తెలుగుదేశంలో యనమల శకానికి ఎండ్ కార్డ్?!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం ముగ్గరు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా.. వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు తెలుగుదేశం కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఇప్పటికే జనసేన సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన నాలుగు స్థానాలలో ఒక స్థానాన్ని అనూహ్యంగా బీజేపీకి కేటాయించిన తెలుగుదేశం.. మిగిలిన మూడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. వాటిలో ఒకటి ఎస్సీకి, మిగిలిన రెండూ బీసీలకూ కేటాయించింది. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల కేటాయింపులో సామాజిక సమన్యాయాన్ని పాటించిన తెలుగుదేశం.. బీసీలకు రెండు స్థానాలు కేటాయించినప్పటికీ, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న యనమలకు టికెట్ కేటాయించలేదు. ఎమ్మెల్సీగా ఆయనను కొనసాగించేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ యనమలను పక్కన పెట్టింది. అదే సమయంలో బీటీ నాయుడిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.  సహజంగానే ఈ నిర్ణయం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే యనమలకు ఎందుకు ఇవ్వలేదన్న చర్చ కాకుండా, తనకు టికెట్ దక్కకపోవడంపై యనమల ఎలా రియాక్ట్ అవుతారా అన్న అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవానికి చంద్రబాబు తన కేబినెట్ లో యనమలకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ఇప్పటికే యనమల ఒకింత అసంతృత్తితో ఉన్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత  కాకినాడ పోర్టు విషయంలో  తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని, అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ యనమల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇవ్వకపోవడంతో యనమల ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన  తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఖరారును స్వాగతించారు. . బడుగు వర్గాలకు.. అందునా యువతకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల యనమల హర్షం వ్యక్తం చేశారు.   యనమల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవీ లేకుండా ఉండడం ఇదే తొలిసారి. 1982 నుంచి తాజాగా 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచేంత వరకు ఏదో కొద్ది కాలం మివహా యనమల ఏదోక  కెబినెట్ ర్యాంకులోనే కొనసాగుతూనే వచ్చారు. ఇప్పుడు ఆయనకు ఏ పదవీ ఇవ్వకపోవడంతో ఆయన శకం ఇక టీటీపీలో ముగిసినట్లేనా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.  
తెలుగుదేశంలో యనమల శకానికి ఎండ్ కార్డ్?! Publish Date: Mar 10, 2025 9:59AM

విడాకులు వెక్కిరిస్తాయ్ జాగ్రత్త!

మామిడాకుల తోరణాల మధ్య, మంగళ వాయిద్యాల మురిపెంలో, మూడుముళ్ళతో ఒక్కటై, జీవితాంతం ఒకరికి ఒకరని ఉండాల్సిన దంపతులు కాస్తా  విడాకులను పంచేసుకుంటున్నారు.  ఈమధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువైపోతొంది. విడాకులకు చెబుతున్న కారణాలకు కోర్ట్ లోని జడ్జ్ లు కూడా విస్తు పోతూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న సమస్యలను కారణంగా చూపుతూ విడాకులు కావాలని అడగుతున్నందుకు.  ప్రతి మనిషి ప్రతి సమస్యను స్వయానా అనుభవిస్తున్నపుడే ఆ సమస్యలో తీవ్రత అర్థమవుతుంది. అందుకే సమస్యలు చిన్నవి అయినా  అవి వాళ్ళను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బయటి వాళ్ళు మాత్రం చాలా తొందరగా విమర్శలు  చేసేస్తారు. అయితే సమస్యలు ఎలాంటివి అయినా మనుషులు బంధాలను అంత సున్నితంగా వదిలేయడం, విడిపోవడం అనేవి కాస్త కలవరపరిచే విషయాలే.  అసలు విడాకులు ఎందుకు? ఒకరితో మరొకరు కలిసి బతకలేం అనే విషయం పూర్తిగా అర్థమైనపుడు అలా విడిపోవడం అనే సందర్భం వస్తుంది. చాలామంది పరువు కారణంగానో, పిల్లల భవిష్యత్తు కారణంగానో, మరీ వేరే ఇతర కారణాల వలనో ఇష్టం లేకపోయినా బతుకు వెళ్లదీస్తుంటారు.  విడాకుల వల్ల నష్టపోయేది అమ్మాయిలే అనే ముఖ్య విషయం చాలా చోట్ల అర్థమవుతూ ఉంటుంది. కారణాలు చాలానే ఉన్నాయి. పిల్లలు అమ్మాయిల దగ్గరే ఉండటం, ఆర్థికంగా మరియు ఉద్యోగ విషయంగా మంచి స్థాయిలో లేకపోవడం.  విడాకుల తర్వాత సమాజం దృష్టిలో చులకన అయిపోతామనే భావం గట్టిగా బలపడి ఉండటం. అటు తల్లిదండ్రుల వైపు నుండి, ఇటు అత్తమామలు వైపు నుండి ఎలాంటి ఆదరణ లేకపోవడం.  మరి అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వడం ఎలా? చాలావరకు విడాకుల విషయంలో నెలనెలా భార్యకు భరణం ఇస్తున్న భర్తలు చాలా తక్కువని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మొదట్లోనే కొద్దీ మొత్తం ఇచ్చి పూర్తిగా వదిలించేసుకుంటారు. అలాంటి విషయాలపై ఆధారపడకుండా…. మహిళలు చదువు లేకపోయినా కొన్ని నైపుణ్యాలు నేర్చుకుని ఉండాలి.  కుట్టు పని, అల్లికలు, ఆర్ట్&క్రాఫ్ట్స్, ఇతర చేతి పనులు వంటివి నేర్చుకుని ఉండాలి. విడాకుల విషయంలో అనవసర ఇగో లకు పోకుండా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చర్చించుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఆ చర్చలో కలిసి ఉండలేం అనే విషయం ఫైనల్ అయినా ఆరోగ్యంగా విడిపోవాలి. ఎవరూ ఎవరిని అనవసర విమర్శలు చేసుకోకూడదు. విడాకుల వల్ల తదుపరి తమ జీవితాలు బాగుంటాయా లేదా అనే విషయం ఆలోచించాలి. లేకపోతే పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డ చందాన తయారవుతాయి జీవితాలు. అమ్మ నాన్నలో, అక్కా తమ్ముల్లో, అన్నా వదినలో లేక స్నేహితులో ఇరుగు పొరుగు వాల్లో ఇలా ఎవరిని జోక్యం చేసుకొనివ్వకూడదు. ఎందుకంటే ముడిపడిన జీవితాలు రెండైనపుడు, ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సింది మొదట ఇద్దరే.  ఆర్థిక విషయాల పట్ల ఎలాంటి మోహమాటాలు లేకుండా మాట్లాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే జీవించాలంటే డబ్బు కూడా అవసరమే. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే విడాకుల ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే వ్యక్తి గతంగా ఉత్తమంగా ఉండగలరు. పిల్లల భవిష్యత్తు గందరగోళానికి గురవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర విడిపోయిన భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు.  మంచి ముహుర్తాలు పెట్టుకుని జతకావడం, విడాకుల ద్వారా విడిపోవడం అనేది జీవితాల్లో కచ్చితంగా అలజడి సృష్టిస్తుంది. అయితే ఆలోచించి అడుగు వేయడం ముఖ్యం. ఎందుకంటే  మీరు వేసేది  తప్పటడుగై ఏడడుగులను వెక్కిరించకూడదు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  
విడాకులు వెక్కిరిస్తాయ్ జాగ్రత్త! Publish Date: Mar 10, 2025 9:30AM

చెరకు రసం వేసవిలో మంచిదే.. కానీ వీళ్లకు డేంజర్..!

  వేసవి కాలం ప్రారంభం కావడంతోనే  చెరకు రసం కోసం డిమాండ్ కూడా పెరుగుతుంది. చెరకు రసం సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది.  శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు,  సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే, చెరకు రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు  కొంతమంది దీనిని తాగకుండా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. చెరకు రసం ఎవరు తాగకూడదో.. ఎందుకు తాగకూడదో..  తెలుసుకుంటే.. డయాబెటిస్ రోగులు.. చెరకు రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది . డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసం తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి చాలా తక్కువ పరిమాణంలో తాగాలి. ఊబకాయం.. చెరకు రసంలో కేలరీలు,  చక్కెర పుష్కలంగా ఉంటాయి.  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఊబకాయంతో ఉన్నా, చెరకు రసం  తాగడం సరైనది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగవచ్చు.  అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  మధుమేహం వంటి ఊబకాయం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది . దంత సమస్యలు.. చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది దంతాలకు హానికరం.  బలహీనమైన దంతాలు లేదా కుహరం సమస్యలు ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. చక్కెర దంతాలలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది. జీర్ణ సమస్యలు.. చెరకు రసం చల్లగా ఉంటుంది. ఇది కొంతమంది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి కడుపు సమస్యలు ఉంటే, చెరకు రసం తాగడం మానుకోవాలి. ఇది కడుపులో చల్లదనాన్ని కలిగిస్తుంది,  జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది సమస్యలను పెంచుతుంది. మూత్రపిండ వ్యాధి.. చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పొటాషియంను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే  మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు.  అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.                                               *రూపశ్రీ.
చెరకు రసం వేసవిలో మంచిదే.. కానీ వీళ్లకు డేంజర్..! Publish Date: Mar 10, 2025 9:30AM

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం

తమ కోటాలో సీట్లన్నీ బడుగలకే కేటాయించేసిన తెలుగుదేశం అగ్రవర్ణాలకు నో ఛాన్స్.. అనూహ్యంగా తెర మీదకు బీజేపీ అనుకున్నట్టే జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని ఏ చర్చ అయితే జరిగిందో.. అదే తరహాలో ట్విస్ట్ ఇచ్చింది తెలుగుదేశం అధినాయకత్వం. పార్టీ  ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా నలుగురు ఉంటారనుకుంటే.. చివరి నిమిషంలో బీజేపీ ఓ సీటును ఎగరేసుకుపోయింది. దీంతో తెలుగుదేశం ఆశావహులకు గండిపడింది. ఇక  తెలుగుదేశం  అధిష్టానం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లను ఖరారు చేసింది. మూడు స్థానాల్లో రెండు బీసీలకు.. ఒకటి ఎస్సీకి కేటాయించడం ద్వారా తాము పూర్తిగా బడుగులకే పెద్ద పీట వేస్తున్నామనే విషయాన్నిచాటి చెప్పింది. చివరి నిమిషంలో బీజేపీ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని తన్నుకుపోవడంతో ఓసీలకు స్థానం కల్పించలేకపోయింది తెలుగుదేశం  అధినాయకత్వం. ఇక ప్రాంతాల వారీ కూర్పు విషయానికి వస్తే, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకూ ఒక్కో స్థానాన్ని కేటాయించినట్టు అయింది.  వీటిల్లో బీదా రవిచంద్రయాదవ్ పేరు ముందు నుంచి ఊహించినదే అయినా.. బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లు మాత్రం ఎవరూ ఊహించ లేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీదా రవిచంద్రకు పార్టీపై మంచి పట్టు ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి సేవలందించారు. అలాగే వివిధ జిల్లాల్లో నేతలను సమన్వయం చేస్తూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా   ఎదిగిన బీదాకు అటు చంద్రబాబు వద్ద.. ఇటు లోకేష్ వద్ద కూడా మంచి పేరు ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను.. ఫిల్టర్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం బీదాకున్న ప్రత్యేకత. ఇక 2019-2024 మధ్య కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ జిల్లాల బాధ్యతలు బీదాకు అప్పజెప్పారు. ఆయా జిల్లాలను ఓ కొలిక్కి తీసుకురావడంలో బీదా సక్సెస్ అయ్యారు. అలాగే  తెలుగుదేశం  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో లోకేష్ మీద అప్పటి మంత్రి వెలంపల్లి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన సందర్భంలో బీదా వెలంపల్లికి, లోకేషుకు అడ్డంగా నిలిచారు. ఈ క్రమంలో బీదాకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కచ్చితంగా వచ్చి తీరుతుందని భావించారు. అలాగే ఎమ్మెల్సీ సీటు బీదాను వరించింది.  ఇక బీటీ నాయుడు. ఇప్పుడు ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీటీ నాయుడుది ఒకటి. 2009, 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు బీటీ నాయుడు. బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుకు తిరిగి ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేసి.. కంటిన్యూ చేస్తున్నారు. బీటీ నాయుడును కంటిన్యూ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు రాజమండ్రిలోనే బీటీ నాయుడు మకాం వేశారు. పైగా వృత్తి పరంగా బీటీ నాయుడు అడ్వకేట్. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అడ్వకేట్ హోదాలో ప్రతి రోజూ చంద్రబాబును కలవడం, బయట జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు, చంద్రబాబు చేసిన సూచనలను బీటీ నాయుడు బాబు కుటుంబ సభ్యులకు, అవసరమైన మేరకు పార్టీ సభ్యులకు చెప్పేవారు. దీన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకున్నారు. దీంతో బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఇక కావలి గ్రీష్మ. ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తారనే చర్చ నామ మాత్రంగా కూడా పార్టీలో లేదు. కానీ ఆమె పేరును ఎవరూ ఊహించని విధంగా ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావడం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్న పరిస్థితులలు కూడా గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కేలా చేశాయి. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ వ్యవహర శైలిపై కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజాం స్థానం కోసం కొండ్రు మురళీతోపాటు.. కావలి గ్రీష్మ కూడా పోటీ పడ్డారు. కానీ అప్పట్లో ఆ స్థానాన్ని కొండ్రరు మురళీకే కేటాయించింది అధిష్టానం. ఇప్పుడు అక్కడ పరిస్థితులను బేరీజు వేసుకుని.. అన్ని కోణాల్లో ఆలోచన చేసిన మీదట గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారనేది ఓ చర్చ. ఇక ఈమెకు లోకేష్ టీం మెంబరుగా పేరు ఉంది. గతంలో ఓ మహానాడులో గ్రీష్మ స్పీచ్ తెలుగుదేశం కార్యకర్తలను ఉర్రూతులూగించింది.  ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేకపోయిన ఆశావహులకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లాయి. ప్రస్తుతమున్న ఈక్వేషన్లల్లో భాగంగా ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామనే విషయాన్ని వారికి వివరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేకపోయిన వారికి.. భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులో లేక.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించడమో చేస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ చివరి నిమిషంలో ఓ సీటును తీసుకోకపోయి ఉంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి స్థానం దక్కేది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం Publish Date: Mar 10, 2025 7:50AM

కొత్తగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు

అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏర్పాటుకు సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో.. మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయాలని సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు.. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్‌లు, 27న ఫైనాన్షియల్‌ బిడ్‌లు తెరవనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో.. శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ. దూరంలో, సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను కన్సల్టెన్సీ సంస్థలు గుర్తించాలని పేర్కొంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్‌ మాస్టర్‌ప్లాన్, ఫైనాన్షియల్‌ మోడల్, ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్లను సిద్ధం చేయాలని.. పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది. విమానాశ్రయం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని దశల్లో చేపట్టాలి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, జాయింట్‌ వెంచర్‌ వంటి విధానాల్లో దేన్ని అనసరించాలి తదితర ప్రతిపాదనలతో పాటు ఎంత ఆదాయం వస్తుంది వంటి అంచనాల్ని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.  విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్‌ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు.. వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాలని ఏపీఏడీసీ తెలిపింది. భవిష్యత్తులో డిమాండ్‌ ఎలా ఉండబోతోంది, ఎయిర్‌ ట్రాఫిక్‌ వృద్ధి ఎలా ఉంటుందన్న అంశాలనూ శోధించాలంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక, ఇతరత్రా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండాలో కూడా సూచించాలని తెలిపింది. విమానాశ్రయాలకు ప్రాంతీయ అనుసంధానత, భవిష్యత్తులో ప్రయాణికులు అవరోధాలు లేకుండా సులభంగా ఎయిర్‌పోర్టులకు చేరుకునేందుకు అభివృద్ధి చేయాల్సిన రవాణా మార్గాలపైనా కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక ఇవ్వాలని సూచించింది. విమానాశ్రయాలకు సంబంధించి రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని, రన్‌వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి.. అవి ఎంత పొడవు ఉండాలి, ఎయిర్‌క్రాఫ్ట్‌ పార్కింగ్‌ స్టాండ్‌లు ఎన్ని అవసరం, ఎలాంటి విమానాలు నిలిపేందుకు ఏ తరహా స్టాండ్లు ఉండాలి, ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ మాస్టర్‌ప్లాన్‌లో ఉండాలని తెలిపింది. విమానాశ్రయాలకు ఇతరత్రా మార్గాల్లో అంటే నాన్‌ ఏవియేషన్‌ రెవెన్యూ  వచ్చేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఎంత భూమి అవసరం? తదితర సమస్త సమాచారాన్నీ కన్సల్టెన్సీ సంస్థలు తమ నివేదికల్లో పొందుపరచాలని ఏపీఏడీసీ పేర్కొంది.
కొత్తగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు Publish Date: Mar 10, 2025 6:14AM