భారత అథ్లెట్లకు రోజు కరోనా టెస్ట్! ఒలింపిక్స్ కమిటి రూల్ పై ఐఓఏ ఫైర్... 

వచ్చే నెలలో  జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారితో గత సంవత్సరం వాయిదా పడిన ఒలింపిక్స్ ను జూలైలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తో ఈసారి కూడా నిర్వహణ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు వచ్చినా.. చివరకు నిర్వహణపై మొగ్గు చూపింది జపాన్ ప్రభుత్వం. అయితే కొవిడ్ మార్గదర్శకాల పేరుతో కఠినంగా వ్యవహరిస్తోంది టోక్యో ఒలింపిక్స్ కమిటి. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 దేశాల నుంచి వచ్చే అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఆయా దేశాల క్రీడాకారులు జపాన్ బయల్దేరడానికి ముందు వారం రోజుల పాటు నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

టోక్యో  ఒలింపిక్స్ నిర్వాహకులు కఠిన చట్టాలు విధించిన దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ తో పాటు పాకిస్థాన్, బ్రిటన్ దేశాలు కూడా ఉన్నాయి. 11 దేశాలకు చెందిన అథ్లెట్లు తమతమ దేశాల్లో చివరి వారం రోజుల పాటు రోజు కరోనా టెస్టు చేయించుకోవడంతో పాటు జపాన్ చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఇతర దేశాల జట్లతో కలవకుండా క్వారంటైన్ లో  ఉండాలని తెలిపింది. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కరోనా వేరియంట్ల కారణంగా గణనీయమైన నష్టం జరిగిందని వెల్లడించారు.

టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వంటి దేశాల అథ్లెట్లపై ఆంక్షలు విధించడం తీవ్ర అనైతికం అని విమర్శించింది. ఈ నిబంధనల కారణంగా అథ్లెట్లు మూడు రోజుల పాటు కీలకమైన శిక్షణకు దూరమవ్వాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిపై ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్త ప్రకటన చేశారు. అథ్లెట్లు తమ ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు ఒలింపిక్ క్రీడాగ్రామంలోకి ప్రవేశిస్తారని, కొత్త నిబంధనల నేపథ్యంలో మూడు రోజులు వృథా అని తెలిపారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఐదేళ్లు కఠోరంగా శ్రమించారని, భారత క్రీడాకారులకు కూడా వర్తించేలా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.