మా అమ్మాయి పెళ్లి వరకూ విడిచిపెట్టండి : దర్యాప్తు సంస్థలను కోరిన పెండ్యాల శ్రీనివాస్!

ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల

జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు

దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు.

నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.