వైఎస్ వివేకా హత్య కేసు విచారణ దారి తప్పిందా? తప్పించారా?

ముందు గుండెపోటు అన్నారు. గంటల్లోనే కాదు హత్య అన్నారు. అది ప్రత్యర్ధి పార్టీ చేసిన పనేనని మొదలెట్టారు. సిట్ వేస్తే..కాదు సీబీఐ రావాలన్నారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక ఏ సంగతీ తేల్చలేదు. పైగా సీబీఐ వద్దని కోర్టులో కాగితం పెట్టారు. పోలీసులంతా మనోళ్లే.. అయినా బాబాయ్ మర్డర్ ఎవరు చేశారో తేల్చలేకపోయారో తేల్చలేదో తెలియదు గాని..ఇప్పటికీ తేలలేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మాత్రం పెద్దలిస్టు కోర్టుకే ఇచ్చారు..వారి మీద విచారణ చేయాలని. అందులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్ పేర్లు కూడా పెట్టారు.  

ఇక డాక్టర్ సునీతారెడ్డి ప్రెస్ మీట్లు పరిశీలిస్తే...ఆమె వైఎస్ అవినాష్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారనే అనుమానం కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. సీబీఐ కూడా స్పీడుగా పని చేయటం లేదని ఆమె విమర్శించారు. ఆ తర్వాత సీబీఐ స్పీడ్ పెరిగింది. కాని ఏ దిశలో పెరిగిందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఎంపీలు, డాక్టర్లను వదిలేసి.. డ్రైవర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను.. ఎవరో వివేకా దగ్గరకు సెటిల్ మెంట్ కోసం వచ్చారంటూ కొందరిని.. విచారిస్తున్నారు.. అది కూడా చాలా స్పీడుగా.

ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైనే ట్రోలింగ్ నడుస్తోంది. పెద్దోళ్లను వదిలేసి.. చిన్నోళ్లను తెగ తిప్పుతున్నారేంటని. మొదటి నుంచి జగన్ శిబిరం ప్రచారం చేసినట్లు.. ఏదో వ్యవహారంలో వివేకాతో బెడిసిన వారే ..చంపి ఉంటారన్న యాంగిల్ లోనే విచారణ జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అంటే సునీతారెడ్డి ఆరోపించినట్లు రాజకీయ కోణం విషయాన్ని మాత్రం సీబీఐ పట్టించుకోనట్లే కనపడుతోందని.. అంతే కాదు.. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావించినవారు చనిపోయారు. ఆ మరణాలు కూడా అనుమానాస్పదమని ప్రచారం జరుగుతోంది. అయినా సీబీఐ ఆ విషయం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. అంటే కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసుకున్నారా... ఆయన కోరిక మేరకు.. ఆయన కోరుకున్న విధంగా సీబీఐ ఎంక్వయిరీ నడుస్తుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  అయితే మరో వాదన ఏంటంటే..సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని.. ఏ ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా.. ఎంక్వయిరీ చేస్తున్నారని.. చెప్పుకొస్తున్నారు.

ఎటొచ్చీ డాక్టర్ సునీతారెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సాక్ష్యాలు లేకుండా మాయం చేయాలని చూసినవారిని ఎందుకు వదిలేస్తున్నారు? వారిది ఏ తప్పు లేకపోతే సాక్ష్యాధారాలను తుడిచే ప్రయత్నం ఎందుకు చేశారు? అన్నివేట్లు పడి.. భయానకంగా రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూశాక కూడా గుండెపోటు అని ఎలా ప్రకటించారు? సీబీఐ ఈ కోణంలో విచారించిందా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే విచారణ వివరాలు వారు కోర్టులో తప్ప ఎక్కడా చెప్పరు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినా.. హైకోర్టుకు గడువు సరిపోదని.. మరింత టైమ్ కావాలని అడిగింది సీబీఐయేనే. మరి ఇప్పుడు డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ దాదాపు వారం రోజులు నడిపించింది. మరి అదనంగా అడిగిన టైమ్ వీటి కోసమేనా? లేక దేని కోసమో అంటూ కామెంట్లు వస్తున్నాయి. చూడాలి మరి..కనీసం మరో మూడు నెలలకైనా ఈ విచారణ తేలుస్తారో లేదో.