సొంత జిల్లాలో జగన్ కు ఝలక్.. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. కేరళ కల్లోలం టాప్ న్యూస్@7pm

రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలన్నారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని బాలయ్య ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని, నికర జలాలు ఇవ్వాలని బాలకృష్ణ స్పష్టం చేశారు. 
---------
ఎన్డీయేలోకి వైసీపీ రావాలంటూ  కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని అథవాలే  అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు అథవాలే. ఏపీకి  మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. 
----
ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రకటించారు. తాను, తన కుమారుడు భూపేశ్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పుకోబోతున్నామని చెప్పారు. జమ్మలమడుగులో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దేవగుడి భూపేశ్‌రెడ్డిని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.
---------
తిరుపతి-ఢిల్లీ మధ్య స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తిరుపతి-ఢిల్లీ మధ్య స్పైస్‌జెట్‌ విమాన సర్వీసును కేంద్ర మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఆథ్యాత్మిక రాజధానిని జాతీయ రాజధానితో అనుసంధానం చేశామన్నారు. తిరుపతికి ఏటా మూడున్నర కోట్ల మంది భక్తులు వస్తారని మంత్రి సింధియా తెలిపారు.
---------
ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అన్ని పనులు చేసుకుందామని చెప్పారు. రోజుకు 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విపక్షాలకు దిమ్మదిరిగే రీతిలో వరంగల్ ప్రజాగర్జన సభ ఉండాలని టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
------
హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న గానీ, లేక 27న గానీ హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు
---
తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఎస్ఈసీ శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. హరీశ్ రావు గత నెలరోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేసి, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బయటికి రప్పించాలని, లేదా మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్ఈసీని కోరారు.
--------
కేరళలో భారీ వర్షాలు కురియడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. వర్ష బీభత్సంపై చర్చించారు. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు. బాధితుల పునవారాసం కోసం చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు.
----
ఉత్తరాఖండ్ లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం పుష్పర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ క్రమంలో చమోలీ జిల్లా అధికారులు నేటి బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.
-------
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ గా కొనసాగేందుకు శాస్త్రి ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణకు తెరలేపింది. టీమిండియా హెడ్ కోచ్ పదవితో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
------