తోబుట్టువుల మధ్య బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు ఇవే..!
posted on Nov 3, 2025 9:30AM
.webp)
ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు. పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.
తల్లిదండ్రులు చేసే ప్రవర్తన, ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే..
తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు..
సమాన ప్రేమ, గౌరవం..
తల్లిదండ్రులు పిల్లలను అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.
సహకారం, పంచుకోవడం నేర్పించాలి..
చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన, బాధ్యతా భావం పెంచుతాయి.
కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..
పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.
వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం..
తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.
పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం..
“నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు. ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు. “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది” ఇలాంటి మాటలు వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.
సమయం కేటాయించడం..
పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి. ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది. ఇది అసూయ తగ్గిస్తుంది.
ప్రేమ చూపే విధానం నేర్పించడం..
తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి. ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.
*రూపశ్రీ.