నటి జత్వాని వేధింపుల కేసులో ఐపిఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు 

ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడ గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది.  మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.  2025 సెప్టెంబరు 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు  ప్రభుత్వం  ప్రకటించింది.  రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ  అయ్యాయి. ఈ అధికారులు ముగ్గురు అఖిలభారత సర్వీసు నిబంధనల్ని పూర్తిగా  ఉల్లంఘించారని  అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైకాపా హాయంలో ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారుల  చేసిన అరాచకాలు   కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 
 నటి జత్వాని వేధింపుల కేసులో  ఐపిఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు  Publish Date: Mar 12, 2025 6:50PM

కూటమిలో త్యాగం.. తెలుగుదేశానికేనా?

ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలికి కూటమి పక్షాన బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక పట్ల మఖ్యమంత్రి చంద్రబాబు సర్దుకుపోయినట్లు కనిపించినా,  ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. అందుకు అయితేళ్ల వైసీపీ పాలనా కాలంలో వీర్రాజు తెలుగుదేశం పట్ల, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరే కారణం. పొత్తు ధర్మంగా చంద్రబాబు చెప్పినా, ఆ పార్టీ క్యాడర్, ఆయన అభిమానులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. పొత్తు ధర్మం తెలుగుదేశానికేనా? బీజేపీకి, జనసేనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.  కూటమిలో భాగంగా  ఒక సీటు పొందినా, అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీలు తమ ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకున్నాయి గానీ, ఎన్నికల నాడు తమ కోసం త్యాగం చేసిన వారిని జనసేన పట్టించుకోవచ్చు గదా! పోనీ మరో మిత్రపక్షం బీజేపీ, అభ్యర్థి విషయంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం, దాని నాయకుడు చంద్రబాబు నాయుడిని కనీస ధర్మంగాననైనా సంప్రదించాలి కదా! సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తుందనే విషం బహిరంగ రహస్యమే కదా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  ీవీరెడ్డి రాజీనామా తరువాత, సోము వీర్రాజు ఎంపిక అనేది తెలుగుదేశం వర్గాలతో పాటు, సగటు రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబు వేసిన రెండో తప్పటడుగు కింద భావిస్తున్నారు.  నాయకుడు ఇంత మెత్తగా ఉంటే, రేపు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.  అయిదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు ఇస్తారని అందరూ భావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్రకటించింది. అందువల్ల పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా ఆశపెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కల్యాణ్ ప్రమేయంతో అప్పట్లో అవకాశం వదులు కున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని తాజాగా అందరూ భావించారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఒక అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అఖరి నిముషం వరకూ ప్రస్తావనే లేని బీజేపీ ఆఖరు నిముషంలో అయిదే సీట్లలో ఒకటి తన్నుకుపోవడంతో ఆశావహులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమకు పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందనీ, నామినేషన్ కు సమాయత్తం అవుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారైందని అంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా నాయకులు ఎవరైనా ఈ మార్పు వెనుక రాజకీయాలు నెరపారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ అనుచరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు నేతలు, ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు కలిసి అమిత్ షా దగ్గర బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు సీటుకు లాబీయింగ్ చేశారని ఒక ప్రచారం జరుగుతోంది.  అందుకే ఆఖరు నిముషంలో వీర్రాజు బీ ఫారం పొందడంలో కూడా హడావుడి అయ్యిందంటున్నారు.  ఏమైతేనేమి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే ఆఖరు కాకున్నా, వచ్చిన బస్ మిస్ అయినట్లుగా భావిస్తున్న ఆశావహులు మాత్రం తమ అనుచరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని సమాధానపరచలేక సతమతమౌతున్నారు. 
కూటమిలో త్యాగం.. తెలుగుదేశానికేనా? Publish Date: Mar 12, 2025 5:17PM

జగన్ కు ఇచ్చి పడేసిన విజయసాయి!?

వైసీపీ భయమే నిజమైంది. ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ పార్టీ ఆబోరు గంగలో కలిసింది. కాకినాడ పోర్టు షేర్ల బదిలీ కేసులో విజయవాడలో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి బుధవారం (మార్చి 120 హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనను ఉద్దేశించి భయం, ప్రలోభాలు, విశ్వసనీయత అంటూ చేసిన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. తాన రక్తంలోనే భయంలేదన్నారు. తాను ప్రలోభాలకు లొంగలేదన్నారు, విశ్వసనీయత లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తనకూ ఆయనకు మధ్య అగాధం ఏర్పడిందని   వైరాగ్యం ప్రదర్శిస్తూనే జగన్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మంచోడే  అంటూనే  ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు.   రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి నోటి వెంట వచ్చింది మాత్రం రాజకీయమే.  వైసీపీకి భవిష్యత్ లేదని చెబుతూనే.. జగన్ కోటరీని దాటి బయటకు వస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. కాకినాడ పోర్టు విషయంలో కానీ, మద్యం కుంభకోణంలో కానీ జగన్ పాత్ర లేదని అంటూనే...కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్తకర్మక్రియ అంతా జగన్ సమీప బంధువు, వైసీపీ సీనియర్ నాయకుడు వైవీసుబ్బారెడ్డి పుత్రరత్నమేనని కుండబద్దలు కొట్టేశారు. అలాగే మద్యం కుంభకోణం అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పుణ్యమేనన్నారు. పరిశీలకులు మాత్రం ఇలా చెప్పడం ద్వారా ఆయన జగన్ ను నిండా ఇరికించేసినట్లేనని విశ్లేషిస్తున్నారు. తాను రాజకీయం వదిలేసి సేద్యం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి, భవిష్యత్ లో వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా కమలం గూటికి చేరే అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచానని చెప్పకుండానే చెప్పారు.   విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా ఆయన కేసు గురించి కంటే ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడారు.  వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న ఆయన అందుకు కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీయే అన్నారు. ఆ కోటరీ కారణంగానే జగన్ కూ తనకూ మధ్య అగాధం ఏర్పడిందన్నారు. వాస్తవానికి  ఒకప్పుడు జగన్ కోటరీలో విజయసాయే కీలకం. ఈ తరువాత కారణాలేమైతేనేం జగన్ కు విజయసాయి దూరమయ్యారు. తాను దిగిన ఒక్కో మెట్టూ వేరే వాళ్లకు పార్టీలో ఎదగడానికి సోపానంగా మారిందంటూ.. అన్యాపదేశంగా సజ్జలను దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా విజయసాయి జగన్ కు కొన్ని సుద్దులు కూడా చెప్పారు. నాయకుడనే వారు చెప్పుడు మాటలు వినకూడదు, విన్నా నమ్మకూడదన్నారు. అలా వినడం, నమ్మడం వల్ల పార్టీ, నాయకుడు కూడా నష్టపోతాడని విజయసాయి జగన్ కు హితవు చెబుతున్నట్లు చెబుతూనే అన్యాపదేశంగా జగన్ నాయకుడే కాదని తేల్చేశారని పరిశీలకులు అంటున్నారు.  ఆయన మీడియా సమావేశంలోనే ఒక విధంగా వైసీపీని దాదాపు బట్టలూడదీసి నిలబెట్టేశారు. ఇక సీఐడీకి ఏం చెప్పి ఉంటారన్న కంగారు వైసీపీలో వ్యక్తం అవుతోంది.    
జగన్ కు ఇచ్చి పడేసిన విజయసాయి!? Publish Date: Mar 12, 2025 4:36PM

హైకోర్టులో పోసాని లంచ్ మోషన్ పిటిషన్  

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని గుంటూరు సిఐడి పోలీసులు  కర్నూలుజైలులో అదుపులోకి  తీసుకోవడాన్ని  సవాల్ చేస్తూ వైసీపీ లీగల్ వ్యవహారాల ఇన్ చార్జి పొన్నవోలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎపిలోని 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో పోసానిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. తొలి రిమాండ్ రాజంపేట సబ్ జైలు కు తరలించారు. నరసారావుపేట పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. ఆదోని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. పోసానికి బెయిలు వచ్చినప్పటికీ గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ తో అడ్డుకున్నారు. దీంతో పోసాని తరపు న్యాయవాది అయిన పొన్నవోలు హైకోర్టులో  లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.   
హైకోర్టులో  పోసాని లంచ్ మోషన్ పిటిషన్   Publish Date: Mar 12, 2025 2:45PM

ఇప్పుడిక చెవిరెడ్డి వంతు!

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా రెచ్చిపోయి నింబంధనలకు తిలోదకాలిచ్చి దోపిడీ, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరిని ఇప్పుడు చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడానికి రంగం సిద్ధమైపోయినట్లే కనిపిస్తోంది. దౌర్జన్యాలు, దోడిపీలు, నిబంధలన ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడి, సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీ నాయకులపై ఇష్టారీతిగా పోస్టులు పెట్టిన వారు ఒకరి తరువాత ఒకరుగా కటకటాల పాలౌతున్నారు. బోరుగడ్డతో మొదలెడితే.. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిలు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ వంటి వారి కోర్టులను ఆశ్రయించి తాత్కాలిక ఉపశమనం పొందారు. ఇప్పుడిక చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  గత ఏడాది ఎన్నికల సమయంలో  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి చెవిరెడ్డిపై ఐదు కేసులు నమోదయ్యాయి. తాజాగా  ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు కోడ్‌ను ఉల్లంఘించారని చెవిరెడ్డి మీద కేసు నమోదు చేశారు.   చెవిరెడ్డికి నోటీసులు బుధవారం (మార్చి 12) నోటీసులు జారీ చేశారు.  గత ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎర్రగొండ పాలెం పీఎస్ లో మూడు కేసులు, అలాగే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్‌ కోడ్‌ను చెవిరెడ్డి ఉల్లంఘించారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్‌ పరిధిలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ  కేసుల్లో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను  చెవిరెడ్డి బెదిరించారన్న కేసు కూడా ఉంది. తమకు అనుకూలంగా పని చేయడం లేదంటూ చెవిరెడ్డి ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖ మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ ఐదు కేసులకు సంబంధించి తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి  నోటీసులు జారీ చేశారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న వేళ చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  దీంతో ఇప్పుడిక చెవిరెడ్డి వంతు అన్న భావన వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతోంది. 
ఇప్పుడిక చెవిరెడ్డి వంతు! Publish Date: Mar 12, 2025 2:28PM