Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి ఇప్పుడే కాపులు ఎందుకు గుర్తొచ్చారు?
posted on: Jun 17, 2026 4:18PM

గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా కమ్మ వర్గానికి చెందిన లింగమేనేని రమేష్‌ను ఖరారు చేయడాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. జనసేన కోసం గ్రౌండ్ లెవల్లో ఎప్పుడు పనిచేయని లింగమనేనిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తోంది. అసలు కాపు ఓట్లతో గెలిచిన జనసేన వారిని కాదని కమ్మ వ్యక్తికి పదవి కట్టబెట్టడం అన్యాయమంటూ కుల రాజకీయానికి తెర లేపాలని చూస్తోంది.
సాధారణంగా పార్టీల్లో సీటు ఆశించి దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాని రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన తర్వాత కూటమి పార్టీల్లో ఆ పరిస్థితి లేదు. విచిత్రంగా వైసీపీ జనసేనలో కాపు కులానికి అన్యాయం జరిగిపోయిందని యాగీ చేస్తోంది. జనసేన, టీడీపీ నాయకుల కంటే వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కాపులు, ఎస్సీలు, బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో లింగమనేని స్వయంగా చిరంజీవిని తిట్టారని, కాపులకి దేవుడి సమానమైన మెగాస్టార్‌ని తిట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని వైసీపీలోని సోకాల్డ్ కాపు బ్యాచ్ తెగ ఫీలైపోతున్నారు.
ఇదంతా జనసేనలో కాపు శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నమే. అయితే జనసేన కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. వాస్తవానికి జనసేనల కాపులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు ఆ వర్గం వారే. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కాపులే.
టీడీపీ ఈ సారి ఒక కమ్మ, ఒక కాపు, ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. కూటమి నుంచి కాపు నేత సానా సతీష్ రాజ్యసభకు రెండో సారి అవకాశం దక్కించుకున్నారు. కూటమి ఇద్దరు కమ్మవారికి అవకాశం ఇచ్చిందని ప్రచారం చేస్తున్న వైసీపీ, అదే కూటమి కాపుని కూడా పెద్దల సభకు పంపిందని చెప్పలేకపోతోంది. కొడకు కోటరీలో చంద్రబాబు లాబీయిస్టులకు అవకాశమిచ్చారని, ఎస్సీలకు కూడా అన్యాయం చేశారని వితండ వాదం చేస్తోంది. మహానాడులో మహిళలకు మూడో వంతు సీట్లిస్తామని ప్రకటించిన టీడీపీ ఒక్క మహిళను కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదని లాజిక్ లేవనెత్తుతున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేరు. కాపుల మీద ఇప్పుడు అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ తన హయాంలో ఒక్క కాపుని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో ఆరుగురు రెడ్లే. అయితే చంద్రబాబు మాత్రం బడాబాబులను రాజ్యసభకు పంపుతున్నారని సొంత మీడియాలో వైసీపీ ఊదరగొడుతోంది.
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, జగన్ కేసులు వాదించే తెలంగాణ లాయర్ నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని, వైవీ సుబ్బారెడ్డి, 2 సార్లు రాజ్యసభ అవకాశం దక్కించుకుని తర్వాత వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి వీరంతా బడాబాబులే. ఇలాంటి వారందరికీ అవకాశం కల్పించిన జగన్ ఇప్పుడు డబ్బు సంచుల ఉన్న వారినే కూటమి రాజ్యసభకు పంపుతోందని విమర్శించడం గురవింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. ఏపీలో కూటమి నుంచి ప్రస్తుతం ఉన్న, ఇప్పుడు కాబోయే రాజ్యసభ సభ్యులు ఏడుగురిలో నలుగురు బీసీలు, ఇద్దరు కమ్మ, ఒక కాపు ఉన్నారు. అదే వైసీపీకి ఇప్పుడు మిగిలి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు రెడ్లు, ఒక ఎస్సీ ఉన్నారు.
.
తాజాగా జగన్ తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న ‘కాపులను వేరు చేయడం ఎలా?’ అనే విషయంపైనే వారికి గీతోపదేశం చేశారంట. కాపులు కూటమితో ఉంటే తాము అధికారంలోకి రావడం జరిగే పని కాదని తెలిసే వైసీపీ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తోందని దీంతో స్పష్టమవుతోంది.
సామాజిక వర్గ న్యాయంలో చంద్రబాబు ఎంత ఆచితూచి వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2028లో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దక్కని వర్గాలకే చంద్రబాబు కేటాయిస్తారు. పదవుల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో టీడీపీ అధినేత ముందుంటారు. అలాంటిది ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి అన్ని పదవుల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన వైసీపీ ఇప్పుడు కాపులకు అన్యాయమంటూ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తుండటం హాస్యాస్పదంగా మారింది






