వరి సాగు చేయండి.. కొనుగోలు బాధ్యత నాదే! కేసీఆర్ కు షాకిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగుపైనే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య యుద్ధమే సాగుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని ఎఫ్ సీఐ చెప్పిందంటున్న టీఆర్ఎస్.. కేంద్రంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు యాసంగిలో వరి సాగు చేయవద్దని అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. యాసంగిలో రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కేసీఆర్ సూచించారు.

కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనదని, రైతులెవరు వరి సాగు చేయవద్దని చెబుతున్నారు. కాని సీఎం కేసీఆర్ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. సీఎం వరి సాగు చేయవద్దని చెబుతుంటే.. అతను మాత్రం వరి సాగు చేయాలని రైతులకు బహిరంగంగానే చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్యలు రాజకీయంగా సంచలనం రేపుతుండగా.. గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారాయి. 

యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గ రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు ఏం చెప్పినా రైతులు అయోమయానికి గురి కావద్దన్నారు. వరి సాగు చేసేందుకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లర్లతో చర్చించానని, మెట్టపంటలు వేసుకునే అవకాశం ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు. 

కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని భాస్కర్ రావు ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయ డం చూశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊరికే రాద్ధాంతం చేస్తే సమస్య సమసిపోదన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి ధాన్యం బస్తా రూ.1,480కే మిర్యాలగూడ మిల్లులకు డెలివరీ చేస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు సరికాదని భాస్కర్‌రావు అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కాకుండా మిల్లర్లతో కొనుగోలు చేయిస్తానని చెబుతున్నారు.