రావాలి జగన్.. ఓటీఎస్ కాదు ఉరి తాడు.. పోలవరం బాంబ్.. టాప్ న్యూస్@8PM

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్  వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని ఆయన కోరారు. పిటిషన్ పై వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 
------
ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటైందని.. తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భ‌య‌పెడుతున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
--------
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. 
-------
ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించేవారే లేకుండా పోయారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 13 లక్షల మందికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనలేదని తెలిపారు.11వ పీఆర్సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని బొప్పరాజు స్పష్టం చేశారు. 
---------
ఎంపీ విజయసాయిరెడ్డి పీఏ పేరుతో మోసానికి పాల్పడ్డారు. నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి నగదు వసూలు చేశారు. ఉద్యోగం రాక డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు మోసపోయమని గ్రహించారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు మోహన్ అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
-----
తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఏడున్నరేళ్ల కాలంలో పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేశారని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ వచ్చామని... తొలుత విద్యుత్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు.
-----
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని, ఫొటోలకు పోజులు తప్ప చేసిందేమీలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
---
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రోడ్డుపై ధర్నాకి దిగారు.  జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తొలగించిన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన జాతీయ రహదారిపై బైఠాయించారు. 
---
నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన ఘటనపై 'సిట్' దర్యాప్తునకు ఆదేశించామని, 30 రోజుల్లోగా దర్యాప్తును 'సిట్' పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. నాగాలాండ్ దుర్ఘటనపై  లోక్‌సభలో అమిత్‌షా ప్రకటన చేశారు. 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తోందని అన్నారు.
------
వివాదాస్పద ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత తనను ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నాడు.