మహాకుంభమేళాకు ఉగ్రముప్పు?!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి 26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పుష్కారనికి ఒక సారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్న ఈ కుంభమేళాపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదులు సాధువుల రూపంలో దాడులకు తెగబడే అవకాశం ఉందన్నహెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.  
Publish Date: Jan 4, 2025 11:44AM

ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది.   పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగానే కార్మికులు భయంతో ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.  
Publish Date: Jan 4, 2025 10:53AM

రాష్ట్ర పండుగగా రథ సప్తమి.. ఏపీ సర్కార్ ప్రకటన

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రమంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా, ఘనంగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పంగుడగా ప్రకటించింది. తొలి సారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథ సప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ ఏర్పాట్లపై కలెక్టర్ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.  రథ సప్తమి వేడుకల కోసం లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆహ్మా నించారు. ఈ వేడుకలకు ప్రత్యేక లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఆహ్వానించారు.  రథ సప్తమి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆ రోజు సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో శోభాయాత్ర నిర్వహిస్తారు.  లక్షలాది భక్తులు తరలి వచ్చే ఈ వేడుకలకు పార్కింగ్, లేజర్ షో, నమూనా దేవాలయాల ప్రదర్శన, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాల కౌంటర్లు, రవాణా సౌకర్యాలు, వసతి సౌకర్యాలు వంటి అన్ని అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.  రథసప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకూ తావులేకుండా  విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
Publish Date: Jan 4, 2025 10:36AM

భారీ ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ నటి రీతూ చౌదరి?!

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన భారీ ల్యాండ్ స్కామ్ లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్ అయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కేంద్రంలో ఓ ముఠా 700 కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది.  ఓ రిటైర్డ్  సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆ స్కామ్ వెలుగు చూసింది. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్, ఆయన రెండో భార్య వనం దివ్య అలియాస్ రీతూ చౌదరితో పాటు సీఎంకు వరుసకు సోదరుడయ్యే   వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో ఉన్నారని పేర్కొన్నారు.  రిటైర్డ్  సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గోవాలో తనను బంధించి బలవంతంగా రూ.700 కోట్ల రూపాయల ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది రిటైర్ట్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సీఎంకు లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు సారాంశం. ఇప్పుడు ఆ ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రితూ చౌదరి అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు.  జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ  వచ్చిన రీతూచౌదరి భారీ ల్యాండ్ స్కామ్ లో ఉండటం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.   
Publish Date: Jan 4, 2025 10:14AM

తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లు!

సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పిల్లలు దారి తప్పుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి అది నిజం కూడా చిన్న వయస్సు నుంచే సోషల్ మీడియా ఎడిక్ట్ లుగా మారిపోతున్న పిల్లలు చదువు, ఆటలకు దూరం అవుతున్నారు. ఇది వారిలో మానసిక సమస్యలకూ దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు సోషల్ మీడియాలోకి రావాలంటే అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పని సరి చేయాలన్న నిర్ణయం తీసుకుంది.  కేంద్రం తాజాగా ప్రచురించిన  డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023  ముసాయిదా నిబంధలన ప్రకారం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఫిబ్రవరి 18 తుదిగడువుగా పేర్కొంది. ఆ లోగా పిల్లల  సోషల్ మీడియా అక్కౌంట్ లకు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అన్న దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయనుంది.  ఆ తరువాత పిల్లలకు సోషల్ మీడియా ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పని సరి చేస్తూ చట్టం తీసుకురానుంది. 
Publish Date: Jan 4, 2025 9:53AM