కావటి మనోహర్ రాజీనామా!

సొంత పార్టీ నేతలపై నమ్మకం పోయిందా? అవిశ్వాసంతో,పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే పక్కకు తప్పుకున్నారా!  గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా?  పోరాడి ఓడిపోవడం కంటే  ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా?  సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?  ఉన్న అధికారాన్ని కాపాడుకో లేకపోయిన వైసిపి కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బకు గుంటూరులో  వైసిపి పట్టు పూర్తిగా కోల్పోయినట్లేనా?  గుంటూరు నగరపాలక సంస్థను వైసిపి కోల్పోయింది.. ఆ పార్టీ నాయకుడు,  నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు.  ఈ విషయంలో ప్రత్యర్థి కూటమి పార్టీ పవర్ కంటే ,సొంత పార్టీలోని నాయకుల అసమర్ధతే మేయర్ మనోహర్ తో రాజీనామా చేపించిందన్న చర్చ జరుగుతున్నది. నిజానికి మరి కొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి పని మొదలుపెట్టింది.  కానీ టిడిపి చేతిలో దెబ్బతినకుండా, మనోహర్ చేసిన రాజీనామా..  రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న దానికి పదానికి ప్రత్యక్ష ఉదాహరణ గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.  గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. .ఈ డివిజన్లో గతం లో  2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు  46 మంది విజయం సాధించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి.  దీంతో వైసీపీ నుండి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా పనిచేస్తున్నారు.  ఐతే 2024 ఎన్నికల్లో ప్రభంజన విజయాన్ని అందుకున్న కూటమి నాయకులు  గుంటూరు మేయర్ స్థానం పై దృష్టి పెట్టారు.  మారుతున్న కాలంతో పాటు, కార్పొరేషన్ లో రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది  2024 ఎన్నికలకు ముందే, ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు.  ఆరు, ఆరు 12 కదా ,ఈ బారా తో హైరానా ఎందుకనుకున్నారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఒక్కొక్క మార్పు జరిగే కొద్దీ , వైసీపీ నాయకులకు టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవహారం ఓ వైపు పార్టీకి, మరోవైపు మేయర్ స్థానానికి చేటు తెచ్చేలా ఉంది  అని తెలుసుకున్నా సరే వైసిపి జిల్లా నాయకులు ఆలస్యంగా నిద్ర మేల్కొన్నారు.  ఇక్కడ వైసిపి నాయకులు నిద్ర పోయారు అనడం కంటే ,నిద్ర నటించారు అంటే బాగుంటుందని సొంత పార్టీ కాడరే దుమ్ముత్తిపోసే పరిస్థితికి తీసుకు వచ్చారు వ్యవహారాన్ని. ఈ లోపు కూటమి నాయకులు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసారట.  కూటమి నుంచి విజయం సాధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి గుంటూరులోనే మకాం వేసి, తమ దగ్గర ఉన్న వనరులను వైసీపీ కార్పొరేటర్ కు రుచి చూపించారు. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన మార్పు వ్యవహారం,  చివరికి పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు, కూటమి పంచన చేరే వరకూ వెళ్లింది.  కౌన్సిల్లో 36 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుంది. అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఆరుగురు సభ్యులు టిడిపికి చెందినవారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. దీంతోనే అర్థం అయిపోయింది  మనోహర్ కు గుంటూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో అనేది...... అయితే ఈ వ్యవహారంలో మనోహర్ కు సహకరించాల్సిన సొంత పార్టీ నేతలు ,వెన్నుపోటు పొడిచారట ...స్టాండింగ్ కమిటీలో టిడిపి వాళ్ళు ఎట్టా గెలుస్తారో చూస్తామని, జబ్బలు చరిచిన వాళ్ళు ,చివరి రెండు రోజులు సైలెంట్ అయిపోయి సొంత కార్పొరేటర్ ను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారట.... గుంటూరు నగరంలోనూ జిల్లాలోనూ మా పవర్ ఏంటో చూపిస్తామని ,బీరాలు పలికే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహారం  కళ్లారా చూసిన మనోహర్ వీళ్లేనా పార్టీని కాపాడుకునేది అని అప్పట్లోనే అంతర్మథనానికి గురయ్యారట. తన పక్కన ఉండే  కార్పొరేటర్లను పక్క పార్టీలోకి పంపించిన నాయకులు కొందరైతే,  కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నా,  పోతే పోనీ మనకేంటి అని రెచ్చగొట్టిన నాయకులను చూసిన మనోహర్ ఇక కార్పొరేషన్ రాజకీయాల్లో ఉండకూడదని నిశ్చయిం చుకున్నట్లు ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఎలాంటి హడావుడీ లేకుండా మేయర్  పదవికి రాజీనామా చేశారు.   అయితే టిడిపికి చెందిన నాయకులు, మార్చిలో  గుంటూరు మేయర్ ను మార్చేస్తామని చెప్పినట్లుగానే, చెప్పిన పని చెప్పినట్లుగా తమ చేతికి మట్టి అంటకుండా చేసేసారు. నిజానికి, మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రాజకీయంగా, న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయని టిడిపి ఆలోచించింది.  సొంత పార్టీ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ గుంటూరులో మాత్రం అలాంటిది జరగలేదు. వైసిపి నిట్ట నిలువునా చేతులెత్తేసింది. ఓ పక్కన కూటమికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్,కీలకంగా మారి గుంటూరులో చక్రం తిప్పుతుంటే , ప్రతిఘటించాల్సిన  వైసిపి నాయకులు బేర్ మన్నారట. దీంతో పెద్ద స్థాయి నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, ఇక మనకెందుకులే అనుకున్నారు క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు.  దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వైసిపి మేయర్ స్థానాన్ని కోల్పోయింది.... గుంటూరులో ఈ వ్యవహారం ,రాబోయే రోజుల్లో వైసిపి లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.  
కావటి మనోహర్ రాజీనామా! Publish Date: Mar 16, 2025 12:08PM

జర్నలిస్టులెవరో తేల్చండి!.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే తాటతీస్తా.. రేవంత్

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌  యాక్ష‌న్ తీసుకుంటామ‌ని  హెచ్చ‌రించారు.  ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని  నిల‌దీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్ర‌జాజీవితంలో ఉన్న తనను విమర్శిస్తే సహిస్తాకానీ. కానీ, తన భార్య‌, నా బిడ్డ ఏం చేశారని వారిపై అనుచిత వ్యాఖ్యలు అదీ  బండ బూతుల‌తో చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇలాంటి వారు స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జ‌ర్నలిస్టులు? ఇది ది ఏం జ‌ర్న‌లిజం?, ఇలాంటి కామెంట్లు చ‌దివినా.. విన్నా అన్నం కూడా తినాల‌ని అనిపించ‌డం లేదన్నారు. భూభార‌తి పేరుతో త‌న‌పై వ‌స్తున్న కామెంట్లు చ‌దివేందుకు కూడా మ‌న‌స్క‌రించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తాన‌ని అసెంబ్లీ సాక్షిగా హెచ్చ‌రించిన రేవంత్ రెడ్డి, భూభార‌తి పేరుతో పేద‌ల భూముల‌ను వారికే చెందేలా చేస్తున్న త‌న ప్ర‌య‌త్నం త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. పెయిడ్ ఆర్టిస్టుల‌తో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయ‌ని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయ‌డానికి అస‌లు మ‌న‌సు ఎలా వ‌స్తోంద‌ని నిల‌దీశారు. సమ‌స్య‌లు ఉంటే ఉండొ చ్చున‌ని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాద‌న్నారు. “ఇంత‌లేసి మాట‌లు మీ నోటికి ఎలా వ‌స్తున్నాయి. మీరు మ‌నుషులేనా? మీకు భార్య‌, పిల్ల‌లు లేరా?” అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి విషపూరిత జర్నలిజంపై చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జర్నలిస్టుల జాబితా తీసి ఎవరు జర్నలిస్టులో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. జర్నలిజం డెఫినిషన్ చెప్పండి, తప్పు చేసిన జర్నలిస్టును మీరే శిక్షించండి, జర్నలిస్టు కాని వారిని క్రిమినల్ గానే చూస్తామనీ, అలాంటి క్రిమినల్స్ కి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెబుతామని అన్నారు. 
జర్నలిస్టులెవరో తేల్చండి!.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే తాటతీస్తా.. రేవంత్ Publish Date: Mar 16, 2025 11:59AM

గుంటూరు మేయర్ రాజీనామా.. అవిశ్వాసం భయంతోనేనా?

గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు.   గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.   వైసీపీ నుంచి కార్పొరేట‌ర్లు కూట‌మిలో చేర‌డంతో వైసీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ నెల 17న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మ‌నోహ‌ర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఆయ‌న‌ రాజీనామా చేశారంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ   పదవిలో ఉండాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు అన్నారు. వాస్తవానికి ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైంది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాలలోనూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 17) స్టాండింగ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే జరిగితే అవిశ్వాస తీర్మానం గెలిచి మేయర్ గా కావటి దిగిపోవాల్సి రావడం ఖాయం. దీంతోనే కావటి మేయర్ పదవికి రాజీనామా చేసేశారు.   నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆ మేయర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్‌గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో కూటమి నేతలు సరిగ్గా ఆయన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన రోజునే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.    
గుంటూరు మేయర్ రాజీనామా.. అవిశ్వాసం భయంతోనేనా? Publish Date: Mar 16, 2025 6:53AM

జనసేనాని బ్యాలెన్స్ తప్పుతున్నారా?

తెలుగు తమ్ముళ్ల చురకలు ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ  స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.ఆ మాటలు పవన్  మరచిపోయినట్టున్నారు. రోజులు  గడిచే కొద్దీ డిప్యూటీ సీఎం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్‌కళ్యాణ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లెవల్స్ మరీ ఎక్కువై పోయాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రావణుడి లాంటి దుష్టుడిని మట్టుపెట్టడానికి రామ -  సుగ్రీవులు కలిశారు . అలాంటి వానర సైన్యం లేకపోతే సీతారాములు కలిసేవారు కాదు అనుకుంటే పొరపాటే అని యద్దేవా చేస్తున్నారు . బాబుగారు ఒదిగి వున్నారు కదా అని అంతా మేమే చేసాం, అంతా మా ఘనతే అనకండని చురకలు అంటిస్తున్నారు. మీకు కృతజ్ఞత ఉంటే మీ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ వచ్చేలా చేసేవారని చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్బంగా పాత ఎన్నికల లెక్కలు బయటకు తీసి మీ సత్తా ఇదీ అని జనసేనానికి గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, జనసైనికుల ఫ్యాక్టర్స్‌తో గాజువాకలో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధికి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642. 75,292  ఓట్లు దక్కించుకున్న వైసీపీ 16,753 ఓట్ల మెజార్టీతో గట్టెక్కింది. 2024లో  తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుకి వచ్చిన ఓట్లు 1,57,703. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడొచ్చిన ఓట్లలో గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు తీసేసినా టీడీపీకి 99,164 ఓట్లు దక్కేవి. ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 95,235. అందులో 2019 నాటి జనసేన షేర్ 58,539 తీసేస్తే తక్కువలో తక్కువ 35 వేలు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేది.  2019లో  పీఠాపురంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 28,011. టీడీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 68,467. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459. 2024లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,34,394. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115 . ఒకవేళ టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండి ఉంటే 1,34,394 - 68,467= 65,927 ఓట్లు జనసేనకు దక్కేవి. అప్పుడు పవన్‌కళ్యాణ్‌కి 10 వేల లోపే మెజారిటీ దక్కేది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుని గెలిచిన భీమవరం లెక్కలు కూడా తీయవచ్చు కాని, చదివేవారికి బోరు కొడుతుంది వద్దులే. ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో..మిడిసిపడే దీపం ఎక్కువసేపు వెలగదు.. అని తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రికి హితబోధ చేయడం మొదలుపెట్టారిప్పుడు.
జనసేనాని బ్యాలెన్స్ తప్పుతున్నారా? Publish Date: Mar 16, 2025 6:28AM

ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ గా  బండ్ల గణేష్  ఆసక్తకర ట్వీట్ 

హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.   మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ ( మూవీ) ఎన్నికల్లో  మా అధ్యక్ష  పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ కు అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దత్తు పలికారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో రియాక్ట్ కావడాన్ని పవన్ కళ్యాణ్ వీరాభి మాని అయిన బండ్ల గణేష్ స్పందించారు.  “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయ‌న ట్వీట్ చేశారు.  మా అధ్యక్ష పదవికి మంచువిష్ణుకు పోటీగా ప్రకాశ్ రాజ్ నిల్చున్నారు. అప్పట్లో జనసేనాని ప్రకాష్ రాజ్ వెంటే నిలిచారు. . పాత విషయాలను నెమరువేసుకున్న బండ్ల గణేష్ ట్వీట్ పొలిటికల్ గా హీటెక్కించింది.పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత 
ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ గా  బండ్ల గణేష్  ఆసక్తకర ట్వీట్  Publish Date: Mar 15, 2025 4:42PM