విష్ణు గెలుపులో టీఆర్ఎస్ కీరోల్‌!.. చీర‌లు పంచిన ఆ ఎమ్మెల్యే ఎవ‌రు?

ప్ర‌కాశ్‌రాజ్ ఓట‌మికి అనేక కార‌ణాలు. అలానే, మంచు విష్ణు గెలుపున‌కూ అంత‌కుమించే రీజ‌న్స్‌. మోహ‌న్‌బాబు ముందుండి చ‌క్రం తిప్ప‌డం.. సీనియ‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం.. పోస్ట‌ల్ ఓట్లు రాబ‌ట్ట‌డం.. క‌మ్మ‌-రెడ్డి కాంబినేష‌న్‌.. వైసీపీ స‌పోర్ట్ ఇలా అనేక అంశాలు మంచు విష్ణు గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ్డాయి. వీటితో పాటు తెర‌వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ముఖులు సైతం మంచుకు బాగా స‌హ‌క‌రించార‌ని తెలుస్తోంది. మోహ‌న్‌బాబు ప‌దే ప‌దే సీఎం కేసీఆర్ పేరు ప్ర‌స్తావించ‌డం.. విష్ణు గెలుస్తాడ‌ని తన‌కు ముందే తెలుస‌ని మంత్రి త‌ల‌సాని వ్యాఖ్యానించ‌డం అందుకు నిద‌ర్శ‌నం. మంత్రి త‌ల‌సాని త‌న ప్ర‌సంగంలో మోహ‌న్‌బాబును బాగా పొగ‌డడం ఆస‌క్తిక‌రం. తాజాగా, మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విష‌య‌మూ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

టీఆర్ఎస్ పార్టీ లీడ‌ర్ల‌కు మెగా ఫ్యామిలీ బాగా స‌న్నిహిత‌మే అయినా.. మా ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి ప‌లువురు కారు పార్టీ నేత‌లు మెగా కుటుంబం స‌పోర్ట్ చేసిన ప్ర‌కాశ్‌రాజ్‌కు కాకుండా మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని అంటున్నారు. మా లోని తెలంగాణ‌వాదులు మంచుకు స‌పోర్ట్ చేసేలా చూశారు. ఇక‌, మంత్రి కేటీఆర్‌కు ముఖ్యఅనుచ‌రుడైన ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి సైతం మా ఎన్నిక‌ల్లో తెర‌వెనుక కీల‌క పాత్ర ప్లే చేశార‌ని చెబుతున్నారు. మా లో స‌భ్య‌త్వం ఉన్న చిన్న‌స్థాయి క‌ళాకారుల‌కు జీవ‌న్‌రెడ్డి స్వ‌యంగా ఖరీదైన పట్టు చీరలు , బ‌ట్ట‌లు పంచార‌ని అంటున్నారు. మంచు విష్ణుకే ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అలా గిఫ్ట్‌గా పట్టు బ‌ట్ట‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. జీవ‌న్‌రెడ్డి వ్య‌క్తిగ‌తంగా ఈ ప‌ని చేశారా? లేక‌, పార్టీ పెద్ద‌ల డైరెక్ష‌న్‌లో చీర‌లు పంచారా? అనే విష‌యంపై క్లారిటీ లేక‌పోయినా.. బ‌ట్ట‌లు పంచిన విష‌యం మాత్రం నిజ‌మేన‌ని స‌మాచారం. 

జ‌గ‌న్‌కు బంధువైన విష్ణు గెలుపున‌కు వైసీపీ-రెడ్డి-క్రిష్టియ‌న్ వ‌ర్గాలు పూర్తిగా స‌హ‌క‌రించాయి. బాల‌కృష్ణ సైతం మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో టీడీపీ శ్రేణులూ మంచుకే జై కొట్టారు. ఇక త‌ట‌స్థంగా ఉండాల్సిన టీఆర్ఎస్‌.. అలా ఉన్న‌ట్టుగానే న‌టిస్తూ.. తెర వెనుక మాత్రం విష్ణు గెలుపున‌కు కృషి చేసిందని అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి చీర‌లు పంచిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం ఆ అనుమానాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్టైంది.