టీఆర్ఎస్ కు ఎన్నేళ్లు.. ఇరవయ్యా ? ఏడా?.. ఉద్యమకారులు ఏమంటున్నారు! 

కాంగ్రెస్ పార్టీది వందేళ్ళు పైబడిన చరిత్ర. 1885, డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్బవించింది. అయితే ఆ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ ఒకటేనా అనే విషయంలో చరిత్రకారులలో, ఏకాభిప్రాయం లేదు. భారత స్వాతంత్ర ఆఖరి ఘట్టానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వాతంత్ర సిద్దితో, సమాప్తమై పోయింది. అందుకే, మహత్మా గాంధీ, అప్పుడే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని  కోరారనే వాదన ఒకటుంది. అయితే  గాంధీ సూచను పార్టీ పట్టించుకోలేదు,   అనుకోండి అది వేరే విషయం. నిజానికి 1947కు ముందున్న కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక  ఉద్యమం. ఆ తర్వాత వచ్చిన నాయకత్వం చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మకున్నా, కాంగ్రెస్ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి మద్యన ఉన్న సన్నని గీత మాత్రం అలాగే ఉండి పోయింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక చీలికలు పేలికలు  వచ్చాయి. అయితే అవన్నీ ఎలా ఉన్నా, సైధాంతిక వైరుద్యాల ప్రాతిపదికన 1969లో వచ్చిన చీలిక కాంగ్రెస్ చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయిలా నిలిచి పోయింది.   

 కాంగ్రెస్ పార్టీ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయనికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా, అదే  సింగిల్ పాయింట్ అజెండాగా, 2001 (ఆగష్టు 27)న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి, తెరాస ఇప్పుడు ద్విదశాబ్ది (20ఏళ్ల) పండగ వేడుకలు జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలోనే కొందరు కాంగ్రెస్ లానే రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా ఏర్పడిన తెరాస, కూడా 2014కు ముందు ఒక  ఉద్యమ వేదికే కానీ, రాజకీయ పార్టీ కాదనే వాదనను ముందుచుతున్నారు. పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ మలి దశ పోరాటం రాజకీయాలకు అతీతంగా సాగిన  ఉద్యమం.  అదొక ఉద్యమం కావడం వల్లనే,రైట్, లెఫ్ట్, మధ్యేవాద భావజాలం ఉన్న అన్ని పార్టీలు, అందరు నాయకులు, ప్రజలు, విద్యార్ధులు అందరూ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.తెలంగాణ సాకారం అయిన తర్వాత ఉద్యమ స్పూర్తి పక్కకు పోయి తెరాస రాజకీయ రంగు పులుముకుంది. 

నిజానికి  మహత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని ఒక సూచన  మాత్రమే చేశారు. అది జరగలేదు, కానీ, తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన, తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తెరాస ఉద్యమ పార్టీని రద్దుచేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరిన నేపధ్యంలో తెరాస ఇకపై  ఫక్తు 16 అణాల రాజకీయ పార్టీగా పనిచేస్తుందని చెప్పారు . చెప్పడమే కాదు, రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ మాటల చాటున, ఈ ఏడేళ్ళలో అదే చేశారు. అందుకే, ఉద్యమంలో  పాల్గొన్న పెద్దలు కొందరు, కేసీఆర్  ఉద్యమ పార్టీకి బొంద పెట్టారని అంటారు. ఆరోపిస్తున్నారు, కుటుంబ పార్టీ కట్టుకున్నారని అంటారు.  నిజంగా కూడా కేసీఆర్ ఉద్యమ అవవాళ్ళు, వాసనలు లేకుండా, ఉద్యమ  పార్టీని పూర్తి స్థాయిలో ‘పక్షాళన’ చేశారు. గాదె ఇన్నయ, ఆలే నరేంద్ర, ప్రొఫెసర్ కోదండ రామ్ మొదలు ఈటల రాజేందర్ వరకు ఉద్యమంతో సంబధమున్న నేతలు అందరినీ ఏరి పారేశారు. 

ఇంకా హరీష్ రావు వంటి  ఒకరిద్దరు ఉన్నా, కేసీఆర్ తెరాసను ఉద్యమ పార్టీని, రాజకీయ పార్టీగా... రాజకీయ పార్టీని ... కుటుంబ పార్టీగా చాల చకక్గా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నారు.  ఈ నేపధ్యంలోనే తెరాస ద్విదశాబ్ది  (20 ఏళ్ల) ఉత్సవాలు జరుపుకోవడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇరవై ఏళ్ల క్రితం, 2001 పుట్టిన పార్టీని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో  కేసీఆర్ 2014లో రద్దు చేశారు, కాబట్టి, తెరాస రాజకీయ పార్టీగా అవతరించి ఏడేళ్ళే అయిందని, 20 ఏళ్ల పండగ ఎట్లా చేసుకుంటారని, ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అప్పుడు ఉద్యమ పార్టీ అయినా ఇప్పుడు కుటుంబ పార్టీ అయినా, పార్టీ నాయకుడు, కేసీఆర్ ఒక్కరే కాబట్టి, అన్ని హక్కులు ఆయనకే ఉంటాయని ఇంకొందరి వాదన. 

ఎవరు ఏ వాదన చేసినా, అది ఇరవై ఏళ్ళా, ఏడేళ్ల అనేది పక్కన పెడితే, తెరాస ఒక చరిత్ర. ఇద్దరంటే ఇద్దరే ఎంపీలతో వందేళ్ళ కాంగ్రెస్ పార్టీని,విలీన ఆశ చూపి  బురిడి కొట్టించి  తెలంగాణ సాధించడం నిజంగా ఒక చారిత్రక సందర్భం. అయితే  వ్యూహాలు, ఎత్తుగడలు, దొంగ దీక్షలు, అగ్గిపెట్టె దొరకక ఆగిపోయిన అత్మాహుతుల వల్ల మాత్రమే తెలంగాణ రాలేదు. 14 వందల బలిదానాల కారణంగానే 60 ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైంది. ఈ ఏడేళ్ళలో ఆ కల చాలా వరకు కరిగిపోయింది. అదెలా ఉన్నా, తెలంగాణ సాధించిన క్రెడిట్ ఉద్యమానిదే కానీ, తెరాస పార్టీది కాదు, తెరాస కుటుంబ పార్టీది అయితే అసలే కాదు. అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఘోషిస్తోంది..