TOP NEWS @ 1pm

1. హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిషికేష‌న్ రానుంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్. న‌వంబ‌ర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 8, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 13 చివ‌రి తేదీలు. 

2. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్వీట్ చేసి మ‌రింత‌ ర‌చ్చ రాజేశారు. పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ సైతం పోస్ట్ చేశారు పేర్ని నాని. 

3. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 10 ప్ర‌శ్న‌ల‌తో లేఖ రాశారు. కేసీఆర్ జమానా-అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్‌.. అవినీతి భవన్‌గా మారిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?.. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ బండి సంజ‌య్‌ సవాల్ చేశారు. 

4. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేత‌ల కోల్డ్‌వార్ తాడేప‌ల్లికి చేరింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే ఒకరితో ఒక‌రు వాగ్వివాదానికి దిగడంతో సీఎం జ‌గ‌న్‌ మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆ ఇష్యూను సీఎం జ‌గ‌నే స్వ‌యంగా డీల్ చేయ‌నున్నారు.

5. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. ఇవాళ‌ సీబీఐ విచారణకు వేముల జడ్పీటిసీ బయపురెడ్డి హాజరయ్యారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి బయపురెడ్డి  అనుచరుడు. 

6. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి మ‌రీ మదనపల్లిలో ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. భార్య, మరదలు, అత్త  వేధిస్తున్నారని ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో గమనించిన స్నేహితులు, కుటుంబసభ్యులు పోలీసులకు స‌మాచారం అందించారు. 

7. మేడ్చల్‌లో అక్రమంగా రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో దాడి చేసి ఎస్‌ఓటీ పోలీసులు ప‌ట్టుకున్నారు. 47 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఐదుగురు గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. 

8. భారీ వర్షానికి సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లోనే చిక్కుకుపోయారు. రాత్రి కలెక్టరేట్‌లోనే అనురాగ్ జయంతి బస చేశారు. కాగా ఉదయం మరింత వరద నీరు వచ్చి చేరడంతో చివరకు ట్రాక్టర్ సహాయంతో కలెక్టర్‌ను అధికారులు బయటకు తీసుకువచ్చారు. 

9. గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో చెదురు ముదురు జల్లులు పడుతున్నాయి. గులాబ్‌ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు త‌డిసి ముద్ద‌వుతున్నాయి. మ‌రో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వర్షాలు పడతాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 

10. ప్రధాని మోదీ అధ్యక్షతను కేంద్రమంత్రివర్గం మధ్యాహ్నం 3.45 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి కావ‌డం ఆస‌క్తిక‌రం.