ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ.. వ్యూహం ఏమిటి? వైసీపీ నెత్తిన పాలుపోయడమేగా?

చెప్పేదొకటి.. చేసేదొకటి ఏపీలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంటోంది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో   పోటీలోకి దిగుతామంటూ బీజేపీ చేసిన ప్రకటన వెనుక వ్యూహమేమిటన్నది రాజకీయ పండితులకు సైతం అంతుబట్టడం లేదు. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. రాజకీయ పార్టీలు పోటీకి దిగకుండా ఉండటమన్నది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది.

అయితే బీజేపీ మాత్రం పోటీకి దిగుతామంటూ చేసిన ప్రకటన ఏ ఉద్దేశంతో అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది. గతంలో బద్వేలు నియోజవకర్గ ఉప ఎన్నికలో కూడా బీజేపీ పోటీ చేసి దారుణంగా పరాజయం పాలైన సంగతి ఈ సందర్భంగా ఒక సారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణింతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. మరణించిన ఎమ్మెల్యేకు సానుభూతిగా అక్కడ ఆయన భార్యను వైసీపీ రంగంలోకి దింపడంతో ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తెలుగుదేశం భావించింది.  

సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని తెలుగుదేశం నిర్ణయం తీసుకొంది.   జ‌న‌సేన కూడా పోటీ నుంచి తప్పుకుని ఆనవాయితీని, సెంటిమెంటునూ గౌరవించింది. అయితే ఏ మాత్రం గెలుపు అవకాశం లేని బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం ఉప ఎన్నికలో పోటీకి దిగాయి.   ఫలితం అనూహ్యమేమీ కాదు. బద్వేలులో బీజేపీ, కాంగ్రెస్ లు డిపాజిట్లు కోల్పోయాయి. వాటికి డిపాజిట్లు వచ్చినా ఒరిగేదేం లేదు కానీ, ఆ రెండు పార్టీలూ పోటీలో ఉండటం   వైసీపీకి ప్రయోజనం చేకూర్చిందనే చెప్పాలి.

ఇప్పుడు ఆత్మకూరులోనూ బీజేపీ పోటీకి దిగుతానంటూ ముందుకు వస్తున్నది. బీజేపీ వైఖరి వైసీపీ నెత్తిన పాలుపోయడం కోసమేనా అన్న ప్రశ్నకు విశ్లేషకులు ఔనని అంటున్నారు.  కనీసం పోత్తులో ఉన్న జనసేన పార్టీతో చర్చించకుండా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ప్రకటించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.  ఎన్నిక ఏకగ్రీవం అయితే వైసీపీ విజయం సాధించిందని మాత్రమే చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా మరో పార్టీ పోటీలో నిలబడటంతో గత కంటే ఎక్కువ మెజారిటీ సాధించామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రచారం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి ఏదో మేరకు సానుకూలత చేకూరుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వైసీపీ విధానాలను విమర్శిస్తున్న బీజేపీ చేతలలో మాత్రం ఆ పార్టీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. కనీస ఓట్లు సాధించుకునే బలం కూడా లేని బీజేపీ సెంటిమెంటును, సంప్రదాయాన్నీ కూడా కాదని ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెడతానంటూ ముందుకు రావడం వైసీపీకి మేలు చేయడానికేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బద్వేలు అనుభవం తరువాత కూడా ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీకి సిద్ధపడం అందుకు సంకేతమనని అంటున్నారు.