Top Stories

ఇలా ఏఐజీ నుంచి డిశ్చార్జ్.. అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి కొడాలి నాని

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న నానిని ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ ఏఐసీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొడాలి నానికి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు వాల్వ్ లు మూసుకుపోయాయనీ, స్టంట్ అమర్చాలి  లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కొసం ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని నిర్ణయించు కున్నారు. దీంతో వారి విజ్ణప్తి పేరకు ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నానిని డిశ్చార్జ్ చేశారు.  ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. ఈ ఎయిర్ అంబులెన్స్ లో కొడాలి నానితో పాలటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు,  అలాగే ఏఐజీ ఆస్పత్రికి సంబంధించిన ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు.
 ఇలా ఏఐజీ నుంచి డిశ్చార్జ్.. అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి కొడాలి నాని Publish Date: Mar 31, 2025 2:08PM

అధికార విపక్షాలకు వక్ఫ్ పరీక్ష !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో  అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు  అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా  కూటమి నాయకులు  వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు  విషయంలో పట్టు బిగిస్తున్నారు. ఇంతదాక ఒక లెక్క ఇక పై మరో లెక్క అంటున్నారు. ఒకరు గెలుస్తాం అంటుంటే  మరొకరు అదే జరిగితే అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు.  నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు అంశం  రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో రగులుతూనే వుంది. ఎంఐఎం సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  మరోవంక  ఎన్డీఎ ప్రభుత్వం, తగ్గేదే లే అంటోంది. పద్దతిగా  పనిచేసుకు పోతోంది. గతంలో విపక్షాల డిమాండ్ చేసిన విధంగా  వక్ఫ్‌ సవరణ బిల్లు పై ఏర్పాటు చేసి  జేపీసీ ఇచ్చిన నివేదికను  సవరణలతోసహ  కేంద్ర మంత్రి వర్గం  ఫిబ్రవరిలో ఆమోదించింది. అప్పుడే  బడ్జెట్ సమావేశాల్లో  వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. మరో వంక ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత షా, గత శుక్రవారం  ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశ పెడుతుందని  స్పష్టం చేశారు.   ఈ నేపథ్యంలో ఇప్పడు దేశ  రాజకీయ, మీడియాలో  సవరణ బిల్లుకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఎ భాగస్వామ్య  పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు  సామాన్య జనంలోనూ ఉత్కంఠ వ్యకమవుతోంది. ఆసక్తికర చర్చ జరుగుతోంది. వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్),లోక్ జనశక్తి(ఎల్జీపీ) రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది.  ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్  ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించడంద్వారా ప్రధాన ముస్లిం సంస్థలు జేడీయు పట్ల తమ అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఒక విధంగా చూస్తే  ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ముస్లిం సంస్థలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అటో ఇటో తెల్చుకోమని  అల్టిమేటం ఇచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ముస్లిం సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిం చట్ట సవరణకు ఒప్పించినట్లు  జేడీయు వర్గాలు చెపుతున్నాయి. తాజాగా  ఆదివారం (మార్చి 30) న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంమక్షంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనని, ఎన్డీఎ, మోదీ  చేయి’ వదలనని, చేతిలో చెయ్యేసి చెప్పినట్లు  చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే  ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని  గట్టి హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్డీఎ భాగసామ్య పక్షాలు బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో కొంచెం అటూ ఇటుగా ఉన్నా, బిల్లును వ్యతిరేకించక పోవచ్చునని అంటున్నారు.  అయితే, అంత మాత్రం చేత ఎన్డీఎలో అంతా బాగుందని కాదు కానీ బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. మరో వంక  ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే  ఉన్నాయని అంటున్నారు. నిజానికి  ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ వక్ఫ్  బిల్లు విషయంలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. అందుకే  ఇండియా కూటమి పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇటు అధికార ఎన్డీఎ కూటమికి అటు విపక్ష ఇండియా కూటమికి వక్ఫ్ బిల్లు పే..ద్ద.. పరీక్ష.. అంటున్నారు.
అధికార విపక్షాలకు వక్ఫ్ పరీక్ష ! Publish Date: Mar 31, 2025 12:50PM

ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులిటిన్ మేరకు కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఆయనకు స్టంట్ అమర్చడం కానీ ఆపరేషన్  కానీ చేయాల్సి ఉంది. అయితే కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి అభ్యర్థన మేరకు కొడాలి నానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.  కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్ లు పూర్తిగా మూసుకుపోవడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  అయితే కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కొంత కాలం చికిత్స అందించి, ఆ తరువాత అవసరం మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు.  
ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ Publish Date: Mar 31, 2025 12:28PM

శత్రువు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాణక్యుడు ఏం చెప్పాడంటే..!

  ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.  ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు.  ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.    చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.  ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా  ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.  శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి.  ఆ శత్రువు బలం,  బలహీనత ఆధారంగా ఒక వ్యూహం  రచించాలి.  ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి.  అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు.  అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సహనం,  సంయమనం.. చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం,  సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ,  ఓర్పు,  సంయమనం పాటించాలి.  సరైన సమయంలో  తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువును అయోమయంలో ఉంచాలి.. శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు,  ఉద్దేశాల గురించి తెలిస్తే వారు  మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన  బుద్ధి చెప్తూనే  ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.                                          *రూపశ్రీ.
శత్రువు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాణక్యుడు ఏం చెప్పాడంటే..! Publish Date: Mar 31, 2025 12:11PM

ఈ ఒక్క తప్పు శరీరంలో కాల్షియంను కోల్పోయేలా చేస్తుంది..!

శరీర బలం చాలా వరకు  ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎముకలు  మన అవయవాలకు లోపల  బయటి నుండి రక్షణ కల్పిస్తాయి. కానీ చాలా మందికి ఉండే ఒక తప్పుడు  అలవాటు  ఎముకలను బలహీనపరుస్తుందని  తెలుసా? నిజం ఆ ఒక్క తప్పు వల్ల  శరీరానికి అవసరమైనంత కాల్షియం తీసుకున్నా సరే.. అది స్పాంజ్ నీటిని పీల్చేసినట్టు.. ఆ ఒక తప్పు శరీరంలో కాల్షియంను పీల్చుకుని ఎముకలను పెళుసుగా మారుస్తాయి. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసుకుంటే.. సూర్యకాంతి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపానికి ప్రధాన కారణం ఎండలో బయటకు వెళ్లకపోవడమే.  ఎండలో కూర్చోవడం వల్ల  శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో కాల్షియంకు ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఉదయాన్నే  కొద్దిసేపు సూర్యుడి లేత కిరణాలు ఉన్నప్పుడు ఆ ఎండలో కనీసం 10 నుండి 30 నిమిషాలు గడపాలి. సూర్యకాంతి,  విటమిన్ డి.. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ముఖ్యమైనది.  ఈ విటమిన్-డి  అవసరాన్ని తీర్చడానికి,  కొంత సమయం ఎండలో కూర్చోవడం ముఖ్యం.సూర్యకాంతి శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పై పడినప్పుడు అది  శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అదే శరీరంలో తయారు అవుతుంది.  ఇలా విటమిన్-డి తయారు కాకపోతే.. విటమిన్-డి లోపం ఏర్పడి శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎండలో కూర్చోవడం తప్పనిసరి.. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు,   ఉష్ణోగ్రత పెరగుదల ఎక్కువ ఉంది.  ఖచ్చితంగా ఉదయం సూర్యరశ్మిని శరీరానికి సోకేలా ప్లాన్ చేసుకోవాలి.  ఎందుకంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల  విటమిన్ డి లోపంతో బాధపడవచ్చు. సూర్యకాంతికి ఏ  సమయం  మంచిది? ఆరోగ్య నిపుణులు ఉదయం 10 గంటల లోపు,  సాయంత్రం 4 గంటల తరువాత నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఎంత సమయం.. ప్రతి రోజూ సూర్యరశ్మి కనీసం 15 నుండి 30 నిమిషాలు శరీరానికి సోకేలా చూసుకోవాలి.  తీవ్రమైన ఎండ చర్మాన్ని దెబ్బతీస్తుంది.  కాబట్టి లేత సూర్య కిరణాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తుంది.                                *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఈ ఒక్క తప్పు  శరీరంలో కాల్షియంను కోల్పోయేలా చేస్తుంది..! Publish Date: Mar 31, 2025 12:03PM

పిఠాపురం వర్మపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులు.. ఉన్న కాస్త పరువూ పోతోందంటూ

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా తన విజయం వెనుక పిఠాపురం వర్మ ఉన్నారంటూ ఎక్ నాలెడ్జ్ చేశారు. అయితే  ఆ తరువాత పరిణామాలు వర్మకు, జనసేనకు మధ్యగ్యాప్ వచ్చేందుకు కారణమయ్యాయి. ఇటీవల జనసేన ఆవిర్భావం సందర్భంగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన నాగబాబు చేసిన ఖర్మ వ్యాఖ్యలు ఈ దూరాన్ని మరింత పెంచాయి. అయితే పిఠాపురం వర్మ మాత్రం తాను చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో, వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పిఠాపురం వర్మ మాత్రం సంయమనాన్నే పాటిస్తున్నారు.   అయితే వర్మ విషయంలో వైసీపీ మాత్రం నానా హంగామా చేస్తున్నది. వర్మకు తామే శ్రేయోభిలాషులం అన్నట్లుగా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నది. ఆయన నోటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాకపోయినా... వర్మ వైసీపీ గూటికి చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో  అంటే 2029లో పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు గట్టి పట్టు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది.  ఆ తర్వాత తెలుగుదేశంలో  చేరిన వర్మ… పార్టీకి,  పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పినంతనే… వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటుగా జనసేనానికి మద్దతుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయంలో  కీలక పాత్ర పోషించారు.  అయితే…పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తే,..ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకు ఇచ్చిన హామీని చంద్రబాబు అనివార్య కారణాల వల్ల నిలబెట్టుకోలేదు.  దీంతో  వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనీ, ఆయన త్వరలో వైసీపీ గూటికి చేరతారనీ ఆ పార్టీ  సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది. 2029 ఎన్నికలలో పిఠాపురం వర్మ వైసీపీ అభ్యర్థిగా పవన్ కు ప్రత్యర్థిగా నిలబడతారంటూ ఊదరగొట్టేస్తోంది. అయితే  ఈ ప్రచారంపై వర్మ నుంచి స్పందన లేదు. ఆయన తెలుగుదేశం పట్ల తన విధేయతను పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన అనుచరులను సముదాయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి పని చేసుకుపోతున్నారు. జనసేనతో తనకు విభేదాలు లేవని చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. అనవసర, అసత్య ప్రచారాలతో వైసీపీ ఉన్న కాస్త పరువునూ పోగొట్టుకుంటోందంటూ పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. 
పిఠాపురం వర్మపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులు.. ఉన్న కాస్త పరువూ పోతోందంటూ Publish Date: Mar 31, 2025 11:04AM