గుడివాడ పాకిస్తాన్‌లో ఉందా? ఎందుకంత ఓవ‌రాక్ష‌న్‌?

మీరెప్పుడైనా వాఘా స‌రిహ‌ద్దుకు వెళ్లారా? అది ఇండియా-పాకిస్తాన్ బోర్డ‌ర్‌. అట్నుంచి ఇటు చీమను కూడా రానివ్వ‌రు. స‌రిహ‌ద్దులు మూసేసి ఉంటాయ్‌. టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఏమాత్రం అనుమానం వ‌చ్చినా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు ఒళ్లుమండితే.. కాల్చిపారేస్తారు కూడా. ఇదంతా నేష‌న‌ల్ సెక్యూరిటీ ఇష్యూ. కానీ, గుడివాడ‌లో పోలీసులు, వైసీపీ శ్రేణులు పాకిస్తాన్ బోర్డ‌ర్ మాదిరి ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గుడివాడ దేశంలో అంత‌ర్భాగం కాదా? అక్క‌డ అడుగుపెట్టే హ‌క్కు ప్ర‌జ‌లంద‌రికీ లేదా? టీడీపీ, బీజేపీని గుడివాడ‌లో నిషేధించారా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు.

మొన్న‌టికి మొన్న టీడీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వ‌స్తే.. వైసీపీ వాళ్లు దాడుల‌కు తెగ‌బ‌డి భ‌యాందోళ‌న‌లు సృష్టించారు. టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయ‌కుల‌ను కొట్టారు. బోండా ఉమా కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టారు. టీడీపీ నాయ‌కుల‌పై రాళ్ల దాడి చేసి.. గుడివాడలో గుండాయిజం చేశారు. 

మొన్న టీడీపీ.. ఇవాళ బీజేపీ. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న బీజేపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులు వాహనాల్లో బయల్దేరగా పోలీసులు అడ్డుతగిలారు. గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డురోడ్డు ద‌గ్గ‌ర తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది. సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని బీజేపీ నేత‌లు మండిపడ్డారు.  

కొడాలి నానికి చెందిన‌ కె క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగిన కేసినో వ‌ల్లే గుడివాడ‌లో ఇంత‌టి హైటెన్ష‌న్‌. పాకిస్తాన్ మాదిరి అల్ల‌క‌ల్లోలం అవుతోంది. కె క‌న్వెన్ష‌న్‌లో అస‌లేమీ జ‌ర‌గ‌న‌ప్పుడు టీడీపీని కానీ, బీజేపీని కానీ.. అడ్డుకోవ‌డం ఎందుకు? వైసీపీ మూక‌ల రాళ్ల దాడి ఇంకెందుకు? ఖాకీల బ‌ల‌ప్ర‌యోగం అవ‌స‌ర‌మేముంది? అని నిల‌దీస్తున్నారు. అంటే, కొడాలి క‌న్వెన్ష‌న్‌లో ఏదో జ‌రిగింద‌నేగా? అక్క‌డ కేసినో ఏర్పాటు చేసిన‌ట్టు ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టేగా? లేదంటే ఎందుకంత భ‌యం? ఇందుకిలా అడ్డ‌గింపు? వెళ్లే వాళ్ల‌ను వెళ్ల‌నిస్తే పోతుందిగా.. వాళ్లే అక్క‌డ ఏముందో చూసి చెబుతారుగా? గుడివాడ‌లోనే అడుగుపెట్టొద్దంటే ఎట్టా? అని మండిప‌డుతున్నారు.