Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆదివారమే సెలవు దినంగా ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న కథ ఇదే..!
posted on: Feb 28, 2026 1:40PM

ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి, పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది. భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని, ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే..
కార్మిక హక్కులు..
బ్రిటిష్ పాలన కాలంలో ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని వెనుక ఒక కథ ఉంది.
ఆదివారం సెలవు వెనుక కథ..
ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు.
7ఏళ్ల పోరాటం..
కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881, 1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం, లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది. జూన్ 10, 1890న, భారతదేశంలో ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది.
ఆదివారం సెలవు వెనుక అసలు కారణం..
ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన, ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి.
ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు.
భారతీయ సంస్కృతి, హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి, కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి, పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి.
1700 సంవత్సరాల చరిత్ర..
ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్, తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది. వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.
*రూపశ్రీ.






