కోర్టులో పోసాని కొత్త డ్రామా?

గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు. బెయిలు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ దాదాపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినంత పని చేశారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, రెండు స్టంట్ లు వేశారనీ చెప్పుకున్నారు. తాను అడ్డూ అదుపూ లేకుండా చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించకుండా, తనపై వ్యక్తిగత కక్షతోనే ఫిర్యాదులు చేస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒకటి రెండు రోజులలో బెయిలు రాకుంటే ఆత్మహత్యే చేసుకుంటానని బెదరింపులకు దిగారు. అయితే న్యాయమూర్తి పోసానిని రిమాండ్ కు పంపారు. దీంతో పోసానికి  గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాస్తవానికి పోసానికి ఇతర కేసులలో బెయిలు లభించింది. అంతే కాదు ఆయనపై ఉన్న ఇతర కేసులలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి బుధవారం (మార్చి 12) విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా సీఐడీ రంగంలోకి దిగింది. పీటీ వారెంట్ పై ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో ప్రవేశ పెట్టింది.  బెయిలు, రిమాండ్ విషయాలను పక్కన పెడితే.. పోసాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్లుగానే చట్టాన్ని, న్యాయవ్యవస్థను కూడా మెప్పించేయగలనని భావిస్తున్నట్లు కనిపిస్తోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. గుండెనొప్పి డ్రామాను కడప రిమ్స్ వైద్యులు బట్టబయలు చేసిన తరువాత ఆయన ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం అంటూ కన్నీళ్ల డ్రామాకు తెరతీసినట్లుందని అంటున్నారు. అయినా ఆత్మహత్యే శరణ్యం అంటూ ఏకంగా కోర్టులోనే చెప్పిన పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.   
కోర్టులో పోసాని కొత్త డ్రామా? Publish Date: Mar 13, 2025 11:47AM

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి మరోసారి నోటీసులు 

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  మరోసారి  మాదాపూర్ ఇంటికి నోటీసులు అతికించారు. మొయినా బాద్ తోల్కట్ట ఫాం  హౌజ్ లో కోడి పందాలు నిర్వహిస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీకి గతంలో నోటీసులు ఇచ్చిన మొయినాబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేస్తూ శుక్రవారం విచారణకు రావాలని పేర్కొన్నారు.  గత నెలలో పోచంపల్లికి చెందిన ఫాం హౌజ్ లో  కోడి పందాలు  నిర్వహించారు. పోలీసులు దాడులు చేస్తే 64 మంది పట్టుబడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్సీ ని నిందితుడిగా చేర్చారు.  గతంలో పోచంపల్లి తన న్యాయవాది ద్వారా నోటీసులకు జవాబిచ్చారు. ఈ జవాబుకు సంతృప్తి చెందని మొయినాబాద్ పోలీసులు మరో సారి నోటీసులు జారి చేస్తూ పోచంపల్లిని వ్యక్తిగతంగా హజరు కావాలని పేర్కొన్నారు.  
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి మరోసారి నోటీసులు  Publish Date: Mar 13, 2025 11:42AM

విజయసాయి చంద్రబాబు మనిషట!.. కొత్తరాగం ఆలపిస్తున్న వైసీపీ

విజయసాయికీ చంద్రబాబు మనిషి అన్న ముద్ర వేసేసింది వైసీపీ.  విజయసాయిరెడ్డి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు. జగన్ ఆస్తుల కేసులలో విజయసాయి ఏ2. అంటే జగన్ సహ నిందితుడన్న మాట. అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకూ జగన్ తో కలిసి నడిచారు. జగన్ అధికార పతనంలో ఆయన ప్రమేయం ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక కచ్చితంగా విజయసాయి ఉన్నారు. అంతే కాదు.. జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యర్థులపై చేసిన దాడి కూడా ఎవరూ మరచిపోలేరు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు.. అందుకు ఉపయోగించిన భాష వైసీపీ బూతు నాయకులు ఉపయోగించిన భాషను  మించిన రేంజ్ లో ఉండేది. అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేశారు. ఇక రాజకీయాలకు దూరమని, వ్యవసాయమే తన వ్యాపకమనీ ప్రకటించి సంచలనం సృష్టించారు.  ఆయన వైసీపీకి దూరం కావడం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన కుటుంబ ఆడిటర్ కూడా.  జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి, ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకూ అన్నీ కూలంకుషంగా తెలుసు. అటువంటి విజయసాయి తనకు దూరమైనా, వ్యతిరేకంగా మారినా ఏమౌతుందో జగన్ కు తెలియనిది కాదు. అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తానని చెబితే జగన్  ఆపలేదు. పోనీ వెడితే వెళ్లాడులే అని మౌనంగానూ ఉండలేదు. విజయసాయి క్యారెక్టర్ లేని మనిషనీ, అటువంటి వాళ్లు వెళ్లిపోవడమే మంచిదన్నట్లుగా మీడియా ముందు చెప్పారు. జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు కూడా. విజయసాయి వైసీపీకి దూరమైన తరువాత జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. గతంలో అంటే తను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారీ చెప్పారు. అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ను అయిష్టంగా చదవినవేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించి.. తన సోదరుడి నిజస్వరూపం ఇదీ అని చాటారు కూడా.  ఆ తరువాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనమే మేలని జగన్ భావించి ఉంటారని అంతా భావించారు. అయితే కాకినాడ సీపోర్టు కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. జగన్ కు ఓ వైపు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరికించేశారు. అదే సమయంలో వైసీపీ భవిష్యత్, జనన్ వైఖరీ, ఆయన కోటరీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఐడీ విచారణలో కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడేననీ, అన్నిటికీ మించి కాకినాడ సీపోర్టు యమజాని వైవీరావు, వైవీసుబ్బారెడ్డిల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో వైసీపీ అలర్ట్ అయిపోయింది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వానికి తెరతీసింది. వైసీపీకి వ్యతిరేకులపై ఆ పార్టీ నేతలు సంధించే తొలి ఆస్త్రం వారు చంద్రబాబు సానుభూతిపరులు, ఆయనకు అనుకూలురు అనే. గతంలో జగన్ తో విభేదించి ఆయన సోదరిపై వైసీపీ ఇవే విమర్శలు చేసింది. ఆమెను చంద్రబాబు సానుభూతిపరురాలిగా అభివర్ణించింది. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు జగన్ పై విమర్శలు చేస్తున్నారంటూ నిందలు వేసింది. ఇప్పుడు విజయసాయిపైనా అవే విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.    విజయసాయి చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారంటూ ఆయనను చంద్రబాబు అనుకూలుడన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నది. గతంలో జగన్ కోసం విజయసాయి చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన విమర్శలను, దూషణలను ఇప్పు డు ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. విజయసాయిని చంద్రబాబు మనిషిగా చూపే ప్రయత్నం చేస్తున్నది.  
విజయసాయి చంద్రబాబు మనిషట!.. కొత్తరాగం ఆలపిస్తున్న వైసీపీ Publish Date: Mar 13, 2025 11:25AM

రంగుల జీవితం!

మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
రంగుల జీవితం! Publish Date: Mar 13, 2025 11:04AM

పోసానికి  మరో షాక్... గుంటూరు జైలుకు 14 రోజుల రిమాండ్ 

సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు 14  రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ మీద కర్నూలు జైలు నుంచి అదుపులోకి  తీసుకున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.  ఓబులాపురం పోలీసులు హైద్రాబాద్ లోని పోసాని నివాసంలో  అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడ నుంచి పోసాని ని నరసారావ్ పేట పోలీసులు  పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు తరలించారు.  పిటి వారెంట్ పై అదోని పోలీసులు  గుంటూరు జైలు  నుంచి అదుపులో తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు.  గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పై  కర్నూలు జైలు నుంచి  గుంటూరు జైలుకు తరలించారు. పిటి వారెంట్లను సవాల్ చేస్తూ  పోసాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కర్నూలు జైలు నుంచి బెయిల్ పై పోసాని విడుదల అవుతారని అందరూ ఊహించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో అరెస్ట్ లు అనివార్యమయ్యాయి.  సిఐడి కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు  వాదనలు సమయంలో పోసాని బోరున విలపించారు. 
పోసానికి  మరో షాక్... గుంటూరు జైలుకు 14 రోజుల రిమాండ్  Publish Date: Mar 13, 2025 10:38AM

వైవీ ఫ్యామిలీపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

కాకినాడ పోర్టు వాటాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు విచారించారు. విచారణలో సాయిరెడ్డి ఎవరిని ఇరికిస్తారో అని వైసీపీ పెద్దలు భయపడుతూ వచ్చారు.. అనుకున్నట్లు గానే ఆయన జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించే వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై బాంబులు పేల్చారు. పోర్టు వ్యవహారంలో కీలక పాత్ర విక్రాంత్‌రెడ్డిదే అని విచారణలో వెల్లడించినట్లు సాయిరెడ్డే స్వయంగా చెప్పడం విశేషం. ఆ క్రమంలో విచారణ తర్వాత ఆయన జగన్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యాలు, జగన్ కోటరీని టార్గెట్ చేసిన తీరు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసు లో ఏపీ సీఐడీ అధికారులు  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు.  సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. విచారణలో ఏం చెబుతారోనని వైసీపీ నేతలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అనుకున్నట్లే కాకినాడ పోర్టు వాటాల కేసులో బాంబు పేల్చారు. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారన్న అభియోగాలతో విజయసాయిపై కేసు నమోదైంది. కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. వైసీపీ నేత సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఏ-2గా, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించింది.  తాజాగా సీఐడీ విచారణలో కేవీ రావుతో వైవీ సుబ్బారెడ్డికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. వైవీ విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకి తాను పరిచయం చేసానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌ రెడ్డేనని తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని విచారణ తర్వాత సాయిరెడ్డి స్వయంగా మీడియాకి వివరించి వైసీపీ నేతల్ని ఉలిక్కి పడేలా చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయటంపై విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్‌ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.  జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కోటరీని  ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి... ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకూ, జగన్‌కి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్‌రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో అవమానాలు పాలయ్యానని.. తను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరీ నేతల్ని దెప్పిపొడిచారు.  దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్‌2గా వెలుగొందారు. పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పారు. అయితే ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరిగిందో జగన్ ఆయన్ని పక్కన పెడుతూ వచ్చారు. సజ్జలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మాటే జగన్‌ దగ్గర చెల్లుబాటు అయ్యేదంటారు. ఆ ముగ్గురే జగన్ కోటరీగా ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో కాకినాడ పోర్టు వాటాల కేసులో వైవీ సుబ్బారెడ్డిని డైరెక్ట్‌గా ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జగన్ కోటరీని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తుండటం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి తన భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి చేసిన సూచనలను జగన్ పాటిస్తారో లేదో చూడాలి
వైవీ ఫ్యామిలీపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి Publish Date: Mar 13, 2025 10:31AM