నిలువెల్లా హిందూ వ్యతిరేకత.. ప్రకాష్ రాజ్ కు ఏమైంది?

తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామిని హిందువులు భ‌క్తిశ్ర‌ద్ధలతో కొలుస్తుంటారు. స్వామివారి ద‌ర్శ‌నం కోసం తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశం, ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల నుంచి హిందువులు ప్ర‌తీరోజూ పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లి వ‌స్తుంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే తిరుమ‌ల అంటే ఓ ఆధ్యాత్మిక ప్ర‌పంచం.. ఆ ప్రాంతం ప‌విత్ర‌మైన‌దిగా ప్ర‌తీ హిందువూ భావిస్తారు. కానీ, ఐదేళ్లు ఏపీలో అరాచ‌క పాల‌న సాగించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని కూడా వ‌దిలిపెట్ట‌లేదు.

తిరుమ‌ల ల‌డ్డూ అంటే భ‌క్తులు ఎంతో ప‌విత్రంగా  భావిస్తారు. తిరుమ‌ల వెళ్లిన‌వారు రద్దీయో, మరో కారణంతోనో స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోలేక‌పోయినా తిరుప‌తి ల‌డ్డూ తీసుకొని వ‌స్తుంటారు. అలాంటి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వుతో క‌ల్తీ అయిన నెయ్యి వినియోగించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌హా పాపానికి ఒడిగ‌ట్టింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నెయ్యి శాంపిల్స్ కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్‌కు పంపించ‌గా.. అందులో జంతువుల కొవ్వు క‌లిపిన‌ట్లు తేలింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో దేశ‌వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తిరుప‌తి ల‌డ్డూలో క‌ల్తీనెయ్యి వాడిన ఘ‌ట‌న‌లో అస‌లైన దోషుల‌ను ప‌ట్టుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని( సిట్) ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయంలో సినీ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాత్రం ఈ విష‌యంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. 

సినిమాల్లో ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌న అంటే ప్ర‌తీఒక్క‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్త‌వులు అనే తేడాలేదు. కానీ, ప్రకాశ్ రాజ్  మాత్రం చెత్త‌మాట‌ల‌తో హిందువుల మ‌నోభావాల‌ను ఎప్పుడూ దెబ్బ‌తీస్తూనే ఉన్నారు. హిందుత్వ గురించి మాట్లాడితే అదేదో పెద్ద‌పాపం, ఇత‌ర మ‌తాల‌పైదాడి అన్న‌ట్లుగా ప్ర‌కాశ్ రాజ్ చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. తాజాగా తిరుప‌తి ల‌డ్డూ వివాదంలోనూ అదే విధానాన్ని ప్ర‌కాశ్ రాజ్ అనుస‌రించ‌డం హిందువుల‌ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి విష‌యంపై జ‌న‌సేన అధినేత‌, ఏపీ ఉపముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేశారు. భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంద‌ని పవన్ పేర్కొన్నారు. దీనికి ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. త‌న హిందుత్వ వ్య‌తిరేక వాదాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందుత్వం గురించి మాట్లాడేట‌ప్పుడు ప్ర‌కాశ్ రాజ్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. నా ట్వీట్‌ను స‌రిగ్గా చ‌దివి అర్ధంచేసుకోండి.. నేను 30వ తేదీ త‌రువాత వ‌స్తాను.. అప్పుడు మాట్లాడ‌తాను అంటూ రిప్లై ఇచ్చాడు. కానీ, హిందువుల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సత్యం సుందరం చిత్రం ఈవెంట్‌లో హీరో కార్తీ పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో యాంక‌ర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు.. ల‌డ్డూ విష‌యం ఇప్పుడ చాలా సెన్సిటివ్ దాని గురించి మాట్లాడొద్దంటూ వ్యాఖ్యానించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కార్తీ వ్యాఖ్య‌ల‌ను కూడా త‌ప్పుబ‌ట్టారు. వెంట‌నే కార్తీ స్పందించి... పవన్ సర్ ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారి తీశాయి. అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికాడు. ప‌వ‌న్   అందుకు కార్తీని అభినందించారు. కానీ, ప్ర‌కాశ్ రాజ్‌లో మాత్రం హిందుత్వ‌పై వ్య‌తిరేత క‌ట్ట‌లు తెచ్చుకుంటూనే ఉంది. త‌న‌కు సంబంధంలేని ప‌వ‌న్‌, కార్తీ మ్యాట‌ర్ లోకి ప్ర‌కాశ్ రాజ్‌ త‌ల‌దూర్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నీదికాని విష‌యంలో నువ్వెందుకు త‌ల‌దూర్చుతున్నావ్ అంటూ ఆయ‌నపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ల‌డ్డూ వివాదం విష‌యంలో ప్ర‌కాశ్ రాజ్ దూకుడు వెన‌క ఎవ‌రు ఉన్నార‌నే విష‌యం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్ర‌కాశ్‌రాజ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు వైసీపీ నేత‌ల‌తోనూ ఆయ‌నకు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

ప్ర‌కాశ్ రాజ్ జీవితంలోకి ఓసారి తొంగిచూస్తే ఆయ‌న నిత్యం వివాదాల‌ను కోరుకుంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డంలో దిట్ట అనే విష‌యం అర్ధ‌మ‌వుతుంది. త‌ద్వారా ప్ర‌తీ విష‌యాన్ని రాజ‌కీయం చేయాల‌ని చూస్తుంటారు. భార‌త‌దేశంలో హిందుత్వ గురించి మాట్లాడితే త‌ప్పుచేసిన‌ట్లుగా ప్ర‌కాశ్ రాజ్ మాట‌లు ఉంటాయి. బీజేపీపై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్ర‌కాశ్ రాజ్ పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు.  తొలి నుంచీ కూడా  అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూరుస్తూ మ‌తాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నారన్న విమ‌ర్శ‌లు ప్రకాశ్ రాజ్ పై ఉన్నాయి.  దేశంలో బీజేపీ, హిందుత్వ ఉండ‌కూడ‌దు అనే ప‌రిస్థితికి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

తాజాగా తిరుప‌తి ల‌డ్డూ వివాదం విష‌యంలోనూ ప్ర‌కాశ్ రాజ్‌ అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చారు. తిరుప‌తి ల‌డ్డూ గురించి మాట్లాడితే ముస్లిం, క్రైస్త‌వుల‌పై దాడి చేయ‌టమే అనే వాద‌న‌ను ఆయ‌న తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఆలోచ‌న‌లు బ‌ట్టిచూస్తే.. హిందూ ధ‌ర్మాన్ని న‌మ్మ‌డం అంటే ఇత‌ర మతాల‌ను ద్వేషించ‌డ‌మా..? 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంద‌ని పవన్ అంటే.. ప్ర‌కాశ్ రాజ్‌కు వ‌చ్చిన నొప్పి ఏమిటి?  కార్తీ క్ష‌మాప‌ణ‌లు చెబితే ప్ర‌కాశ్ రాజ్‌కు ఇబ్బంది ఏమిటి?  ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రు ఉన్నారు? ఆయ‌న ద్వారా మ‌తాల మ‌ధ్య అల్ల‌ర్లు సృష్టించేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తున్నారా?  నిత్యం మీడియాలో క‌నిపించాల‌ని ప్ర‌కాశ్ రాజే అలా చేస్తున్నారా? ఆయ‌న ఉద్దేశం ఏదైనా.. ఆయ‌న వెన‌క ఎవ‌రు ఉన్నా.. స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ బోర్డు ఏర్పాటు చేయ‌డం అంటే.. ఇత‌ర మ‌తాల‌పై దాడి చేయ‌డం కాద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికైనా ప్ర‌కాశ్ రాజ్ గుర్తిస్తే బాగుంటుంది. అలాకాకుండా..  స‌మ‌సిపోయిన వివాదాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తేవాల‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించి దేశ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌య‌త్నిస్తే హిందువుల నుంచే కాదు.. ముస్లిం, క్రైస్త‌వుల నుంచి కూడా ఆయ‌న ప్ర‌తి దాడులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.