ఫ్యాన్‌కు ఓటేస్తే ఫ‌స‌క్‌.. మోత్కుప‌ల్లి ఫిక్స్‌.. జ‌న‌సేన=పిచ్చిసేన‌.. టాప్ న్యూస్ @ 7pm

1. ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరోవైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి.. అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవ‌డంలో జ‌గ‌న్ బిజీ అవ్వ‌డం వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి అంటూ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.  

2. ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పాలనతో పరిశ్రమలు కుదేలయ్యాయన్నారు. విద్యుత్‌ లేక పరిశ్రమల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారబోతోందని దిన‌క‌ర్‌ విమ‌ర్శించారు.  

3. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు, భువనగిరితోపాటు మునుగోడు నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. మోత్కుప‌ల్లికి దళితబంధు చైర్మన్‌ లేదా ఎమ్మెల్సీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

4. సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, సాంబశివరావులు మ‌రో లేఖ రాశారు.  ప్రకాశం జిల్లా ప్రగతి, సమస్యలపై సీఎం శ్రద్ధ వహించడం లేదన్నారు. గతంలో రాసిన లేఖల్లో రాజకీయం వెతికారు తప్ప ఆవేదనని అర్థం చేసుకోలేదని చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసం "వెలుగొండ"కి అన్యాయం చేస్తున్నారు? అని లేఖ ద్వారా ప్రశ్నించారు.

5. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకలో దళితులపై దాడి జరిగింది. ప్ర‌కాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదంటూ జార్జ్ అనే వ్యక్తిపై సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. మీ సామాజికవర్గం వారు ఓటు వేయకపోవటం వల్లే తాము ఓడిపోయామంటూ జార్జ్‌పై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. 

6. జనసేన నాయకుడుకు పిచ్చి పరాకాష్టకు చేరినట్టే.. జన సైనికులకు అదే పరిస్థితి ఏర్పడిందంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. పెట్రో ధరలు పెరిగాయని ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్న బస్సుకు నిప్పు పెట్టిన వ్యక్తి జనసైనికుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జనసేనకు ఓటు వేయలేదని జనాన్ని చంపేస్తారేమోనని అన్నారు. షూటింగ్ అయిపోగానే రెండు నెలలకు ఒకసారి వచ్చి రెండు మీటింగులు పెట్టి యుద్ధం చేద్దామంటాడని విమర్శించారు. 

7. ఏపీవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు, ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మందు చూపు ఉందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మందుపై ఉన్న చూపు విద్యుత్‌పై ఎందుకులేదో మనం ఆలోచన చేయాలని  రఘురామ సూచించారు. 

8. దుగ్గిరాల ఎంపీపీ ఎంపికలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ఎదుట టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్, టీడీపీ నేతలు బైఠాయించారు. తక్షణమే దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జబీన్‌కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమని.. ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని టీడీపీ మండిపడింది. 

9. న్యాయస్థానాలు, దేవస్థానాలు మాత్రామే రైతులకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని.. అమరావతి రైతుల ఉద్యమం 669వ రోజుకు చేరుకున్న సంద‌ర్భంగా వారు అభిప్రాయ‌ప‌డ్డారు. దేవి నవరాత్రుల సందర్భంగా మందడం గ్రామంలో అమ్మవారి ఊరేగింపులో అమరావతి గ్రామాల రైతులు భారీగా పాల్గొన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, రైతు మహాపాదయాత్ర విజయవంతం కావాలని రైతులు అమ్మవారికి మొక్కుకున్నారు. 

10. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ నేత ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించనట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్కే అంత్యక్రియలు పూర్తి అయినట్లు చెబుతున్నారు. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా కప్పి మావోయిస్టులు నివాళులు అర్పించారు.