‘ఏరా’ విజయసాయిరెడ్డి!

‘శాంతి’కాముకుడు, విజయసాయిరెడ్డి, దగ్గర దగ్గర 70 ఏళ్ళ వయసుకు చేరుకున్న విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి... ఇలాంటి పెద్దమనిషిని ‘ఏరా’ అన్నామని అనుకోవద్దు.. ఎవర్ని పడితే వాళ్ళని ‘ఏరా’ అని పిలిచే కుసంస్కారం వున్నది విజయసాయిరెడ్డికే. మొన్నామధ్య ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులను ‘ఏరా’ అని విజయసాయిరెడ్డి పిలవటం ఏపీ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆగ్రహావేశాలను కలిగించింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన హోదాను వయసును మరచి మీడియా సంస్థలపై, జర్నలిస్టులపైనోరు పారేసుకోవటాన్ని  గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదిలా వుంటే, జర్నలిస్టులను ‘ఏరా’ అని పిలుస్తున్న విజయసాయిరెడ్డికి బుద్ధి రావాలంటే, ఆయనకు సంబంధించిన వార్త రాసినా, చదివినా ఆయన పేరు ముందు ‘ఏరా’ అనే విశేషణాన్ని చేర్చాలన్న అభిప్రాయాన్ని పలువురు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ విజయసాయిరెడ్డి పేరును ఉదహరించాలన్నా, ఆ పేరును ‘ఏరా’ విజయసాయిరెడ్డి అని పేర్కొనాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ‘ఏరా’ విజయసాయిరెడ్డిని దారిలో పెట్టి కరెక్ట్ ‘గాంధీగిరి’ అవుతుందని అంటున్నారు. ‘ఏరా’ విజయసాయిరెడ్డి దిగివచ్చి క్షమాపణలు చెప్పేవరకూ ఈ ‘ఏరా’ గాంధీగిరిని కొనసాగించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.