గులాబీ కొత్త బాస్ ఎవరో? ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. 

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. 

ఇది టీఆర్ఎస్ పార్టీ పదో అధ్యక్ష ఎన్నికగా.. ఐదేళ్ల తర్వాత తాజాగా ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ విధివిధానాల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి (ఏప్రిల్ 27న) అధ్యక్షుణ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.  చివరిసారిగా 2017లో ఎన్నికలు జరగ్గా, వరుసగా 8వ సారి కేసీఆర్ ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యారు. 2019లో ఎన్నిక జరగాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా వేసుకున్నారు.  2021లో కరోనా విలయం కారణంగా టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగలేదు.ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం, తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3600 పైచిలుకు వార్డు క‌మిటీల‌తో పాటు బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్ క‌మిటీలు, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీల ఎన్నిక పూర్తి చేసుకుంది. సంచలనాలేవీ లేకపోతే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అవుతుంది. మొత్తంగా 20 ఏండ్ల పాటు కేసీఆరే అధ్యక్షుడిగా ఉన్నట్లైంది. 

పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ఓ భారీ సభను నిర్వహించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని, తెలంగాణ విజయ గర్జన పేరుతో జరగబోయే ఆ సభకు పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 27న నుంచి అన్ని నియోజకవర్గాల్లో విజయ గర్జన సభ సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు.