కేసీఆర్ ఇంగ్లీష్‌.. స్కూళ్లు-క‌రోనా.. ర‌ఘురామ ఎస్కేప్‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. కరోనా దృష్ట్యా 12కి పైగా రాష్ట్రాల్లో స్కూళ్లు మూసివేశారని.. ఏపీలో మాత్రం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. స్కూళ్ల నిర్వహణపై సీఎం మూర్ఖంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్కూళ్లలో తరగతులను తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు చంద్ర‌బాబు.

2. స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో కరోనా కార‌ణంగా పరీక్షలు నిర్వహించలేదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోలిక అవసరం లేద‌న్నారు. 

3. తెలంగాణ‌లోని ప్రైవేట్ స్కూల్స్‌, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆయా అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. 

4. బీసీలంటే దొర మీటింగులకు మందిని తెచ్చేవారని.. దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శించారు. బీసీల సంక్షేమంపై కేసీఆర్‌కు పట్టింపు లేదన్నారు. సంఘాల పేరుతో విభజించడం తప్ప. జనాభా ప్రాతిపదికన బీసీల‌కు సీట్లు కేటాయించకుండా.. వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నార‌ని ష‌ర్మిల మండిప‌డ్డారు. 

5. ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ రాశారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో తెలిపారు. ఢిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యారని.. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాలు గడువు కావాలని కోరారు. 

6. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్టు ట్విటర్‌లో తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. గ‌త కొన్ని రోజులుగా తనని కలిసిన వారంతా తొందరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

7. కడప రిమ్స్ వైద్య క‌ళాశాల‌లో 50 మంది మెడిక‌ల్ స్టూడెంట్స్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. మంగ‌ళ‌వారం ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్‌ వర్సిటీని కోరింది. 

8. గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వైర‌స్ బారిన ప‌డిన వారిలో.. డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, వైద్య‌ విద్యార్థులు ఉన్నారు. అటు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. 

9. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. ఫిబ్రవరి 20న పంజాబ్‌లో ఎల‌క్ష‌న్స్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఈసీ. 

10. యూఏఈ రాజధానిలోని అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ అటాక్‌లో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలాయి. భారీ శ‌బ్దంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాడిలో ముగ్గురు చ‌నిపోయారు. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉండగా.. ఇంకొక‌రు పాకిస్తాన్‌కు చెందిన వారు. దాడులు తమ పనేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.