తిరుపతిలో ముస్లిం యూనివర్సిటీ వివాదం

 

 

 

హిందువులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే, కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పాదాల చెంత వున్న తిరుపతి నగరంలో ఒక ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం వివాదస్పదమైంది. నోహెరా షేక్ అనే ముస్లిం మహిళ తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనన్నానని, ఇస్లామిక్ తత్త్వాన్ని ప్రచారం చేయడమే తమ యూనివర్సిటీ ప్రధానోద్దేశమని ప్రకటించడంతో వివాదం మొదలైంది.

 

నోహెరా షేక్ తిరుపతిలో ఎంతోకాలంగా మదర్సా నిస్వాన్ పేరుతో ఆడపిల్లలకోసం ఒక మదర్సాని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఏకంగా తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, అనుమతులు కూడా ఇచ్చేసిందని వార్తలు  రావడంలో తిరుపతిలో హిందూ మత సంస్థలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.



హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో ముస్లిం విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడమేమిటని? అది కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వడమేమిటని ఆ సంస్థల ప్రతినిథులు ఆగ్రహిస్తున్నారు. తిరుమలలో, తిరుపతిలో అన్యమత ప్రచారం చేయడం భావ్యం కాదని అంటున్నారు.  అయితే ఈ విషయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదు. అధికారులు ఎవరికి వారు ఇది తమకు సంబంధించిన విషయం కాదన్నట్టు కిక్కురుమనకుండా ఉండిపోతున్నారు. అయితే స్థానిక ప్రజల్లో ఈ అంశం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందూ సంస్థలు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా తిరుపతిలో ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదని వ్యతిరేకిస్తున్నారు.


తిరుమల-తిరుపతి చరిత్రలో కూడా భాగంగా వున్న హిందూ, ముస్లిం ఐక్యతకు భంగం కలిగించే చర్యలు మంచివి కాదని అంటున్నారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నవారు తమ ప్రయత్నాలు మానుకోవాలని ముస్లింలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో హిందూ సంస్థలకు తమ సహకారాన్ని అందిస్తామని తిరుపతిలో నివసిస్తున్న ముస్లింలు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏడుకొండలవాడే తన క్షేత్రాన్ని తానే రక్షించుకుంటాడు.