వైఎస్ షర్మిలకు ఊహించని సపోర్ట్.. జగనే పంపించారా? 

తెలంగాణలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు. నిరుద్యోగ దీక్షల పేరుతో వారం వారం నిరసన కార్యక్రమాలు చేపట్టిన షర్మిల... తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను పాటిస్తూ.. చేవెళ్ల నుంచి ఈనెల 21న పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె యాత్ర రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

అయితే షర్మిల పాదయాత్రకు ఊహించని మద్దతు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారం ఏరియాలో సాగుతోంది. నాగారం గ్రామానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి... షర్మిలను కలిసి మాట్లాడారు. కొద్దిసేపు ఆమెతో కలిసి నడిచారు. టీటీడీ చైర్మెన్ షర్మిల పాదయాత్రకు మద్దతు తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది.

షర్మిలకు అన్న ఏపీ సీఎం జగన్ తో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్నమీద కోపంతోనే షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారనే చర్చ జరిగింది. జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలానే ఇప్పటివరకు పరిణామాలు జరుగుతూ వచ్చాయి. షర్మిల పార్టీ ప్రారంభ సభకు వైసీపీ నేతలెవరు రాలేదు. విజయమ్మ ఒక్కరే షర్మిల వెంట ఉంటున్నారు. అంతేకాదు వైఎస్సార్ జయంతి రోజున ఆత్మీయ సమావేశం నిర్వహించారు విజయమ్మ. గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికింది. ఆమె ఆహ్వానం వెళ్లిన వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉన్నారు. కాని వాళ్లెవరు విజయమ్మ సమావేశానికి హాజరుకాలేదు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతలు విజయమ్మ  సమావేశానికి వెళ్లగా.. వైసీపీ నేతలు హాజరుకాకపోవడం చర్చగా మారింది. జగన్ ఆదేశాలతోనే వైసీపీ నేతలెవరు విజయమ్మ సమావేశానికి వెళ్లలేదని భావించారు. 

వైఎస్సార్ ఆత్మీయ సమావేశానికి వైసీపీ నేతలెవరు హాజరుకాని పరిస్థితుల్లో షర్మిల పాదయాత్రకు వైవీ సుబ్బారెడ్డి మద్దతు పలకడంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.  వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతంగానే షర్మిలను కలిశారా లేక జగన్ అనుమతి ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి చిన్నాన్న కావడంతో.. కుటుంబ సభ్యుడిగానే కలిసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. పాదయాత్రలో ఉన్న షర్మిలను వైవీ సుబ్బారెడ్డి కలవడంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోందని తెలుస్తోంది.