చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. వివేకాను చంపిందెవరు?.. ఓటర్లకు ప్రలోభాలు.. టాప్ న్యూస్@7PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చెప్పారు. చంద్రబాబు తనను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో అడిగి వివరాలు తెలుసుకున్నారు.  ఏపీ పరిస్థితులపై వినతి పత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు
---------
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి  తెలిపారు. 675 రోజులుగా రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రపై ఇటీవల డీజీపీకి సమాచారం ఇచ్చామని శివారెడ్డి తెలిపారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిగి తీరుతుందని శివారెడ్డి స్పష్టం చేసారు. 
-------
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఛార్జ్‌షీట్‌‌ను సీబీఐ దాఖలు చేసింది. వైఎస్‌ వివేకా మృతికి నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు నమోదు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో నిందితులను అరెస్టు చేశామని కోర్టుకు సీబీఐ తెలిపింది.  నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని సీబీఐ పేర్కొంది. 
--------
పోలీసు దురాగతాలు దారుణంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 41A నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని తప్పుబట్టారు. వైఎస్సార్ భరోసా కింద 13,500 వేలు ఇస్తున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. కేంద్రం కూడా రైతులకు పీఎం కిసాన్ పేరిట ఏడాదికి 6 వేలు ఇస్తోంది. మా ప్రభుత్వం ఇస్తుంది రూ.7,500 మాత్రమే. నిస్సిగ్గుగా మొత్తం మేమే ఇస్తున్నామని మా ప్రభుత్వం చెబుతోంది. స్థల దాహంతో ఎయిడెడ్ స్కూల్స్‌ను సొంతం చేసుకుంటున్నారు
------
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగింది. గన్నీ బ్యాగుల అంశంతోపాటు పెండింగ్‌లో ఉన్న కమీషన్ ఇవ్వాలని నినాదాలు చేశారు.  జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ హయాం నుంచే గన్నీ సంచులు డీలర్లకు ఇచ్చారని, అప్పటి నుంచి కమిషన్‌తో పాటు  గన్నీ బ్యాగులు డీలర్లు అమ్ముకుంటున్నారన్నారు. 
----
హుజురాబాద్ హుజురాబాద్, బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్లు లెక్కిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. బద్వేల్‌ ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. హుజురాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు.
------
మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వాటాలు, కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌తో ఈటల తగవు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలపై ఈటల ఎందుకు మాట్లాడలేదు?.. ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. మంత్రి హరీష్‌రావు, ఈటల 20 ఏళ్లు కలిసి తిరగలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు
-------
పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. 
---------
ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ 2013లో పాట్నాలోని 'హుంకార్' ర్యాలీలో ప్రసంగిస్తుండగా వరుస పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పాట్నాలోని ఎన్ఐఏ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. పది మంది నిందితులలో తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించింది. తగిన సాక్ష్యాలు లేనందున ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. దోషులుగా నిర్దారించిన వారికి శిక్షను నవంబర్ 1న కోర్టు ప్రకటించనుంది. 
------
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 పోరులో ఇంగ్లండ్ జట్టు మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో అబుదాబిలో జరిగిన పోరులో ఇంగ్లండ్ అన్ని రంగాల్లో సత్తా చాటుతూ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే ఛేదించింది.
---