వాతావరణ వీరులు!!

 

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో వారం రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు.


చెన్నై తీరం దాటనున్న తుఫాను. ఆ సమయంలో వేగంగా గాలులు ఉంటాయని, వర్షాపాతం ఉధృతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.


ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువ ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వాతావరణ శాఖ.


మారుతున్న ఋతుపవనాల దిశ. 


గాలిలో తేమశాతం తగ్గుతోందని సమాచారం.


పైవన్నీ వాతావరణ నివేదికల్లాంటివి కానీ అవన్నీ ప్రస్తుతానికి అసలు ఆంబంధం లేనివి. మరిప్పుడెందుకు  ఇవన్నీ అంటే…..


భారతదేశంలో  ఎన్నో రంగాలు ఉన్నాయి. రైల్వే, వైమానిక, జల, సైనిక వంటి రంగాలు అన్నీ  ప్రజలకు సేవలు అందిస్తున్నవే. అయితే ప్రజలకు ఎప్పుడూ తక్షణ సమాచారాలు అందిస్తూ, విరామం లేకుండా సాగే మరొక రంగం వాతవారణ శాఖ. Indian meteorological department ద్వారానే అన్ని రంగాలు సవ్యంగా సాగుతున్నాయనేది అక్షరసత్యం. ఆకాశంలో విమానాలు సరైన దిశలో ప్రయాణం చేయడానికి అందించే తోడ్పాటు నుండి సాధారణ వర్షపాతాలు, రోజువారీ వాతావరణ నివేదికలు, రైల్వే రంగాలకు, సముద్ర ప్రయాణాలకు ఇలా అన్ని విధాలుగా తమ సేవలను అందిస్తున్నది వాతావరణ శాఖ.


ఇంకా ముఖ్యంగా ప్రకృతీ విపత్తులు సంభవించినప్పుడు వారు అందించే అత్యవసర సేవలు, నిమిష నిమిషానికి అందించే నివేదికలు, వాటి ఆధారంగా తీసుకునే జాగ్రత్తలు ఎన్నో ప్రాంతాలను, ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలను కాపాడుతూ వస్తున్నాయి.


అలుపెరుగని సేవలు!!


స్కూళ్ళు, బ్యాంకులు, మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం, పండుగ, ప్రభుత్వం ప్రకటించిన ఇతర ప్రత్యేక దినాలలో సెలవులు ఉంటాయి. కానీ ఈ వాతావరణ శాఖకు సెలవు అంటూ లేదు. సూర్యుడికి, చంద్రుడికి, పవనాలకు విరామం లేనట్టే ఈ శాఖ కూడా నిరంతరం గడియంరంలో ముల్లుతోపాటు పనిచేస్తూనే ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వాతావరణంలోని తేమ, గాలుల దిశ ఆధారంగా రోజువారీ నివేదికలు అందిస్తూనే ఉంటుంది. నైటౌట్లతో మెలకువగానే ఉంటుంది.


అన్నిటికీ ఆధారం!!


మనిషి మనుగడకు ఈ ప్రకృతి ఎంత ముఖ్యమైనదో, మనిషి కార్యకలాపాలకు ప్రకృతి స్థితి గతులు అంతే ముఖ్యమైనవి. ముఖ్యంగా భారతీయ ముఖ్య రంగం అయిన వ్యవసాయం పూర్తిగా వాతావరణ హెచ్చరికల ఆధారంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తుంది. వ్యవసాయానికి, వర్షపాతానికి, వాతావరణ శాఖకు ఉన్న అవినాభావ సంబంధం మాటల్లో చెప్పలేనిది. అలాగే ప్రయాణాల విషయంలో వాయు మార్గాలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జలమార్గాలు అయిన ఇండియన్ నేవీ వంటివి వాతావరణ శాఖ సహాయంతో భారతీయ సైనిక దళం అయిన ఇండియన్ ఆర్మీ తో సమానమైన సేవల్ని అందిస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు.


చిన్నప్పుడు పుస్తకాలలో వాతావరణం, నీరు, తేమ, ఆర్థ్రత, ఉష్ణోగ్రత, గాలులు, పవనాలు, దిశలు, తుఫానులు, వర్షాపాతం వంటి వాటిని అనుసంధానం చేసుకుని, మానవ మనుగడకు అవసరమైన ఎన్నో రంగాలతో అనుసంధానమైన వాతావరణ శాఖ గురించి అందులో ఉద్యోగాల గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతం యువత ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఆఫీసర్లు వంటి వాటివైపే దృష్టి పెడుతున్న తరుణంతో ఇతర రంగాల మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

                                                                                                               ◆వెంకటేష్ పువ్వాడ.

 

Related Segment News