ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను వెళ్లగొట్టాలి: ఆప్ 

ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికలో బిజెపికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బిజెపిని బలపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో వచ్చే సంవత్సరం జరుగనున్న ఎన్నికల్లో  కూటమితో  పొత్తు లేకుండానే ఆప్    ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ కన్వీనర్  కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. 2013లో  ఆప్ తో పొత్తు పెట్టుకోవడం తమ పార్టీ చేసిన అతి పెద్ద పొరపాటు అని కాంగ్రెస్ నేత  అజయ్ మాకెన్ కౌంటర్ ఇచ్చారు.
Publish Date: Dec 26, 2024 5:34PM

జీవీరెడ్డిలా పని చేయండి.. కూటమి నేతలు, మంత్రులపై పెరుగుతున్న ఒత్తిడి!

వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనే కాదు.. జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది.  ఐదేళ్ల పాటు జగన్ అరాచక, విధ్వంస పాలనను పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు.  జగన్ ఐదేళ్ల హయాంలో అష్టకష్టాలూ పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్ఛ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం  చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు, అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలూ ప్రారంభం కాలేదు. అంతే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీశారు.   అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారితప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసు కూడా పంపాడు. అంతే కాకుండా జగన్ ప్రాపంకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన  410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్నవారే.  జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో  అవకతవకలను బటయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై  తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై  చర్యలు తీసుకోవాలంటూ, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై కొరడా ఝుళిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీరెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పేరుగుతోంది. 
Publish Date: Dec 26, 2024 2:36PM

కామారెడ్డిలో ట్రయాంగిల్ డెత్ మిస్టరీ 

కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నిఖిల్ కూడా ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఎస్ ఐ , కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధానికి నిఖిల్ కారకుడని తెలుస్తోంది.  ప్రస్తుతం ఎస్ ఐ డెడ్ బాడీ దొరకకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్ ఐ కారు చెరువు కట్ట వద్దే ఉంది.    బిక్కనూర్ ఎస్ ఐ సాయికుమార్ బీబీనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాయికుమార్ బీబీపేట ఎస్ఐ గా పని చేస్తున్న సమయంలో శృతితో ఎఫైర్ ఉన్నట్టు వినికిడి.   సాయికుమార్ బిక్కనూర్ కు బదిలీ కావడంతో వీరిరువురి మధ్య గ్యాప్ ఏర్పడింది. శృతికి గతంలో పెళ్లి జరిగింది. కానీ భర్తతో విడిపోయి సాయికుమార్ తో ప్రేమాయణం నడిపించింది.  నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని శృతి వత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా ? అనేది తేలాల్సి ఉంది. ముగ్గురు ఒకే సారి సుసైడ్ చేసుకుంటే ఒకే సారి డెడ్ బాడీలు బయటపెడతాయి. కానీ అలా జరుగలేదు. కేవలం రెండు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. నిఖిల్ , శృతిలను సాయికుమార్ చంపేసి పరారైనట్లు మరో కథనం వినిపిస్తోంది. 
Publish Date: Dec 26, 2024 1:26PM

చిత్రపరిశ్రమకు అండగా ఉంటా:  సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి

ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్స్ షో రద్దు చేస్తున్నట్టు, టికెట్ల పెంపు నేనున్నంతవరకు ఉండవని   ప్రకటించడంతో చిత్రపరిశ్రమ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. సినీ ప్రముులతో జరిగిన భేటీ సందర్బంగా   చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మాఫియాతో సినీ లింకుల పట్ల ముఖ్యమంత్రి ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. టూరిజంను పెంపొందించడంలో టాలివుడ్ సహకరించాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేధాలు సమసిపోయినట్టయ్యింది. 
Publish Date: Dec 26, 2024 10:52AM

విద్యానికేతన్ ను వదిలేసి వెళ్లిపోయిన మోహన్ బాబు?

జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబును అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు డిసెంబర్ 24తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలకు సమాయత్తమౌతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేసి.. ఇప్పుడు ముందస్తు బెయిలు కోర్టు నిరాకరించినా మోహన్ బాబును అరెస్టు చేయకపోతే ప్రజలలో పలుచన అవుతామన్న భావనలో పోలీసులు ఉన్నారు. అందుకే మోహన్ బాబు పరారీ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరి వెళ్లిన మోహన్ బాబు అక్కడ నుంచి బేంగళూరుకు వెళ్లారు. ఆ తరువాత తిరుపతి విద్యానికేతన్ కు చేరుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించినట్లు తెలిసిన వెంటనే సోమవారం సాయంత్రమే ఆయన ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యానికేతన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన ఆనుపానులు ఎవరికీ తెలియలేదని అంటున్నారు.  
Publish Date: Dec 26, 2024 9:59AM

పిల్లలు గుణవంతులుగా ఉండాలంటే ఇలా పెంచాలి..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.
Publish Date: Dec 26, 2024 9:30AM