TOP NEWS @ 7pm

1. గులాబ్‌ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మాట్లాడారు. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. 

2. గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని.. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని.. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ వంతు సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని సూచించారు.

3. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై చర్చించారు. కేంద్ర గోదాముల్లో నాలుగేళ్లకు సరిపోయే నిల్వ ఉన్నాయని.. గతంలోలా కొనలేమని కేంద్రం రాష్ట్రానికి చెప్ప‌గా ఆ అంశంపై చ‌ర్చించారు. కేంద్రమంత్రి నుంచి ఇంకా స్పష్టత రాలేదని.. మరో రెండు మూడు రోజుల సమయం కావాలని కేంద్ర మంత్రి కోరారని తెలుస్తోంది. 

4. కేసీఆర్ పాలనపై ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదని సూటిగా ప్రశ్నించారు. పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 

5. ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వివాదంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. మంగళవారం తాడేపల్లికి రావాలని ఇద్దరికీ పార్టీ అధిష్టానం ఆదేశించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర జరిగిన వివాదంపై చర్చించనున్నారు. 

6. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ బంద్‌కు మద్దతు ఇవ్వకుండా ఢిల్లీలో ప్రధాని మోదీతో విందులో పాల్గొన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. 

7. మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఐటీ రంగం అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. ఐటీ అభివృద్ధిపై ఎమ్మెల్యేలకు చెత్త పేపర్లు పంపిణీ చేశారని ఆరోపించారు. చేతకాకనే .. కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రాన్ని విమర్శించటం అలవాటుగా మార్చుకున్నారని రాజాసింగ్‌ విమర్శించారు.

8. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్‌లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుబట్టారు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవసరమా? వాళ్లు ఎన్నైనా అడుగుతారు. సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. అలా అడిగితే ఇస్తారా? అని ప్ర‌శ్నించారు ఎంపీ ర‌ఘురామ‌. 

9. మణికొండ నాలాలో పడిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతదేహం ఎట్ట‌కేళ‌కు లభ్యమైంది. రెండు కి.మీ. దూరంలో నెక్నమ్‌పూర్ చెరువు ఒడ్డున ఆయన మృతదేహాన్ని క‌నుగొన్నారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రజనీకాంత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. 

10. సిరియా రాజధాని డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం ద‌గ్గ‌ర‌ ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో సుసైడ్ బాంబర్‌తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఘటనంతా వీడియోలో రికార్డైంది.