Top Stories

హైద్రాబాద్ లో పట్ట పగలు అడ్వకేట్ దారుణ హత్య 

హైద్రాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయిల్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇజ్రాయిల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే  ఉన్న మహిళపై  ఎలక్ట్రిషన్ దస్తగిరి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వేధింపుల గూర్చి అడ్వకేట్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో   అడ్వకేట్ ఇజ్రాయిల్ పై  దస్తగిరి కక్ష్య పెంచుకున్నాడు. అడ్వకేట్  సోమవారం విధులకు వెళుతున్న సమయంలో  మాటు వేసి  దస్తగిరి హత్యకు పాల్పడ్డాడు హత్య తర్వాత దస్తగిరి ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇజ్రాయిల్ హత్యకు నాలుగు రోజుల ముందే దస్తగిరి రెక్కీ నిర్వహించాడు. కాపు కాసి ఉదయం అడ్వకేట్ ను దుండగుడు  హత్య చేశాడు. ఘటన  తర్వాత కంచన్ బాగ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటన తర్వాత ఒక న్యాయవాది ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్య వ్యక్తికి రక్షణ ఏ విధంగా ఉంటుంది  అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 
హైద్రాబాద్ లో పట్ట పగలు అడ్వకేట్ దారుణ హత్య  Publish Date: Mar 24, 2025 6:24PM

వసూళ్ల లో ఆమె స్టైలే వేరు- ట్రాఫిక్ పోలీసుల తీరు!

  రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఎవరినైనా ఆపితే ఏం చేస్తాడు? హెల్మెట్, ఆర్సీ బుక్, లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి తనిఖీ చేసి ఏది తేడాగా కనిపించినా సరే వేల రూపాయల్లో చలానా కట్టవలసిందే అంటూ పుస్తకం పెన్ను తీస్తాడు. దానికి ఎవరైనా ఎలా స్పందిస్తారు?  సార్ సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్.. వదిలేయండి సార్.. ప్లీజ్.. వందో అయిదొందలో ఇస్తాను  అంటూ బ్రతిమాలుతారు! కాసేపు బ్రతిమాలిన తర్వాత వారిచ్చే సొమ్ము పుచ్చుకొని చలానా పుస్తకాన్ని తిరిగి సంచిలో పెట్టుకొని.. మరొకరి కోసం నిరీక్షిస్తాడు ట్రాఫిక్ పోలీసు!  తన నియోజకవర్గం పరిధిలో అడ్డగోలుగా అరాచకాలను సాగించడంలో మాజీ మంత్రి విడదల రజని అనుసరించిన వ్యూహం ఇంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు! అచ్చంగా ట్రాఫిక్ పోలీసుల లాగానే ఆమె భారీ మొత్తాలు జరిమానాలుగా చూపించి బెదిరిస్తూ, చిన్న మొత్తాలను గుట్టు చప్పుడు కాకుండా దండుకున్నారనేది ఆరోపణ. చిన్న మొత్తాలు అనగా ఏమిటనుకుంటున్నారో అథమపక్షం రెండు కోట్ల రూపాయలన్న మాట. విడదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ఏడాదిలో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత.. విడదల రజనికి రెండుకోట్లు, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా లకు చెరి పది లక్షల వంతున ముడుపులు సమర్పించినట్టుగా కేసు నమోదు అయింది. నమోదైన కేసు, ఆరోపణల ప్రకారం.. ఈ దందా సాగిన తీరు మాత్రం..  అచ్చంగా ట్రాఫిక్ పోలీసు వ్యవహారం లాగానే ఉన్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి.. స్టెప్ 1 : రజని తరఫున ఆమె పీఏ రామకృష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి.. మేడం వాళ్లను కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు.  స్టెప్ 2 : వారు వెళ్లి కలిసినప్పుడు.. తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే.. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని, మిగిలిన సంగతులు పీఏతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.  స్టెప్ 3 : వారం రోజులు కూడా గడవక ముందే అధికారి పల్లె జాషువా.. పెద్దఎత్తున సిబ్బంది మందీ మార్బలంతో క్రషర్ కు తనిఖీలకు వచ్చారు. క్షుణ్నంగా తనిఖీలు జరిపి వెళ్లిపోయారు. నెల తర్వాత ఫోను చేసి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తామని.. అలా కాకుండా ఉండాలంటే.. వెళ్లి రజని మేడం తో వ్యవహారం సెటిల్ చేసుకోవాలని బెదిరించారు.  స్టెప్ 4 : క్రషర్ యజమానులు మళ్లీ విడదల రజని వద్దకు వెళ్లి.. అయిదు కోట్ల రూపాయలు ఇచ్చుకోలేం అని.. బతిమాలి రెండుకోట్లకు బేరం కుదుర్చుకున్నారు.  స్టెప్ 5 : రజని సూచన మేరకు పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది గోపికి వద్దకు రెండు కోట్లరూపాయలు అందజేశారు. అలాగే ఆ గోపికి పది లక్షలు, అధికారి పల్లెజాషువాకు కూడా పది లక్షలు ముట్టజెప్పారు.  ..చూశారుగా.. జరిమానా వేస్తే వేలల్లో పడిపోతుందని బెదిరించి వందల రూపాయల ముడుపులు స్వీకరించే ట్రాఫిక్ పోలీసు వ్యవహారంలాగానే.. యాభై కోట్ల జరిమానా పడుతుందని బెదిరించి.. రెండు కోట్లు ముడుపుల కింద స్వీకరించడం.. విడదల రజని స్టయిల్ ఆఫ్ రాజకీయం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
వసూళ్ల లో ఆమె స్టైలే వేరు- ట్రాఫిక్ పోలీసుల తీరు! Publish Date: Mar 24, 2025 4:19PM

పాపం రియా చక్రవర్తి.. అయిదేళ్లు వేదనకి ఊరటేది?

ఆరోపణలతో కుంగిపోయింది.. అవమానాల్ని మౌనంగా భరించింది.. చేయని తప్పుకి జైలుకెళ్లింది.. దాదాపు ఐదేళ్ల పాటు సహనం కోల్పోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడింది. బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. మొత్తానికి రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సుశాంత్ సూసైడ్‌కి, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. సుశాంత్  కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్ట్‌‌లను సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనల్ని సీబీఐ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సుశాంత్ మరణంతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలతో.. రియా చక్రవర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చేయని తప్పుకు ఆమె 27 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా  రియా, ఆమె కుటుంబ సభ్యులు మౌనంగా భరించారు. కానీ.. సుశాంత్ మరణం తర్వాత వారిపై జరిగిన ప్రచారం, నిరాధార ఆరోపణలతో ఇంతకాలం వారెంతో కుంగిపోయారు. ఇప్పుడు రియాకు క్లీన్ చిట్ రావడంపై బాలీవుడ్ యాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు. అతని మరణవార్త బయటకు తెలిశాక కొందరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేదాకా  సుశాంత్ మరణానికి ఆవిడే కారణం అనుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంత జరిగినా.. రియా కుటుంబం మౌనంగానే ఉంది. తమతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నా సహనంతోనే ఉన్నారు. అయితే, ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు.. ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా? అనే ప్రశ్న తలెత్తితే.. ఎక్కడా సరైన సమాధానం దొరకట్లేదు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయ్. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది. కానీ.. దీనితోనే సమాజం వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? అనేదే.. అసలు ప్రశ్న. సుశాంత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత.. రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై, మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలతో.. ఆమెతీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థల విచారణని కూడా ఆమె ఎదుర్కొంది. తన సోదరుడితో పాటు రియా కూడా జైలు శిక్ష అనుభవించింది. సుదీర్ఘ కాలంలో ఇలాంటి పరిణామాల తర్వాత సీబీఐ నుంచి క్లీన్ చిట్ దొరకడం, రియాకు  నిజంగా ఓ విడుదలలా అనిపించొచ్చు. ముంబై స్పెషల్ కోర్టులో సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో, రియాకు ఎలాంటి నేరం ఆపాదించలేదు. దీంతో, ఆమెపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి దాదాపుగా తొలగిందనే చెప్పాలి. చట్టపరంగా కొంతవరకు ఆమెకు ఇది ఊరట కలిగించినా.. ఐదేళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడుల వల్ల.. రియా ఎదుర్కొన్న మానసిక వేదనని పూర్తిస్థాయిలో తొలగించదనే చెప్పాలి. రియా విషయంలో.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీలు.. ఆమెని నేరస్తురాలిగా చిత్రీకరించడం, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం లాంటివి విస్తృతంగా జరిగాయ్. ఈ పరిస్థితుల్లో.. ఆమె కెరీర్ దెబ్బతినడమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్లీన్ చిట్ ద్వారా.. ఆమెకు న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. సమాజంలో ఆమెపట్ల ఏర్పడిన అభిప్రాయాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు.. రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే.. రియా తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ క్లీన్‌ చిట్‌తో చట్టపరంగా కొంత విముక్తి దొరికినా.. ఆమె మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు, సమాజంలో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆమె మళ్లీ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ.. రియా అనుభవించిన వేదన, గతం తాలూకు గాయాలు అంత ఈజీగా మానిపోవు.
పాపం రియా చక్రవర్తి.. అయిదేళ్లు వేదనకి ఊరటేది? Publish Date: Mar 24, 2025 4:12PM

 తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా

హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది.  ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే  నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు   నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.  ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.   
 తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా Publish Date: Mar 24, 2025 4:11PM

విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు!?

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది.  లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో   అగ్నిప్రమాదం సంభవిం చడంతో ఈ నోట్ల కట్టల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది.   దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఎటువంటి బాధ్యతలూ అప్పగించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ వెంటనే   ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు. అలాగే నోట్ల కట్టల విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను నియమించింది.    
విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు!? Publish Date: Mar 24, 2025 3:33PM

స్వామి స్వరూపానంద భూ కబ్జాపై నోటీసులు

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగానే జగన్ కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపానందకు నోటీసులు జారీ అయ్యాయి. స్వరూపానంద స్వామికి చెందిన   ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల   ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తేల్చిన అధికారులు ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిం చాలని నోటీసులు జారీ చేశారు.   తొలుత చినముషిడి వాడలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. జగన్ హయాంలో ఈ కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 15 వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ స్వరాపానంద విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడీ నిర్మాణాలు తొలగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
స్వామి స్వరూపానంద భూ కబ్జాపై నోటీసులు Publish Date: Mar 24, 2025 3:05PM