తప్పిన జగన్ అటెండెన్స్ లెక్కలు

వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారు. ఆరు నెలలు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి తన 11 మంది టీమ్‌లో అసెంబ్లీకి వచ్చిన ఆయన 11 నిముషాలు కూడా గడపకుండానే వెళ్లిపోయారు . అనర్హత వేటు భయంతో కేవలం అటెండెన్స్ కోసమే జగన్ టీమ్ సభకు వచ్చి వెళ్లారు. మరో ఆరు నెలల తర్వాత ఆయన మరోసారి అసెంబ్లీలో తళుక్కుమనే పరిస్థితి కనిపిస్తోంది.  ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ లాజిక్కు లేని రీజన్‌తో సభకు డుమ్మా కొడుతున్న జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఘనంగా ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. అంతే కాదు తాను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్తున్న జగన్.. ఈ సారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్లు పరిపాలిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అటెండెన్స్ విషయంలో జగన్ లెక్క తప్పినట్లు కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ రోజుని అసెంబ్లీ జరిగినట్లు పరిగణలోకి తీసుకోరు. ఆ రోజు సభకు హాజరైనా అటెండెన్స్ పడదు. అంటే జగన్ సభకు హాజరవ్వనట్లే లెక్క. ఇటు చూస్తే జగన్ తన ఎమ్మెల్యేలకు హోదా లేకుంటే సభకు వెళ్లినా ఉపయోగమేముంటుందని చెప్పి పులివెందుల టూర్ పెట్టుకున్నారు. ఈ సెషన్స్‌లో సభలో జగన్ హాజరు అధికారికంగా నమోదు కాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. మరి అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్ సభా నియమాలు తెలుసుకోకుండా సభలో హడావుడి  చేసి.. హాజరు పడిందన్న ఫీలింగుతో  వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆయన  ఈ సెషన్స్‌లోనే అసెంబ్లీలో మరోసారి కనపడకపోతే ఇక అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేకుండా పోతుంది. మొత్తానికి జగన్ తన బెట్టు వీడి మరోసారి మెట్టు దిగక తప్పేలా లేదిప్పుడు.
 తప్పిన జగన్ అటెండెన్స్ లెక్కలు Publish Date: Feb 24, 2025 5:07PM

వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ వంశీకి మరో షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను పది రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మేరకు ఆయనను పోలీసులు మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ మూడు రోజుల పాటూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసులు వంశీని విచారిస్తారు. అనంతరం వంశీని మళ్లీ జిల్లా జైలుకు తరలిస్తారు. ఇక జైల్లో సౌకర్యాలపై వంశీ చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు ఆయనకు జైలులో బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే వెస్ట్రన్ టాయిటెల్ సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించింది. అయితే పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ సదుపాయాల కల్పన వంశీకి పెద్ద ఊరట అని భావించలేము. గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ అక్రమాలపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, భూముల కబ్జా, తక్కువ ధర చెల్లించి సొంతదారులను బెదరించి భూములు సొంతం చేసుకున్నారన్న ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైనా కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. 
వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్ Publish Date: Feb 24, 2025 4:46PM

 ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు?  

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న రాజాసింగ్ కు  గతంలో బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్  దేశాల నుంచి  బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆదివారం  మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు రాజాసింగ్ చెప్పారు. మోదీ, యోగీ ఆదిత్యనాథ్ తమను ఏం చేయలేరని నిందితులు ఫోన్ లో అన్నట్టు తెలుస్తోంది. రెండు వేర్వేరు నెంబర్లతో ఫోన్ లు వచ్చినట్టు రాజాసింగ్ చెప్పారు. రాజాసింగ్ కు గతంలో గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేశారు. అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రాజాసింగ్  తల నరికేస్తాం ఇన్షియాల్లా అంటూ ఆయనపై  అంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ వరుసగా మూడు పర్యాయాలు గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు.  హైద్రాబాద్ నుంచి ఏకైక  బిజెపి ఎమ్మెల్యేరాజాసింగ్ హత్య కుట్రకు దుండగులు ప్లాన్ చేసిట్టు తెలుస్తోంది. తాజాగా రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.   హిందూ ధర్మ పరిరక్ఝణ కోసం తాను ఉద్యమిస్తే దుండగుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వాపోయారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని తెలుస్తోంది.  
 ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు?   Publish Date: Feb 24, 2025 3:38PM

జమిలీతో జయం.. అసెంబ్లీకి రాంరాం.. జగన్ కొత్త రాగం..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. సోమవారం (ఫిబ్రవరి 24 ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు భయమో, ఉప ఎన్నికలు వస్తే పులివెందుల సహా ఇప్పడు పార్టీకి ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న బెదురో కానీ.. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప తొక్కను అన్న ప్రతిజ్ణను కాసేపు పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరైన జగన్ గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ కూడా కూర్చో లేకపోయారు. తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలకు 11వ బ్లాక్ లో సీట్లు కేటాయించడం ఆయనకు ఎన్నికల ఫలితాలను గుర్తు చేసినట్లున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. సరే కేటాయించిన 11వ బ్లాక్ సీట్లలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చో లేదు. పదే పదే జగన్ ప్రతిజ్ణను గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నానాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అది కూడా ఎక్కువ సేపు లేదు.  మళ్లీ మూడు సెషన్ల వరకూ లేదా అరవై సమావేశ దినాల వరకూ తమ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అనుకున్నారో ఏమో.. సరిగ్గా 11 నిముషాల పాటు సభలో నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు.  బాయ్ కాట్ తరువాత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ణానోదయమైనట్లు.. తనకు అసెంబ్లీలో జ్ణానోదయమైందన్నట్లుగా మారిపోయారు. ఉప ఎన్నికలు వచ్చినా, ఉన్న స్థానాలు కూడా పోయినా, ఇక అసెంబ్లీకి మాత్రం హాజరయ్యే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి నుంచే మనం తదుపరి ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు నిచ్చారు. ఎలా చూసుకున్నా 2028లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన జగన్.. అనర్హత వేటు గురించి మరిచిపోయి.. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేరౌదామని చెప్పుకొచ్చారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాలలో ఉంటాననీ, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడతాం. 2028 ఎన్నికలలో గెలుద్దాం అని వారిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. చేసిన ప్రతిజ్ణను మరిచిపోయి.. అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు కేవలం 11 అంటే 11 నిముషాలలో ఈ జ్ణానోదయం ఎలా అయ్యిందబ్బా అని వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. ఈ జ్ణానం ఏదో ఒక రోజు ముందు అయ్యి ఉంటే ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చేది కాదు కదా? పరువు ఇంతగా పోయి ఉండేది కాదు కదా? అని వైసీపీ శ్రేణులే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. నెటిజనులైతే.. మళ్లీ 60 రోజుల గడువు పూర్తి అవుతున్న సమయంలో జగన్ కు పులివెందుల భయం పట్టుకుంటుందేమో చూడాలి అని జోకులేస్తున్నారు.  
జమిలీతో జయం.. అసెంబ్లీకి రాంరాం.. జగన్ కొత్త రాగం..! Publish Date: Feb 24, 2025 3:08PM

వల్లభనేనికి బిగ్ షాక్ 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. మూడు రోజుల కస్టడీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం  వల్లభనేని వర్గీయులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సోమవారం తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం విజయవాడ పరిధిలోనే  పోలీసులు కస్టడీ తీసుకోనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసులు వంశీని ఇంటరాగేషన్ చేయనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడు. ఇదే కేసులో వంశీ రిమాండ్  ఖైదీగా ఉన్నారు. వంశీని10 రోజుల కస్టడీకి  ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవిస్తే కోర్టు మాత్రం కేవలం మూడు రోజుల కస్టడీకి అప్పగించారు. 
వల్లభనేనికి బిగ్ షాక్  Publish Date: Feb 24, 2025 2:20PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్‌లో అయిదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల 29తో ముగియనుంది. వాటి భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది, మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, అదేరోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ విడుదల చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ముగ్గరు, కాంగ్రెస్‌తో ఉన్న మైత్రితో ఎంఐఎం నుంచి ఒకరు,  బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది ఇక కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం పూర్తి కానుంది ఇక ఏపీలో మొత్తం ఐదు స్థానాలు కూడా కూటమికే దక్కే అవకాశాలు ఉన్నాయి. జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు వారి పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఉప  ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. నాగబాబుని మంత్రివర్గంలోకి  తీసుకుంటారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన్ని శాసనమండలికి పంపిస్తారంటున్నారు. మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ Publish Date: Feb 24, 2025 1:48PM