Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేవినేని - కేశినేని వార్ వెనుక కథేంటి?
posted on: Dec 29, 2014 2:04PM

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఈమధ్య ఓ సమావేశంలో విజయవాడలో పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ మీద ఆ మాటా ఈ మాటా మాట్లాడి, పనిలోపనిగా రాష్ట్ర మంత్రి, కృష్ణాజిల్లాలో బలమైన తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మీద కామెంట్లు కూడా చేశారు. ‘తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ జాగీరు కాదు’ లాంటి భారీ కామెంట్ కేశినేని నాని నోటి వెంట రావడం తెలుగుదేశం వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని నానిని పిలిపించి క్లాసు ఇవ్వడం, ఒక్క క్లాసుతోనే తనకు జ్ఞానోదయం కలిగిపోయినట్టుగా పొరపాటైపోయిందని కేశినేని నాని ప్రకటించడం ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని చూసిన వారికి ఇదేదో టీకప్పులో తుఫానులా అనిపిస్తుందిగానీ, దీని వెనుక భారీ రాజకీయ చదరంగ ఎత్తుగడ వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి సుప్రీంగా కొనసాగుతున్న దేవినేని ఉమ ప్రాబల్యాన్ని, ప్రాధాన్యాన్ని తగ్గించే ఎత్తుగడలో భాగంగానే ఈ తతంగమంతా జరిగిందని అంటున్నారు.
కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ సుప్రీం అయ్యారు. ఆయన్ని జిల్లాలో ‘చిన్న చంద్రబాబు’ అని పిలిచే స్థాయికి ఆయన ఎదిగారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక మహావృక్షంలా ఎదిగారు. ఆ మహా వృక్షం నీడలో తాము ఎదగలేకపోతున్నామన్న భావన పార్టీలోని ఇతర నాయకులలో వుంది. జిల్లాకి చెందిన ఏ విషయాన్నయినా చంద్రబాబు నాయుడు డైరెక్ట్‌గా దేవినేనితోనే చర్చిస్తూ వుండటం, ప్రతి విషయంలోనూ దేవినేని చురుకుగా అల్లుకునిపోతూ వుండటంతో ఒక్క కేశినేని నాని మాత్రమే కాకుండా అనేకమంది ఇతర నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న ఆవేదన పెరిగిపోయింది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేతకు స్పష్టంగా తెలియజేయాలన్న భావన అందరిలోనూ వుంది. అయితే పిల్లిమెడలో గంట కట్టే ధైర్యం ఇంతకాలం చేయలేకపోయారు. ఇప్పుడిక లాభం లేదని అందరి తరఫున కేశినేని నానిని రంగంలోకి దించారని తెలుస్తోంది. నాని చేసిన ఘాటు కామెంట్లతో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులలో ఉన్న ఆవేదన బయటపడింది. అది చంద్రబాబు నాయుడి దృష్టికి వెళ్ళింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చంద్రబాబు రంగంలోకి దిగేలా చేసింది. కేశినేనికి క్లాసు తీసుకోవడంతోపాటు కృష్ణాజిల్లాలోని పరిస్థితులను పరిశీలించడానికి సుజనాచౌదరిని నియమించే వరకూ వెళ్ళింది. ఒక దశలో లోకేష్ కూడా రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకూ కృష్ణాజిల్లాకు సంబంధించినంత వరకు దేవినేని చెప్పిందే వేదం. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లాలో పార్టీ పరిస్థితులను పరిశీలించడానికి మరొకరిని నియమించారంటే అది దేవినేని ప్రాధాన్యతని తగ్గించడంగానే భావించాలని దేవినేనిని వ్యతిరేకిస్తున్న వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాల ద్వారా తాము దేవినేని మీద విజయం సాధించినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని ఉదంతం కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలను బయటపడేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. దేవినేని వ్యతిరేక వర్గంలో వున్న అసంతృప్తిని తగ్గించడంతోపాటు మరోవైపు దేవినేని వర్గం హర్టవ్వకుండా వుండేలా చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం వుందని పరిశీలకులు అంటున్నారు.


.jpg)
.jpg)


