కానరాని ఫెడరల్ స్ఫూర్తి!

ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నివేదికే వార్షిక బడ్జెట్. దానిని అందరికీ ఆమోదయోగ్యంగా (అందరికీ అంటే.. బీజేపీ అగ్రనాయకత్వానికి, దేశంలోని సంపన్నవర్గాలకీ) రూపొందించడంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ అరితేరారు. సామాన్యులకు లోటుపాట్లే కాదు.. ప్రయోజనాలు ఏమిటన్నది కూడా అంతు చిక్కకుండా అంకెలగారడీ చేయడంలో ఆమె సిద్ధహస్తులయ్యారు. అందుకే  ఆమె కేంద్ర విత్తమంత్రిగా సుస్థిరంగా కొనసాగుతున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న స్థితి నుంచి ఆమె తన స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాకుండా.. మోడీ కేబినెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.  ఆమె తన తాజా బడ్జెట్ లో తనకు మాత్రమే సాధ్యమైన ఈ అంకెల గారడీని ఆమె మరొకసారి విజయవంతంగా లోక్ సభకు ప్రదర్శించారు.  ఈ బడ్జెట్  అంతా అంకెల మయం.. అయితే జనాలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి? వాటికి కేటాయింపులు ఎంత అంటే ఆర్థిక నిపుణులు కూడా నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి.  

గతంలో కరోనా సమయంలో కేంద్ర విత్త మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అంటూ సీరియల్ లా చూపిన గణాంక పరిజ్ణానం పామరులకు ఎంత దివ్యంగా అర్ధమైందో.. ఆమె లోక్ సభలో  తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అంతే అర్ధమౌతుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయినా ఎన్నికల సంవత్సరం కనుక కర్నాటక వంటి బీజేపీకి కీలకమైన రాష్ట్రాల కేటాయింపుల విషయం మాత్రం ఒకింత సరళంగా వివరించారు. అది మినహాయిస్తే..  ఎన్నికల సమయంలో కూడా  జనాకర్షణ పథకాలకు పెద్ద పీట వేయకుండా.. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి పెట్టినట్లుగా కనిపించవచ్చు. దీంతో రాజకీయ లబ్ధి కోసం కాకుండా దేశాభివృద్ధిపై దృష్టి పెట్టిన విత్తమంత్రిగా ఆమె ప్రతిష్ట, అలాగే మోడీ ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించిందన్న భావన కలిగితే కలగవచ్చు... కానీ  ఈ అంకెల గారడీతో ప్రజలకు  ఒరిగిందేమిటంటే శూన్యమే అని చెప్పాలి.  

 గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులు   అమలయ్యాయా? అరచేతిలో వైకుంఠం చూపినట్లుగా బడ్జెట్‌ లో  వాగ్ధానాలు ఏ మేరకు నెరవేరాయి?  బడ్జెట్‌ ఫలితాలు లేదా కేటాయింపుల ఫలితాలు ఆశించిన స్థాయిలో నెరవేరి ఉంటే ఇప్పుడు కేంద్రం అదే పనిగా బడ్జెట్ పై సెమినార్లు అంటూ ఊరూరా ప్రచార బాకా ఊదుకోవలసిన అవసరమే ఉండేది కాదు.   ఒక వంక ద్రవ్యలోటు.. మరో పక్క రుణభారం భారత ఆర్థిక సుస్థిరతపై అనుమానాలు రేకెత్తిస్తోంది.  

అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ కేవలం కేంద్రానికి చెందిన అంశంగా.. రాష్ట్రాలకు ఇందులో ఇసుమంతైనా ప్రమేయం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నదన్న భావన ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో బలంగా ఉంది. ముందుగా ఆ భావనను పోగొట్టకుండా.. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం వ్యవహరిస్తున్నదన్న భావన కలగదు.  వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రాలు, వాటి ఆర్థిక వనరులు, విధానాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయన్నవిషయాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం నిజంగా దారుణం.