మంత్రి బుగ్గనకు ఘోర అవమానం..

ఆయనో మంత్రి... అయినా ఎయిర్ పోర్టు అధికారులు పట్టించుకోలేదు. లోపలికి అనుమతించలేదు. తాను మంత్రినని చెప్పుకున్నా వినిపించుకోలేదు. మంత్రైతే మాకేంటి.. లిస్టులో పేరు ఉంటేనే ఎంట్రీ అంటూ ఎయిర్ పోర్టు సిబ్బంది గేటు దగ్గరే ఆపేశారు. దీంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు సదరు మంత్రి. తనకు జరిగిన అవమానంతో రగిలిపోతున్నారు. ఈ అవమానం జరిగిన మంత్రి ఎవరో కాదు.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి.

ఏపీ  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంత్రనాథ్ రెడ్డికి తిరుపతి విమానాశ్రయంలో ఈ అవమానం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన మంత్రి ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. రన్ వేకు వెళ్లే రెండో గేట్ దగ్గర మంత్రి బుగ్గనను నిలిపివేశారు.  కేంద్రమంత్రి పియూష్ గోయల్ తిరుపతి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఆర్థికమంత్రి వీడ్కోలు చెప్పాల్సి ఉంది. ఆ సమయంలో ఆయన లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిని అని చెబుతున్నా వినకకుండా తోసేసినట్టు తెలుస్తోంది. 

తాను మంత్రినని బుగ్గ ఎంత చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. లిస్టులో పేరు ఉన్నవారిని మాత్రమే పంపిస్తామని.. ఆ లిస్టులో బుగ్గన పేరులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుతో కేంద్రమంత్రికి ఆయన వీడ్కోలు పలకలేకపోయారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని తిరుపతి ఆర్డీవో వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ అనుమతి లేనిదే ఎవరికీ అనుమతి ఇవ్వలేం అంటూ ఎయిర్ పోర్టు టెర్నినల్ మేనేజర్ స్పష్టం చేశారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారని తెలుస్తోంది. 

అంతకుముందు చిత్తూరు జిల్లా  తిరుచానూరు.. శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి బుగ్గను కూడా పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనం ముగిసిన తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.