విజయసాయి వర్సెస్ వైసీపీ.. ఏం జరుగుతోంది?

ఎన్నికల్లో  ఘోర పరాజయంతో వైసీపీ కష్టాలు ద్విగుణీకృతమయ్యాయి. అసలా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.  తొలుత పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ విజయసాయిరెడ్డే రోడ్డెక్కారు. అయితే నేరుగా ఎవరి పేరూ ఆయన బయట పెట్టకపోయినా.. ఆయన ఆరోపణల టార్గెట్ వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జలేనని ఎవరికైనా తేలిగ్గానే అర్ధం అవుతుంది.  ఒక సమయంలో వైసీపీలో అత్యంత కీలకంగా, ఇంకా చెప్పాలంటే నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి  ఇప్పుడు మాత్రం పార్టీలోనూ, విపక్షాల నుంచీ కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ఆయన ఆరోపణలను ఖండించలేదు. ఒకరకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డిపై ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేశాయి.  

ఈ నేపథ్యంలోనే తనపై ఈ ఆరోపణలు రావడం వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలే అన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలో వైసీపీ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా,  ఆయన పార్టీలో కీలక నేత అయినా విశాఖకు చెందిన వైసీపీ నేతలెవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. మీడియా సమావేశంలో ఆయన పక్కన కనిపించడానికి కూడా ఇష్టపడలేదు.  దీనిని బట్టే హై కమాండ్ కూడా ఆయన పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేదన్న విషయం అర్ధమౌతుంది.  ఇందుకు కారణం నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి.. అక్కడ విజయం కోసం ఏ మాత్రం ప్రయత్నించలేదనీ, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లుగా వ్యవహరించారనీ పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగన్ ఆయన పట్ల కినుకగా సుబ్బారెడ్డిని నియమించారని అంటున్నారు.    

ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సొంత చానెల్ ప్రకటన చేశారు. విశాఖ వేదికగానే ఆయనీ ప్రకటన చేశారు. గతంలో కూడా ఆయన సొంత చానల్ మాట ఎత్తారు కానీ, ఆ తరువాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం తాను ప్రారంభించబోయే సొంత చానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్నదానితో సంబంధం లేకుండా న్యూట్రల్ గా వ్యవహరిస్తుందని చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఆయన తాను ఇంత కాలం కొన్ని పత్రికలపై చేస్తున్న విమర్శలను పునరుద్ఘాటించడమే కాకుండా, వైసీపీ సొంత మీడియాపై కూడా విమర్శలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దీంతో ఇక విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. విజయసాయి కూడా ఇప్పటికే ఆ భావనకు వచ్చేశారనీ, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించేశారనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  అంతే కాదు తాను ఒక్కడిగా కాకుండా మొత్తంగా వైసీపీ రాజ్యసభ సభ్యులందరినీ కమలం గూటికి చేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.