్ట్ చేయ‌డం అధికార‌పార్టీ టార్గెట్ అంటున్నారు. ఎందుకంటే, ఎంత ఎగిరెగిరి ప‌డినా జ‌న‌సేన కానీ, బీజేపీ కానీ ఇప్ప‌ట్లో ఏపీలో ప‌వ‌ర్‌లోకి వ‌చ్చే ఛాన్సే లేదు. సంస్థాగ‌తంగా ఆ రెండు పార్టీలు బాగా బ‌లహీనం. టీడీపీ అలా కాదు.. ఏమాత్రం అవ‌కాశం క‌లిసొచ్చినా.. మునుప‌టి వైభ‌వం ఖాయం. అందుకే, ఆ పార్టీకి ఆ అవ‌కాశం చిక్క‌కుండా చేసేందుకే.. బీజేపీ, జ‌న‌సేన‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ రెచ్చ‌గొడుతూ వైసీపీ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటోంద‌ని అనుమానిస్తున్నారు. ఇలా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త టీడీపీ, బీజేపీ. జ‌న‌సేన‌ల మ‌ధ్య చీలిపోయి.. ఆ మేర‌కు వైసీపీ లాభం పొంద‌ట‌మే ఆ పార్టీ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీగా క‌నిపిస్తోందని అంటున్నారు.