సీఎంల‌ జ‌ల‌క్రీడ‌.. స్నేహం ముసుగులో వైరం!.. ఇక స‌మ‌ర‌మేనా?

అవును, వాళ్లిద్ద‌రూ కౌగిలించుకున్నారు. పుష్ప‌గుచ్చాలు ఇచ్చుకున్నారు. శాలువాలు క‌ప్పుకున్నారు. క‌లిసి భోజ‌నం చేశారు. క‌లిసి చ‌ర్చించుకున్నారు. అధికారులూ రోజుల త‌ర‌బ‌డి మాట్లాడుకున్నారు. ఆ సీన్ల‌న్నీ చూసి.. ఇక జ‌ల‌వివాదం స‌మ‌సిపోయింద‌ని అనుకున్నారంతా. విడిపోయిన తెలుగురాష్ట్రాలు క‌లిసిపోయాయ‌న్నంత సంతోషం. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మంచి దోస్తుల‌య్యార‌నే సంబ‌రం. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఆవిష్కృత‌మైందీ జ‌ల‌దృశ్యం. ఇక ఆల్ ఈజ్ వెల్‌. ఆల్ ప్రాబ్ల‌మ్స్ సాల్వ్డ్ అనుకున్నారంతా. 

క‌ట్ చేస్తే, అది మూన్నాళ్ల ముచ్చ‌టేన‌ని ఇంత‌కుముందే తేలిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ వాట‌ర్ వార్ ముదురుతోంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మొండికేస్తున్నారు. త‌గ్గేదే లే అంటూ జ‌ల‌జ‌గ‌డానికి సిద్ద‌మైపోయారు. ఒక‌రిది ఇంకొక‌రికి త‌ప్పులా క‌నిపిస్తోంది. ఎవ‌రి లెక్క‌ల్లో వాళ్లు త‌మ‌దే ఒప్పు అంటున్నారు. మా నీళ్లు మాకే సొంతం. మా ప్రాజెక్టులు మా ఇష్టం. ఇక చ‌ర్చ‌లు.. చ‌ర్చించుకోవ‌డాలు లేవ్‌.. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులే ముఖ్యం.. అంటూ ఎవ‌రికి వారే పంతానికి పోతున్నారు. స‌మ‌రానికీ సై అంటున్నారు. ముఖ్య‌మంత్రుల త‌ర‌ఫున మంత్రులు రంగంలోకి దిగి.. మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. దేనికైనా రెడీ అంటూ జ‌ల‌ఖ‌డ్గం రువ్వుతున్నారు.

పోతిరెడ్డిపాడు. ఇదే ప్ర‌స్తుత వివాదానికి మూలం. నిబంధ‌న‌ల‌కు లోబ‌డే సామ‌ర్థ్యాన్ని పెంచుతామ‌ని ఏపీ స్ప‌ష్టం చేస్తోంది. గ‌ట్లైతే మేం ఒప్పుకోమంటూ తెలంగాణ తిర‌గ‌బ‌డుతోంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే.. పాల‌మూరు-రంగారెడ్డి గ‌తి ఏంటంటూ గొడ‌వ ప‌డుతోంది. అది అంత‌కంత‌కూ ముదిరి.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ కేబినెట్ వ‌ర‌కూ వ‌చ్చింది. ఏపీ తీరుపై సీఎం కేసీఆర్ గ‌రంగ‌రం అయిన‌ట్టు తెలిసింది. మ‌నోడే గ‌దాని మంచిగుంటే.. గిట్ల చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కేసీఆర్.. జ‌గ‌న్‌పై ఫైర్ అయ్యార‌ని అంటున్నారు. వైఎస్సార్ కంటే మోనార్క్‌లా ఉన్నాడంటూ.. జగన్ తీరుతో ఏపీకే నష్టమంటూ వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది.

అయితే, కేసీఆర్ అంటే కాస్త భ‌యం భ‌యంగా ఉండే ఏపీ మంత్రులు ఈసారి మాత్రం గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. రెండుమూడు రోజులు బాగా ఆలోచించుకున్నాక‌.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్నాక‌.. ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ అనిల్‌కుమార్ తెలంగాణ‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని గ‌ట్టిగానే నిలదీశారు మంత్రి అనిల్‌. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారంటూ.. కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారంటూ.. మంత్రి ఓ రేంజ్‌లోనే మండిపడటం మంట రేపుతోంది. త్వ‌ర‌లోనే నేర‌డి ప్రాజెక్ట్ ప్రారంభిస్తామంటూ నీళ్ల‌ మంట మ‌రింత ఎగ‌దోశారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక ఏపీ నుంచి ఈ స్థాయిలో తెలంగాణ‌పై ఎదురుదాడి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి.

ఏపీ నుంచి ఈ రేంజ్‌లో రివ‌ర్స్ అటాక్‌తో కంగుతిన్న తెలంగాణ‌.. అంత‌లోనే తేరుకొని.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే కౌంట‌ర్ అటాక్‌కు దిగింది. పాల‌మూరు జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు, ఏపీకి వీర లెవెల్‌లో వార్నింగ్ ఇచ్చారు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో మంచి నీళ్ల కోసం సహకరిస్తే అది జల దోపిడీ గా మారిందని మంత్రి మండిప‌డ్డారు. పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పథకంపై అపెక్స్ కౌన్సిల్‌కి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మోసం చేస్తోంది జగన్ కాదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. స్నేహ హస్తం అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారని.. నోట్లో చక్కర.. కడుపులో కత్తెర.. అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు తెలంగాణ‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.

‘‘తాము పైన ఉన్నాం. ప్రాజెక్టులు ఎన్నయినా కొట్టుకోవచ్చు.. జగన్‌ను కేసీఆర్ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదు.. సీఎం కేసీఆర్ మంచికి మంచి వారు.. చెడుకు చెడ్డవారు.. పాలమూరును ఎడారి చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఏపీ మొండి వైఖరి కొనసాగితే మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం మాకు ఉందంటూ ఏపీకి ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. 

ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు మంత్రుల మాట‌ల‌తో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురిన‌ట్టే ఉందంటున్నారు. సీఎం కేసీఆర్‌, సీఎం జ‌గ‌న్‌ల మ‌ధ్య స్నేహం ముసుగు తొల‌గిపోయిందంటున్నారు. ఈ జ‌ల జ‌గ‌డం ఏ తీరాల‌కు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నీళ్ల కోసం మ‌ళ్లీ లొల్లులు త‌ప్ప‌వా? రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ ప్రాజెక్ట్ ఫైట్ మొద‌లైందా?