ఆ రాష్ట్రంలో గజదొంగను పట్టించిన ఈ రాష్ట్రం పోలీసు

ఒక ఐడియా జీవితాన్ని నిజంగా మారుస్తుందో లేదో తెలీదు కానీ.. ఒక చిన్న షేరింగ్ మాత్రం భారీ నేరస్తుల గుట్టు  బయట  పెట్టి తీరుతుంది. అందుకే విలువైన సమాచారం, ఎమర్జెన్సీ సమాచారాన్ని మాత్రమే సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. భారీ నేరాలు చేసి తప్పించుకుంటూ తిరుగుతున్న పేరుమోసిన నేరగాళ్లు సైతం వణికిపోతున్నారంటే అందుక్కారణం సోషల్ మీడియానే. 

ఇక వివరాల్లోకి వెళ్దాం. గత జులై 9వ తేదీన తమిళనాడులోని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనలో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడిన నేరస్తుణ్ని గుర్తించేందుకు స్థానికంగా వున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ను తిరువరక్కడు పోలీసులు పరిశీలించారు. విజువల్స్ అయితే ఉన్నాయి గానీ ఆ దొొంగ తాలూకు వివరాలు మాత్రం వారిదగ్గర లేవు. ఆ దొంగ ఎక్కడివాడు, పాత నేరాలేమైనా అతనిపై ఉన్నాయా.. అసలు ఆ దొంగను పట్టుకోవాలంటే ఎక్కణ్నుంచి విచారణ మొదలు పెట్టాలన్న కనీస సమాచారం కూడా ఆ సమయంలో వారికి అందుబాటులో లేదు. దీంతో  చెన్నై పోలీసాఫీసర్ కులశేఖరన్ బుర్రలో ఓ ఐడియా తట్టింది. వెంటనే ఆ రోజు జరిగిన నేరం తాలూకు వివరాలతో కలిపి నేరస్తుడి విజువల్స్ ను జాతీయ క్రైం విభాగానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అదే వాట్సాప్ గ్రూపులో వరంగల్ కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మీర్ మహమ్మద్ ఆలీ  ఆ విజువల్స్ తీసుకొని అప్పటికే తను సేకరించి పెట్టిన ఆ దొంగ తాలూకు వివరాల పూర్తి సమాచారాన్ని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పంపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు, ఆలీ పంపించిన సమాచారం ఒక్కటే కావడంతో తిరువరక్కడు పోలీసులు నిందితుణ్ని సులభంగా గుర్తించి అరెస్టు చేశారు. 

అంతేకాదు.. నిందితుడి నుంచి సుమారు 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేయడంలో ఆలీ ఇచ్చిన సమాచారం కీలకం కావడంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైవాల్.. మీర్ మహమ్మద్ ఆలీని  అభినందిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి క్యాష్ రివార్డు పంపించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ చేతుల మీదుగా ఆలీ క్యాష్ రివార్డు అందుకొని సాటి కానిస్టేబుల్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆలీ గతంలోనూ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాల్లో జరిగిన చోరీల్లో నిందితులను పట్టిచ్చారు. అలా ఇప్పటికే పలుమార్లు ఆలీని పలు విభాగాల పోలీస్ అధికారులు ఘనంగా సన్మానించారు. అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన నేరాల్లోని నిందితులను గుర్తించడంలో ఆలీ చాలా కీలక పాత్ర పోషించారు. ఇలా ఆలీలాగా ప్రతిఒక్కరూ తమకు అప్పగించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే క్రైమ్ రేట్ అతి తొందరగానే తగ్గిపోతుందని, శ్రేయోదాయకమైన సమాజం ఆవిర్భవిస్తుందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు