రేపే ఎంపీలకు డైరెక్షన్.. కేంద్రంతో యుద్ధానికి సై

తెలంగాణ బాస్ లో కదలిక వచ్చింది. ప్రగతిభవన్ కే పరిమితమయ్యారని, ఫామ్ హౌస్ లోనే కునుకు తీస్తున్నారని, ఆఫీస్ ఫైల్స్ కూడా అక్కడికే తెప్పించుకుంటున్నారని విపక్షాలన్నీ ఇదివరకే కోళ్లయి కూస్తున్నాయి. ఆ ఆరోపణలకు చెక్ పెట్టాలనుకుంటున్నారట కేసీఆర్. అందుకే గత కొన్నేళ్లుగా ఏ కదలికా లేని డ్రగ్స్ కేసును కదిలిస్తున్నట్టు కలర్ ఇస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో అసలు డ్రగ్స్ అనే మాటే వినపడరాదన్నది కేసీఆర్ తాలూకు ఆదేశమని నార్కోటిక్ విభాగం అధికారులు అంటున్నారు. అందుకే రైతుబంధును కూడా డ్రగ్స్ కే ముడి పెట్టడం విశేషం. ఎవరైనా గంజాయి పండిస్తే వారికి రైతుబంధు కట్ చేస్తానన్న కేసీఆర్... తాను పట్టుపడితే అన్నంత పనీ చేస్తారన్న పేరు కూడా ఉంది. గతంలో హైదరాబాద్, సికింద్రాబాదుల్లో పేకాట క్లబ్బులు మూడు పువ్వులు, ముప్పయి కాయలు అన్నట్టుగా నడిచాయి. కానీ ఇప్పుడవేవీ లేకుండా పోయాయి. అదే తరహాలో డ్రగ్స్ ను కూడా అరికట్టడానికి గంజాయి వెంట పడ్డారన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. 

లేడికి లేచిందే పరుగన్నట్టు.. కేసీఆర్ కూడా లేస్తే ఆగరన్న పేరుంది. ఈ క్రమంలోనే పనిలో పనిగా కేంద్రం వెంట పడాలన్న నిర్ణయానిక్కూడా వచ్చారు. డ్రగ్స్ మీద అధికారులకు దిశానిర్దేశం చేసిన వెంటనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మీద దృష్టి సారించారు కేసీఆర్. ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు రెండు దశల్లో జరపాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు, అలాగే మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకేం రావాలి, ఏం వచ్చాయి, కేంద్రం పెద్దలు ఏమిచ్చారు, ప్రజలేం అడుగుతున్నారు, కేంద్రం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ఏం డిమాండ్ చేయాలి, పార్లమెంట్ లో అడగాల్సిన ప్రశ్నలేంటి, వేటి మీద ఫోకస్ పెంచాలి... ఇలా అనేక అంశాల మీద కూలంకషంగా టీఆర్ఎస్ ఎంపీలకు బిగ్ బాస్ దిశానిర్దేశం చేస్తారు. 

ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. రాజ్యసభలో ఎలా వ్యవహరించాలి, లోక్ సభ ఎంపీలు సభలో ఏవిధంగా వ్యవహరించాలి.... అనే కోణంలో కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. అటు కేంద్రంతో వ్యవహారం బెడిసికొట్టిన క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని బేరీజు వేస్తే ఈసారి టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ కూడా తెలంగాణ ప్రజల మధ్య టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలం వరకు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహపూర్వక వైఖరి కాస్తా దుష్మన్ గా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మీద కరీంనగర్ పోలీసుల ఓవరాక్షన్ తో కేసీఆర్ బద్నాం అయినా కూడా తన పంథా నుంచి మాత్రం వైదొలగలేదు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద కూడా టీఆర్ఎస్ శ్రేణులతో పాటు పోలీసులు అదే వైఖరిని అవలంబించారు. దీనికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మధ్య టీఆర్ఎస్ ను కాస్తోకూస్తో టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం సుముఖంగా ఉన్నా కూడా రాష్ట్రం మాత్రం స్థలం కేటాయించలేదంటూ ఈ మధ్యే ఓ లేఖ రాశారు. 

గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా బీజేపీ నేతలను కార్నర్ చేస్తూనే వస్తున్నారు. అలాగే కృష్ణా-గోదావరి జలాల పంపకాల విషయంలో కూడా కేంద్రం చొరవ తీసుకోవడం లేదని, తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ అస్త్రాలను అప్పడప్పుడూ బయటకు లాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల సాక్షిగా కేంద్రం మీద విరుచుకుపడటమే ఉత్తమమైన వైఖరిగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ పార్టీ నేతలకు ఆ పద్ధతిలోనే డైరెక్షన్ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.