రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం.. పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు జంప్

పార్లమెంట్ వింటర్ సెషన్ లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడుగా వ్యవహరించారు. పార్లమెంట్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ ఉభయసభల్లో నిరసనకు దిగారు. పార్లమెంట్ వెలుపల కూడా గులాబీ ఎంపీలు ధర్నా చేశారు. అయితే టీఆర్ఎస్ ఎంపీల పోరాటంపై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారని, మంగళవారం తర్వాత పార్లమెంట్ లో వాళ్లు ఉండరని చెప్పారు. రైతు సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యమని, సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే ఢిల్లీలో డ్రామా నడుస్తుందని ఆరోపించారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం చెప్పినట్లే మంగళవారం జరిగింది. బుధవారం నుంచి పార్లమెంట్ కు వెళ్లడం లేదు టీఆర్ఎస్ ఎంపీలు. తాము సమావేశాలను బహిష్కరిస్తున్నామని  అధికారికంగానే ప్రకటించేశారు. మంగళవారం ఉదయం నల్లచొక్కాలతో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంట్‌కు వచ్చారు. కాసేపు నినాదాలు చేసి బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర తెలంగాణ రైతులను మోసం చేస్తోందని.. అందుకు నిరసనగానే శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు

అయితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ను బహిష్కరించింది రైతు సమస్యలపై కాదని రాజకీయ కారణాలతోనేనని తెలుస్తోంది. డిసెంబర్ 10న తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఐదు జిల్లాల పరిధిలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల జరుగుతున్న ఐదు జిల్లాల్లోనూ అధికార పార్టీకే మెజార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అయినా అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో విపక్షాలతో పాటు స్వంతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలవాలని కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాథ్యలను సీఎం కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ ఓటర్లు ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా అందరూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దీంతో ఎంపీలంతా ఢిల్లీ నుంచి క్యాంపులకు చేరుకున్నారు. ఈ మేరకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్‌ను బహిష్కరించిందని చెబుతున్నారు.