వైసీపీ దుర్మార్గాలు.. చిట్టీల టోకరా.. శ్రీవారా మజాకా.. కరోనా పంజా.. టాప్ న్యూస్@1PM

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీపీఐ  కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 5 జిల్లాల్లో దాదాపు 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. రెండు డ్యాంలు, చెరువులు, కాల్వలకు గండి పడి తీవ్ర నష్టం వాటిల్లిందని రామకృష్ణ తెలిపారు. 60 మంది మృతి చెందగా, పలువురు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారన్నారు. 
-----
వైసీపీ దాష్టీకాలు, దుర్మార్గాలు అధికమయ్యాయని  టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తుమ్మల చెరువుకు చెందిన సైదాను విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. దాచేపల్లిలో ఒకర్ని, తంగెళ్ళులో ఒకర్ని కొట్టి చంపారని చెప్పారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఏడుగుర్ని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రశ్నించినవారిపై దాడులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. 
---
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదుర్రు పంచాయతీ కార్యదర్శి  తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు యువతి దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి  సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అయితే తాను ఏతప్పూ చెయ్యలేదు నిజాలు విచారణలో బయట పడతాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటున్నారు.
--
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిట్టీల పేరుతో శ్రీనివాసగుప్తా అనే వ్యక్తి 5 కోట్లకు టోకరా వేశాడు. దాదాపు 200 మంది నుంచి చిట్టీలు కట్టించుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసగుప్తా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధపడుతున్నారు. 
--
 శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తయ్యింది. 20 నిముషాల వ్యవధిలోనే 3లక్షల 10వేల టోకెన్లను భక్తులు పొందారు. కోటా పూర్తయినప్పటికీ సమాచారం తెలియక ఇప్పటికీ వేల సంఖ్యలో టిక్కెట్ల కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతున్నారు. టీటీడీ దర్శనం కోటాను పెంచకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
----
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై వైధ్యాధికారులతో మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. బి.1.1.259 వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కరోనా భయం వెంటాడుతోంది.  మేడ్చల్ జిల్లాలోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. 
-----
బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 
--
వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వరి దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా... రైతులతో రాజకీయం చేసిందన్నారు. గతంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు.
---
ఇప్పటికే డ్రగ్స్‌ను సైతం యథేచ్ఛగా సప్లై చేస్తోందంటూ అమెజాన్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఓ యువకుడికి సెల్‌ఫోస్ ట్యాబ్లెట్స్ అందించి అతని చావుకి కారణమైంది. ఆదిత్య అనే యువకుడు ఆమెజాన్‌లో సెల్‌ఫోస్ ట్యాబ్లెట్ల కోసం ఆర్డర్ పెట్టగా... వెంటనే అమెజాన్ వాటిని అతనికి అందించింది. అయితే ఆ యువకుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తండ్రి.. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇండోర్ పోలీసులను ఆదేశించారు.
----
సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు.తూర్పు సింగ్‌భూమ్‌కు చెందిన దాదాపు 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఓ మహిళా కార్మికురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తోటి మహిళా కార్మికులు ఆందోళన చేశారు.