TOP NEWS @ 7pm

1. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కలిశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.

2. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు. 

3. టీజేఎస్ చైర్మన్ కోదండరామ్‌పై పోలీసుల అనుచిత వైఖరిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు రేవంత్‌రెడ్డి హెచ్చ‌రించారు. 

4. వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌కు వరి కొనమని ఎవరు చెప్పారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. నా భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు బండి సంజ‌య్‌.

5. సోమవారం రాత్రి నుంచి తనను ఫోన్లు, మెసేజ్‌లతో పీకే ఫ్యాన్స్ తిడుతున్నారంటూ పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘ఫ్యాన్స్‌తో గ్రూపును పెట్టుకున్నాడు. ఫంక్షన్లకు తన ఫాన్స్‌ను పంపిస్తున్నాడు. నువ్వు సద్దాం హుస్సేన్ లా నియంతవా? పవన్ కల్యాణ్ ఒక సైకో‘‘.. అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు పోసాని. 

6. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని పీకే ఫ్యాన్స్ హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పోసాని ప్రెస్‌మీట్ పెట్టిన ప్రెస్‌క్లబ్ ద‌గ్గ‌ర పీకే ఫ్యాన్స్ భారీగా చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. 

7. నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరు జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు 2017-18లో చేపట్టిన పనులకు ఇప్ప‌టి వరకు బిల్లులు మంజూరు చేయలేదంటూ హైకోర్టులో 100 మంది పిటిషన్లు వేశారు. విచారణ పేరుతో బిల్లులు ఇవ్వకపోవడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 

8. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూసీ వరద ఉధృతితో మూసారాం బాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ చేశారు. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ఉధృతి పెరిగింది.  

9. సీపీఐ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధినేత కన్హయ్య కుమార్, గుజరాత్‌లోని వడగావ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దేశంలోని సంస్కృతిని చరిత్రను భవ్యిష్యత్‌ను నాశనం చేయడానికి ఒక భావజాలం చాలా ప్రయత్నిస్తోంది. అందుకే త‌న‌కు కాంగ్రెస్ భావజాలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని క‌న్హ‌య్య అన్నారు. 

10. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయ‌డం ఆ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని సిద్ధూ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఓ దళితుడు చేపట్టడాన్ని కాంగ్రెస్ నేత సిద్ధూ సహించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ విమ‌ర్శించింది.