మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు.. జ‌గ‌న్ కేసుల్లో ట్విస్ట్‌.. కొత్త వేరియంట్ క‌ల‌క‌లం.. టాప్‌న్యూస్ @1pm

1. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్ తెలంగాణలో కలకలం రేపుతోంది. 48 ఏళ్ల వ్య‌క్తికి, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 నిర్ధారణ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొత్త వేరియంట్‌పై స్పందించేందుకు వైద్యాధికారులు నిరాక‌రిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ విస్తరిస్తున్న‌ట్టు స‌మాచారం. 

2. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇకపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ జరగనుంది. దాఖలైన రిట్ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది. 

3. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్ర‌జా ప్ర‌స్థాన‌ పాదయాత్ర కొనసాగిస్తూనే.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ష‌ర్మిల దీక్ష‌ల‌ను టార్గెట్ చేస్తూ.. మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లంటూ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి చేసిన కామెంట్లు కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. 

4. మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేయడంతో పులివెందులతో పాటు కడప జిల్లాలో కలకలం రేగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మరికొందరిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పులివెందులలో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అధికారపార్టీ నేతల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

5. హుజురాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలంలో అధికార పార్టీ నేతలు కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓట‌ర్లు రోడ్డెక్కారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఏకంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. డ‌బ్బుల కోసం పెద్ద సంఖ్య‌లో మహిళలు రావడంతో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న వారిని అక్కడినుంచి పంపించేశారు. 

6. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలంటూ విజయవాడలో లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రం పన్నుల రూపంలో రూ. 32 వసూలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు 22.25శాతం వ్యాట్ టాక్స్‌తో పాటు అదనంగా నాలుగు రూపాయలు, రోడ్ సెస్ కింద 1.22 రూపాయలు వసూలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

7. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందని ప్రేమ సింగ్ అనే యువకుడు ఓ యువతి ఇంటిలో చొరబడి.. గొంతు, చేతి మణికట్టు ద‌గ్గ‌ర క‌త్తితో దాడి చేశాడు. యువ‌తి అరుపులతో బంధువులు, స్థానికులు యువకుడిని ప‌ట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. 

8. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మాడుగుపల్లి గ్రామానికి చెందిన నరేష్ కుమారెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ లో చూసి నాటు బాంబులు తయారీ చేశాడు. అమ్మేందుకు అనంతపురం తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

9. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ ఉదయ్ కిరణ్ దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడు. చెప్పినట్లు వినకపోతే ఉన్నతాధికారులకు అనవసర ఫిర్యాదులు చేస్తున్నాడని, మహిళా సిబ్బందిని తరచూ తిడుతున్నాడ‌నే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వాలంటీర్ రెచ్చిపోతున్నాడని అంటున్నారు. వాలంటీర్ ప్రవర్తనతో విసుగు చెందిన సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10. నల్గొండ జిల్లా చిట్యాలలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జాతీయ రహదారిపై బస్సులలో తనిఖీలు చేస్తుండ‌గా.. ఏపీలోని సీలేరు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సులో 22 కేజీల గంజాయి దొరికింది. గంజాయిని స్వాధీనం చేసుకొని.. తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.