ఉండవల్లీ.. కంట్రోల్.. కంట్రోల్!

posted on: Apr 1, 2014 6:46PM

 

 

 

రాష్ట్ర విభజన జరగకముందు తెలుగు ప్రజలకు ఉండవల్లి మాటల మీద బాగా నమ్మకం వుండేది. బాగా చదువుకున్నవాడు కాబట్టి బాగా ఆలోచించి, పరిశోధించి మాట్లాడతాడన్న అభిప్రాయం వుండేది. అందుకే ఉండవల్లి రాష్ట్ర విభజన జరగదు.. జరగదు.. అని బల్లగుద్ది చెబుతుంటే నిజమేనని నమ్మేశారు. చివరికేమైంది. ఉండవల్లి అండ్ బ్యాచ్‌ని నమ్మిన తెలుగు ప్రజలు.. ముఖ్యంగా సీమాంధ్రుల నెత్తిన విభజన బండ పడింది. ఇంత జరిగినా, తన మాటని జనం నమ్మడం లేదని తెలిసినా ఉండవల్ల తన గారడీ మాటలు మాట్లాడ్డం మానలేదు.

 

ఈసారు ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగిందని నమ్మడట. రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్ర విభజన జరగడానికి అవకాశం లేదట. గతంలో అయితే ఉండవల్లి మాటలు జనం నమ్మేవారేమోగానీ, ఇప్పడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఉండవల్లి మాట్లాడ్డం మానేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనం తన మాటల మీద ఆసక్తి చూపించడం లేదన్న ఫస్ట్రేషన్‌లో ఉండవల్లి వున్నట్టున్నాడు. అందుకే మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తెలుగు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన వాక్రుచ్చిన పాయింట్ ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగినట్టు కాదంట.. ఇంకా రాజ్యాంగపరంగా రాష్ట్రాన్ని కలిపి వుంచడానికి బోలెడన్ని అవకాశాలు వున్నాయట.



ఉండవల్లి ఇక్కడితో ఆగితే పాడిన పాటే పాడుతున్నాడులే అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఉండవల్లి ఘాటైన వ్యాఖ్యలు చేసేశాడు. అధికారపక్షం, ప్రతిపక్షం ఒక్కటైతే పార్లమెంట్‌లో మర్డర్లు, మానభంగాలు జరిగినా బయటి జనానికి తెలియదంటూ కామెంట్ చేశాడు. పార్లమెంట్‌లో తెలుగు ప్రజలకి అన్యాయం, అవమానం జరిగితే జరిగి వుండొచ్చు. అయితే ఉండవల్లి లాంటి విజ్ఞుడు పార్లమెంట్‌ని ఉద్దేశించి మర్డర్లు, మానభంగాలు లాంటి భాష మాట్లాడ్డం మంచిది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉండవల్లికి అనువదించి మాట్లాడ్డం తప్ప సొంతగా మాట్లాడ్డం రాదా అని ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి తన నోటిమీద కంట్రోల్ తెచ్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...