విశాఖలో విప్రో ఎండీపై కేసు

క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు ఈనెల 21వ తేదీన విచారణ  ఐటీ  దిగ్గజ కంపెనీ విప్రో  ఎండీ సహా ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులపై విశాఖలో కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లీజ్ అనుమతులు లేకుండా మరో ఐటీ కంపెనీకి భవనాన్ని లీజుకు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదు పై విశాఖలోని ద్వారక నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.  విశాఖ  నడిబొడ్డున రేసపువాని పాలెం వద్ద విప్రో కంపెనీ 6 అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.  ఈ దశలో ప్రభుత్వ  సూచన మేరకు ఉద్యోగ కల్పన చేయకపోవడంతో ఆ భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు.  కానీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.  ఈ దశలో విప్రో సంస్థ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న పల్సస్ సంస్థకు భవనంలోని మూడు అంతస్తులు లీజుకు ఇచ్చారు.  విప్రో సంస్థకు సంబంధించిన భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఎస్ ఎఫ్ టి 37 రూపాయలు చొప్పున 37 75 చదరపు అడుగుల స్థలాన్ని 2019లో, అలాగే 2022 లో  ఐదు, ఆరు అంతస్తులో చదరపు అడుగు 58 రూపాయలకు చొప్పున 35872 అడుగుల స్థలాన్ని,   చదరపు గజం 38.85 రూపాయలకు 4877 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకి ఇచ్చారు ఈ మేరకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దీనిపై రిలీజ్ అగ్రిమెంట్ కోసం ఇటీవల విశాఖపట్నం సబ్ రిజిస్టర్ ను పల్సస్  సంస్థ ఆశ్రయించగా,  అసలే ప్రభుత్వ నుంచి లీజు అగ్రిమెంట్ లేని సంస్థ మరో సంస్థకు లీజుకు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీనిపై పల్సస్ సంస్థ తమను  విప్రో సంస్థ మోసగించిందంటూ విప్రో ఎండి తో పాటు మరికొందరు ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు ద్వారక నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాగా ఈ విషయంపై విప్రో సంస్థ ఎండితో పాటు, ఇతరులు ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విప్రో ప్రతినిథుల పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 21న విచారించనుంది.  
విశాఖలో విప్రో ఎండీపై కేసు Publish Date: Apr 19, 2025 11:17AM

రాజ్యసభకు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే!?

సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకుని లబ్ధి పొందే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభకు సెలబ్రిటీలను పంపించడం ద్వారా వారి గ్లామర్ ను, కరిష్మాను పార్టీ బలోపేతనికి వినియోగించుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఈ కసరత్తులో భాగంగానే.. కర్నాటక నుంచి ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకూ జరిగే ఎన్నికలలో పార్టీ తరఫున రంగంలోకి దించేందుకు సెలబ్రిటీల వేటలో పడ్డాయి.  క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. బీజేపీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనిల్ కుంబ్లేతోనూ, బీజేపీ రాహుల్ ద్రావిడ్ తోనూ చర్చలు జరిపినట్లు సమాచారం.  టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అయితే ఇప్పటికే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. క్రికెటర్ గా దేశానికి, కర్నాటకకూ కుంబ్లే చేసిన సేవలను ప్రస్తుతించారు. అలాగే డీకేను తాను కలిసిన విషయాన్ని కుంబ్లే కూడా ధృవీకరించారు.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున కుంబ్లే రాజ్యసభకు పోటీ చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు రాహుల్ ద్రావిడ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 
రాజ్యసభకు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే!? Publish Date: Apr 19, 2025 10:46AM

ఒకే ఒక్కడు.. రాజాసింగ్!

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ  పరిధిలో మొత్తం 20 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే,అందులో బీజేపీ జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజక వర్గం గోషామహల్. ఈ నియోజక వర్గం నుంచి   ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకసారి కాదు.. వరసగా మూడు సార్లు గెలిచారు. కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్లుగా  రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది. అందులో సందేహం లేదు. అయితే, అది రాజా సింగ్’అనే నాణేనికి  ఒక పార్శ్వం మాత్రమే. ఆయనలో మరో పార్శ్వం కూడా వుంది.  అవును.. అనేక విషయాల్లో ఆయన పార్టీతో విభేదిస్తారు. అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి వ్యవహార సరళి ఆయనకు నచ్చదు. ఒక్క కిషన్ రెడ్డి అనే కాదు, పార్టీలో పాతుకు పోయిన నాయకులు ఆయనకు నచ్చరు. అయినా.. ఆయన బీజేపీని వదలరు. బీజేపీ ఆయన్ని వదలదు. అవును.. గతంలో మునావర్‌ ఫారుఖీ షో’ ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  అయినా సస్పెన్షన్  ను ఎత్తేసి గోషామహల్ నుంచి పోటీకు ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. గెలిచి మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు. నగరంలో బీజేపీకున్న ఏక్  అఖేలా ఎమ్మెల్యే ఆయనే. అయినా.. శుక్రవారం ( ఏప్రిల్ 18) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరిగిన సమావేశానికి రాజాసింగ్ రాలేదు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.  నిజానికి   కొద్ది రోజులుగా కిషన్‌ రెడ్డి, రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.  అయితే..  ఆయనలో ఎంత అసంతృప్తి ఉన్నా, ఆయనకు పార్టీ అంతగా సహకరించక పోయినా, 2018లో 2023లో వరసగా రెండు సార్లు నగరంలో బీజేపీ  జెండా ఎగరేసిన ఒకే ఒక్కడుగా  రాజా సింగ్.. నిలిచారు.    అదలా ఉంటే.. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో జరిగిన సమావేశంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎంకు, ఒవైసీ సోదరులకు దాసోహం అంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే ఎంఐఎం రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోందని, ప్రమాదకరంగా రజాకర్ల సంస్కృతిని విస్తరిస్తోందని అన్నారు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. బీజేపీ ఎదగకుండా చేయడమే ఆ మూడు పార్టీల లక్ష్యమని అన్నారు.  కాగా, ఈ నెల  23న పోలింగ్ జరిగే  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్  గెలుపు లాంఛనమే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రం,ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకు.. పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావును బరిలో దించింది.  అయితే.. గెలుపు ఎవరిదో ముందే తెలిసి పోయినా..  కమల దళం మాత్రం ఇంకా ఆశలు వదులుకున్నట్లు లేదు. అందుకే,  శుక్రవారం(ఏప్రిల్ 18) రోజంతా జరిగిన  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో, ఒకే ఒక్కడు, ఒక్క రాజా సింగ్’ తప్ప  రాష్ట్ర, నగర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఎందుకో?
ఒకే ఒక్కడు.. రాజాసింగ్! Publish Date: Apr 19, 2025 10:22AM

దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం!

పవన్ కు కేబినెట్ బెర్త్? తెలుగుదేశంకు గవర్నర్ తాయిలం? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు. ఒక్క కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రజాదరణ పొందలేదు. దీంతో దక్షిణాదిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో కొనసాగుతూనే సొంతంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాపై ఆధారపడటం అవసరమన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. వ్యూహరచన చేస్తున్నది.  ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ను సెంట్రిక్ గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతూనే పవన్ కల్యాణ్ తోడ్పాటుతో సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దగ్గర చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  అంతే కాకుండా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న మోడీ, తన కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కు బెర్త్ ఆఫర్ చేసినట్లు బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. పవన్ అందుకు అంగీకరించి.. కేంద్ర కేబినెట్ లోకి వెడితే.. ఏపీలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక కేబినెట్ బెర్త్ దక్కేలా తన ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.  అలా కాకుండా పవన్ ఏపీ కేబినెట్ లో నంబర్ 2గా, అంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మొగ్గు చూపితే.. ఆయన సేవలను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తమిళనాట.. సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అందుకే ఇప్పటికే పవన్  బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకూ వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు.    ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ తాయిలాలు ఇచ్చి.. కేంద్రంలో మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరికి  గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.  పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో బలపడటం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ రెండు పార్టీల తోడ్పాటుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. 
దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం! Publish Date: Apr 19, 2025 9:56AM

కాలేయం దెబ్బ తింటే కనిపించే లక్షణాలు ఇవే..!

  కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయవం.  ఇది కలుషితమైతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది.  ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవన శైలి సరిగా లేకపోవడం,  ఆహారం తీసుకునే విధానం సరిగా లేకపోవడం.  ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోవడం వంటివి లివర్ పాడవడానికి కారణం అవుతాయి.  ఎక్కువ కొవ్వు పదార్థాలు,  బేకరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలేయం దెబ్బ తింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  వాటి గురించి తెలుసుకుంటే.. కాలేయం దెబ్బతిన్నప్పుడు, కాలేయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది చర్మం,  కళ్లు పసుపు రంగులోకి మారడం. అంటే తరచుగా కామెర్ల వ్యాధి రావడం.  తగ్గిపోయిన కొన్ని రోజులకే కామెర్ల వ్యాధి మళ్లీ వస్తుంటే కాలేయం పనితీరు మందగించిందని అర్థం.  దీని వల్ల కాలేయం దెబ్బ తిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నా,  లేదా కాలేయం దెబ్బ తిన్నా అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే బాగా అలసటగా కనిపిస్తుంటారు.  వీరు ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కడుపులో వాపు లేదా నొప్పి ఉన్నా కాలేయం దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కడుపులో కుడి వైపు ఎగువ భాగంలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే ఆకలి అనిపించదు.  లేదా అసలు ఆకలి వేయదు.  ఏమీ తినాలని కూడా అనిపించదు. అంతేకాదు.. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.  తరచుగా వికారం,  వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాలేయ సమస్యలు ఉన్నవారికి మల విసర్జన ద్వారా కూడా సంకేతం వస్తుంది.  మల విసర్జనకు వెళ్లినప్పుడు మలం రంగులో మార్పులు ఉంటాయి. మలం బురద నలుపు రంగులో ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు.                                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
కాలేయం దెబ్బ తింటే కనిపించే లక్షణాలు ఇవే..! Publish Date: Apr 19, 2025 9:30AM

గుల్‌కంద్‌తో  మలబద్దకం సమస్యలు  పరార్!

  మలబద్దకం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.  ఆహారం ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా తినాలంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై ఆహారపు వ్యర్థాలు మలం రూపంలో అంతే సాఫీగా బయటకు వెళ్లిపోవాలి. కానీ కొందరిలో మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడటమే కాదు.. కనీసం వైద్యుల దగ్గరకు వెళ్లాలన్నా కూడా సంకోచిస్తారు చాలామంది.  అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీ మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి మంచి సువాసన కలిగిన గులాబీ రేకలు బాగా సహాయపడతాయి.  గులాబీ పువ్వును సాధారణంగా అలంకరణ కోసం,  పూజ కోసం మాత్రమే వాడుతుంటారు. కొందరు వంటకాలలో వాడినప్పటికి అవన్నీ కేవలం సువాసన కోసమే ఉపయోగిస్తారు. గులాబీ కడుపు సంబంధ సమస్యలనే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. పొట్టలో యాసిడ్ లు ఎక్కువ ఉత్పత్తి అయ్యే సమస్యకు ఇది చెక్ పెడుతుంది. గులాబీ రేకలతో గుల్కండ్ తయారు చేసి తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.  గుల్కండ్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. గుల్‌కంద్‌ తయారీకి కావలసిన పదార్థాలు.. నాటీ గులాబీ రేకలు.. చక్కెర.. తేనె.. నల్ల మిరియాలు.. పచ్చి ఏలకులు.. తయారీ విధానం.. గులాబీ రేకులను ఒక రోటిలో వేసి బాగా నూరాలి. ఇందులోనే పంచదార, తర్వాత తేనె కూడా కలపాలి. రుచి కోసం కాస్త నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి.  ఇందులో కాస్త యాలకులు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి ఎండలో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.  కానీ మలబద్దకం ఉన్నవారికి, ప్రేగు శోథ సమస్యలు ఉన్నవారికి ఇది గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది కడుపు సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. మరొక విషయం ఏమిటంటే.. ఈ గుల్కండ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
గుల్‌కంద్‌తో  మలబద్దకం సమస్యలు  పరార్! Publish Date: Apr 19, 2025 9:30AM

రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్.. విజయసాయి

విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెంటనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజీనామా ప్రకటన ఒక విధంగా చెప్పాలంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనం సృష్టించింది. అదీ జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకీ రాజీనామా చేఃసి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. రాజకీయం కాదు ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించడమే కాదు.. రైతుగా కొత్త అవతారమెత్తానంటూ  సాగు మొదలెట్టేశారు.  తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  వ్యవసాయ వ్యాపకంతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా జగన్ కు జెల్ల కొట్టి రాజకీయాలకు దూరం కావడమేంటి? అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అనడానికి ఆయన రాజీనామా ప్రకటనకు ముందు వరకూ ఎవరిలోనూ సందేహం లేదు. అందుకే ఆయన రాజీనామా వెనుక కూడా ఏదైనా డ్రామా ఉందా? అన్న అనుమానాలు అప్పట్లో గట్టిగా వ్యక్తమయ్యాయి. అప్పట్లో అంటే విజయసాయి రాజీనామా ప్రకటన చేసిన సమయంలో అదంతా జగన్ వ్యూహంలో భాగమేనంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రాజీనామా జగన్ మోడీ, బీజేపీకి పంపిన ప్రేమ సందేశంగా కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టే విజయసాయి తన రాజీనామా ప్రకటన సమయంలో జగన్ పట్ల విశ్వానాన్నే వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనీ, ఆయన రాజకీయంగా పుంజుకోవాలనీ తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో విజయసాయి రాజీనామా జగన్ ఆదేశం మేరకే జరిగిందని అప్పట్లో అంతా భావించారు.  కానీ ఆ తరువాత వరుసగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగన్, విజయసాయి మధ్య పూడ్చలేని, పూడ్చడానికి వీలుకాని అగాధమేదో ఏర్పడిందని అంతా భావిస్తున్నారు. తన రాజీనామా ప్రకటన తరువాత ఆయన జగన్ సోదరి షర్మిలతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటల పాటు జరిగిన ఆ భేటీలో షర్మిల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో గత నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పరోక్షంగా జగన్ నే టార్గెట్ చేశాయి. ఆ సందర్భంగానే అసందర్భంగా విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అప్పటి వరకూ ఏపీలో లిక్కర్ కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చిన వైసీపీకి విజయసాయి రివీల్ చేసిన విషయం మింగుడుపడలేదు. అప్పుడే విజయఃసాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలు, వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం (ఏప్రిల్ 18) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్ కసిరెడ్డి గురించి సంచలన విషయాలు చెప్పారు.  రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్న విజయసాయిరెడ్డి అటువంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీలోని కొందరు నేతల ద్వారా రాజ్ కసిరెడ్డితో పరిచయం అయ్యిందనీ. అతడి గురించి తెలియని తాను పార్టీలో అతడి ఎదుగుదలకు దోహదపడ్డాననీ చెప్పుకొచ్చారు. భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి తనను మోసం చేశాడనీ, అయితే ఆ మోసం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ అన్న విజయసాయిరెడ్డి, వైసీపీ హయాంలో 2019 చివరిలో నూతన మద్యం విధాన రూపకల్పనకు తన హైదరాబాద్, విజయవాడ నివాసాలలో రెండు సమావేశాలు జరిగాయని చెప్పారు.  ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను ఉన్నామన్నారు ఈ సమావేశాల తరువాతే తాను రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు అడగడంతో  అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత వంద కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని తెలిపారు.  అది వినా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో కూడా ఇదే చెప్పానని, మద్యం విధానం రూపొందిన తొలి నాళ్లలోనే తాను పార్టీలో క్రియాశీలంగా ఉన్నాననీ, ఆ తరువాత ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదనీ చెప్పుకున్నారు.  మద్యం కుంభకోణంలో   ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి?  అయితే విజయసాయి మీడియాతో మాట్లాడిన మాటలన్నీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి, మిధున్ రెడ్డిల పాత్రే కీలకమన్న విషయాన్ని పరోక్షంగా నిర్ధారించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా జగన్ సొంత మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ఇది కూడా ఆయన జగన్ తో ఢీ అనడానికి రెఢీగా ఉన్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు.  
రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్.. విజయసాయి Publish Date: Apr 19, 2025 6:55AM

బెట్టింగ్ యాప్‌లపై రియాక్ట్ అయిన లోకేష్

బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింగు యాప్‌ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ విధారం దేశానికే ఆదర్శంగా ఉండేలా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని ట్వీట్ చేశారు.
బెట్టింగ్ యాప్‌లపై రియాక్ట్ అయిన లోకేష్ Publish Date: Apr 18, 2025 10:39PM

ఆ దేశంలో తొలి ఏటిఎం ప్రారంభించారు!

ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని  ప్రారంభోత్సవానికి..  ఏకంగా ప్రధానే హాజరయ్యారు. పెద్ద కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పునకు అవసరమైన కీలక స్విచ్‌ అని వక్తలు అభివర్ణించారు. పసిఫిక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ దీని తయారీకి నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తువాలుకు సాయం చేసింది. ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్‌ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుంది.
ఆ దేశంలో తొలి ఏటిఎం ప్రారంభించారు! Publish Date: Apr 18, 2025 10:13PM

ఏపీలో పాస్టర్లకు వేతనలు ప్రకటించటంతో..జగన్ వ్యూహానికి చెక్

  గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం  గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు మే 2024 నుండి నవంబర్ 2024 వరకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు  జారీ చేసింది. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు.  ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రతి నెలా గౌరవ వేతనం కోసం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. పాస్టర్లకు  గౌరవ వేతనం సీఎం చంద్రబాబు ప్రకటించటంతో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదన్ని హత్యగా చిత్రకరించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వన్నికి క్రైస్తవుల్లో సానుభూతి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు వైఎస్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టారు.
ఏపీలో పాస్టర్లకు వేతనలు ప్రకటించటంతో..జగన్ వ్యూహానికి చెక్ Publish Date: Apr 18, 2025 9:35PM

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ..కేంద్రం క్లారిటీ

దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అన్ని నిరాధార, తప్పుడు దోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనమే లేవని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.  శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా ఆర్థిక శాఖ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్ లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ..కేంద్రం క్లారిటీ Publish Date: Apr 18, 2025 8:44PM

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో  ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  లోతట్టు ప్రాంతలు నీట మునిగాయి. తెలుగు తల్లి ప్లైఓవర్, బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీ రోడ్డులో చెట్లు కూలాయి.కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్ Publish Date: Apr 18, 2025 8:18PM

హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ పెట్టుబడి

జపాన్ పర్యటనలోని ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ పార్ట్‌నర్ షిప్ రోడ్డు షో‌లో పాల్గోన్నారు. తెలంగాణలొ పెట్టుబడులు పెట్టి  అభివృద్ధి చెందాలని వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం  సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.ముఖ్యమంత్రి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.  విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్ ని ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.. ఈరోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 
హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ పెట్టుబడి Publish Date: Apr 18, 2025 6:31PM

మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ  మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పనున పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నది.   నారాలోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, సత్యకుమార్, కొల్లు రవీంద్రలతో  ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే  అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్య కుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారిని వీరపాండ్యన్ నునోడల్ అధికారిగా నియమించింది. 
మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ Publish Date: Apr 18, 2025 5:33PM

లిక్కర్ స్కాంలో అతనిదే ప్రధాన పాత్ర.. సాయిరెడ్డి సంచలన విషయాలు

  వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసులో  మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ స్కాంలో సాక్షిగా హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. నేడు సిట్ ముందుకు వచ్చారు. శుక్రవారం విజయవాడ సిట్ ఆఫీసులో ఈ విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో మెయిన్ రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే అని విజయసాయి పేర్కొనగా.. అదే ఆఫీసులో వేరేచోట విచారణ జరుపుతున్న కసిరెడ్డి తండ్రిని విజయసాయి సమాధానాలను బేస్ చేసుకొని ప్రశ్నలు ఆడుగుతున్నట్టు సమాచారం.కాగా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం పంపిన ఆయన... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.   
లిక్కర్  స్కాంలో అతనిదే ప్రధాన పాత్ర.. సాయిరెడ్డి సంచలన విషయాలు Publish Date: Apr 18, 2025 5:02PM

సాయం మాటల్లో కాదు చేతల్లో.. గిరిజనానికి పాదరక్షలు అందించిన పవన్ కల్యాణ్

సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.  ఆ పర్యటనలో భాగంగా ఆదివాస గ్రామం డుంబ్రిగుడలో ఆయన గిరిజనులతో మమేకమయ్యారు.  ఆ సందర్భంగా గ్రామంలో దాదాపు ఎవరూ పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్లతోనే ఉండటాన్ని గమనించారు. సరైన రహదారుల లేని గిరిజన గ్రామాలలో గిరిజనం చెప్పులు కూడా లేకుండా నడవాల్సిన పరిస్థితికి చలించిపోయారు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన గిరిజన గ్రామాలకు రహదారులు వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని త్వరలోనే ఆరంభిస్తానని నమ్మబలికారు. అయితే ఆ వాగ్దానాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ వారికి ఓ అనూహ్య బహుమానం ఇచ్చారు. చెప్పుకోవడానికి అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అందరి హృదయాలనూ హత్తుకునే ఉదాత్త చర్య అనడంలో మాత్రం సందేహం లేదు. ఇంతకీ పవన్ కల్యాణ్ చేసింది ఏమిటంటే డుంబ్రిగుంట గ్రామ గిరిజనులకు ఆయన పాదరక్షలు పంపించారు. తన టీమ్ ద్వారా మొత్తం గ్రామ ప్రజలందరికీ పాదరక్షలు అందించారు. గ్రామంలో ఎంద మంది ఉన్నారు, వారికి ఏ సైజు పాదరక్షలు అవసరం తదితర వివరాలన్నిటినీ సర్వే చేయించారు. గురువారం (ఏప్రిల్ 17)న డుంబ్రిగుంట గ్రామస్తులకు పాదరక్షలు అందజేయించారు. డుబ్రిగుంట గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందచేయించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పాదరక్షలు అందజేశారు.   కోరకుండానే కష్టం తెలుసుకుని, అవసరాన్ని గుర్తించి తమకు పాదరక్షలు అందించిన  ప‌వ‌న్‌కు గిరిజనం కృతజ్ణతలు తెలిపారు.  
సాయం మాటల్లో కాదు చేతల్లో.. గిరిజనానికి పాదరక్షలు అందించిన పవన్ కల్యాణ్ Publish Date: Apr 18, 2025 4:45PM

ఎంఎంటీఎస్‌ యువతి రేప్ కేసులో..బిగ్ ట్విస్ట్

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు సదరు యువతిపై లైంగిక దాడి జరగలేదని పోలీసు ఎంక్వైరీలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని  అత్యాచారం జరిగింది అంటూ ఆ యువతి కట్టుకథ అల్లింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. వారు చెప్పిన విషయాలతో కంగుతిన్న అధికారులు 250 సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యువతిని విచారించగా ఆమె చెప్పిన సమాధానాలతో పోలీసులకు అనుమానం మొదలైంది.  ఇక వారు తమ స్టైల్లో విచారణ జరపగా ఆ యువతి అసలు విషయం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండగా కింద పడ్డానని.. తనపై అత్యాచారం జరగలేదని.. చెప్పడంతో నిజానిజాలు నిర్ధారించిన పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు.అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో సంచలన  విషయం వెలుగులోకి వచ్చింది.   
ఎంఎంటీఎస్‌ యువతి రేప్ కేసులో..బిగ్ ట్విస్ట్ Publish Date: Apr 18, 2025 4:24PM

పీఎం ఏసీ యోజన.. నిజంగా ఇది చల్లటి కబురే!

వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లాడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతున్నది. అదే పీఎం ఏసీ యోజన. ఈ పథకం ద్వారా పేదలకు సబ్సిడీ ధరలకే ఏసీలు అందజేస్తారు. ఈ పథకం ఎప్పటి నంచి ప్రారంభం అవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసిందని చెబుతున్నారు. అన్ని వర్గాలూ ఎండా కాలంలో ఉక్కపోతనుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే పీఎం ఏసీ యోజన పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేసవి నుంచి కాకపోయినా వచ్చే వేసవి నాటికైనా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉందని చెబుతున్నారు. అలాగని ఇదేమీ గతంలో ఎన్నడూ లేని సరికొత్త పథకం కాదు. కొంచం అటూ ఇటూలో సబ్సీడీపై ఏపీలు అందజేసే పథకం ఇప్పటికే ఢిల్లీలో అమలులో ఉంది. ఢిల్లీలో 3 స్టార్ అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏపీలను ఇచ్చి 60శాతం డిస్కౌంట్ లో 5స్టార్ ఏసీలను ఇచ్చే పథకం ఒకటి ఢిల్లీలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కేంద్రం భారీ సబ్సిడీలో పేదలకు ఏపీలను అందించే పథకానికి రూపకల్పన చేయనుంది. వేసవి తీవ్రత ఏటికేడు పెరిగిపోతుండటంతో వారికి ఒకింత చల్లటి కబురు చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పేదలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని భావిస్తోంది.  
పీఎం ఏసీ యోజన.. నిజంగా ఇది చల్లటి కబురే! Publish Date: Apr 18, 2025 4:14PM

కూల్ డ్రింక్‌లో బల్లి..అస్వస్థతకు గురైన యువకుడు

  సమ్మర్ వచ్చిందంటే ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్‌, ప్రూట్‌ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు భారీ షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో బల్లి అవశేషాలు ప్రత్యక్షమైంది. అది చూసిన యువకుడు కంగుతిన్నాడు.ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఆ యువకులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వారి తీరుపై ఆ యువకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట పరిధిలోని పెద్దపూర్ వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన ఉన్న హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించాయి.  అనంతరం సగం కూల్ డ్రింక్ తాగడంతో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యువకుడిని ఆసుపత్రికి స్నేహితులు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరబాద్ నగరంలో నిత్యం పలు రెస్టారెంట్‌లలో ఇలాంటి నిర్లక్ష్యం కనుబడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి ఫుడ్ తినాలంటే ప్రజలు భయపడుతున్నారు కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఆహారం తినాలంటే భయపడుతున్నారు.  ఇంటి ఫుడ్‌నే సో బేటర్ అంటున్నారు.  
  కూల్ డ్రింక్‌లో బల్లి..అస్వస్థతకు గురైన యువకుడు Publish Date: Apr 18, 2025 3:57PM

మ‌హిళా ఉద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో నూతంగా నియమితులైన ప్ర‌భుత్వ ఉద్యోగినులు ప్ర‌సూతి సెల‌వులు తీసుకున్నా ప్రొబేష‌న్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని తెలిపింది. ఈ మేర‌కు ప్రసూతి సెల‌వుల‌ను డ్యూటీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసింది. ఇదివ‌ర‌కు రెగ్యుల‌ర్ మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్ర‌మే మాతృత్వ సెల‌వులు ఉండేవి. తాజాగా స‌ర్కార్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగినులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి క‌బురు చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాస్టర్ల, క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
మ‌హిళా ఉద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ Publish Date: Apr 18, 2025 3:15PM

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఎడతెగకుండా కొనసాగుతున్న విభజన సమస్యల పంచాయతీతో పాటు, జల వివాదాలకు కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ఇరు రాష్ట్రాల సీఎంలూ భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రెండు రాష్ట్రాల అధికార వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దా కాలం దాటుతోంది. అయితే ఇప్పటికీ విభజన సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్యా అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు కూడా రెండు రాష్ట్రాలనూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అభివృద్ధి, సంక్షేమాలపై సంపూర్ణంగా దృష్టి సారించడానికి వీలౌతుందన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.  ఇదే లక్ష్యంతో గత ఏడాది జులైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక సారి భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ప్రజాభవన్ లో జరిగిన ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది.  ఇప్పుడు మరోసారి భేటీ కావాలని ఇరువురూ భావిస్తున్నారు.  విభజన సమస్యలలో చాలా వరకూ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమైపోయేవే ఉన్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇక చట్ట ప్రకారం పరిష్కారం కావాల్సిన వాటి విషయంలో కూడా మాట్లాడుకుని ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అవసరమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరలో మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని, ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం కూడా అయిపోయిందనీ అభిజ్ణవర్గాల భోగట్టా. ఏపీలో  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ , తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లు విభజన సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వారిరువురూ భావిస్తున్నారు.  త్వరలో వీరి మధ్య జరిగే భేటీలో జల వివాదాల అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు.  ఉద్యోగుల పంపకం,  విద్యుత్ బకాయిలు, ఆస్తుల విభజన వంటి సమస్యలపైనా చర్చించి పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భావిస్తున్నారని చెబుతున్నారు. 
త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..  ఎందుకంటే? Publish Date: Apr 18, 2025 2:57PM

బంధువు ఉద్యోగం కోసం కొండా సురేఖ రాయబారం

వైరల్ అవుతున్న మంత్రి ఆడియో కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్‌కు దారితీస్తోంది .. తాజాగా సెక్రటేరియట్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ ముగిశాక.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఆవిడ జరిపిన సంభాషణ.. హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మాట్లాడిన అంశంపైనే ఇప్పుడు వివాదమంతా. తన బంధువు బిడ్డ కోసం.. ఓ ఉద్యోగం ఉంటే చూడాలంటూ.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. ఈ పైరవీ సీన్ అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర మంత్రి.. ఉద్యోగం చూడాలని కోరడం, సరే చేద్దాం.. ఇప్పిస్తానంటూ ఆ మంత్రి కూడా బదులివ్వడంపై.. సోషల్ మీడియాలో డిబేట్‌ మొదలైంది.  తన అన్నయ్య మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. ఆయన కూడా సరే అంటూ హామీ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఇదంతా క్యాజువల్‌గా జరిగి ఉంటే ఎలాంటి వివాదం లేదు. ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్యలోనే ఉండిపోయేది. బయటకు తెలియకపోయేది. కానీ.. ఈ సీన్ అంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవడం, ఆ క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాదంగా మారింది. ప్రెస్‌మీట్ అవగానే.. మంత్రులు మాట్లాడుకున్నారు. అక్కడ కెమెరాలున్నాయనే కనీస అవగాహన కూడా లేకుండా.. మంత్రి తన బంధువులకు ఉద్యోగం కావాలి.. అందుకు మీ రికమండేషన్ కావాలని అడగడంపై.. సోషల్ మీడియా యూజర్లంతా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కూడా ఉద్యోగాలు కావాలని, మంత్రులు సిఫారసు చేయాలని కామెంట్స్ చేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా.. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట. ఆ మధ్య.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తీవ్ర దుమారం రేపాయి. ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని.. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఈ క్రమంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, వివరణ అడగడం కూడా జరిగింది. అప్పుడే.. ఆవిడను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు.. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఇంకా.. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది. ఈ ఇష్యూ.. కొండా సురేఖకు తలనొప్పిగా మారిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇదే సమయంలో మంత్రిగారి వ్యవహారం వివాదాస్పదంగా మారడం ఇప్పుడు కొత్తేమీ కాదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది.  గతంలో ఆవిడ మాట్లాడిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు తాగినంత మద్యం అంటూ చెప్పిన సెల్ఫీ వీడియో కాల్ కూడా వైరల్ అయింది. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవడం పరిపాటిగా మారుతోందనే చర్చ పార్టీలో నడుస్తోంది. అంతేకాదు.. ఆమె వ్యవహారశైలి పదే పదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండటంతో.. కొండా సురేఖ గ్రాఫ్ కూడా పడిపోతోందనే చర్చ సాగుతోంది. ఆవిడ పనితీరు కూడా బాగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే.. పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన మంత్రి కొండా సురేఖ.. ఇకపై కొంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
బంధువు ఉద్యోగం కోసం కొండా సురేఖ రాయబారం Publish Date: Apr 18, 2025 2:25PM

కర్నాటకంలో కులకలం

మీరు కొట్టుకుంటే.. మోదీ కూల్చేస్తారు   ముఖ్య నేతలకు ఖర్గే హెచ్చరిక   కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  కుల గణనకు ఇచ్చే ప్రాధాన్యత గురించ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కులగణనతో దేశాన్ని ఎక్స్- రే తీసి.. అసమానతలను తొలగిస్తామనీ, దేశ సంపదను అన్ని వర్గాలకూ సమానంగా పంచుతామనీ, రాహుల్ గాంధీ  2024 ఎన్నికల్లోనే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.  ఇక అక్కడి నుంచీ రాహుల్ గాంధీ కులగణన గురించి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. పార్లమెంట్  ప్రసంగమే అయినా.. పార్టీ లేదా పబ్లిక్ మీటింగే అయినా..  కులగణన ప్రస్తావన లేని రాహుల్ గాందీ ప్రసంగం ఇటీవల కాలంలో ఒక్కటీ  లేదంటే అతిశయోక్తి కాదు.ఇది ఆయనకు ఈ అంశం పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.  దేశంలో అసమానతలు తొలిగి పోయేందుకు కులగణనను మించిన దివ్య ఔషథం మరొకటి లేదనే విశ్వాసం ఆయన ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులగణనకు రాహుల్ గాంధీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు. కులగణనలో ఆయన భవిష్యత్ భారతాన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను చూస్తున్నారు. అందుకే ఆయన  దేశం అంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్షణం కులగణన చేపట్టి ఆదర్శంగా నిలవాలని కాంగ్రస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఆదేశించారు.     రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై కులగణనను చేపట్టింది.   దిగ్విజయంగా పూర్తిచేసింది. అంతే కాదు  తదను గుణంగా రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు ఢిల్లీ వరకూ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రాహుల్ గాంధీ మెప్పు పొందారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఏఐసీసీ వేదిక నుంచి  రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుతాన్నిడిమాండ్ చేశారు.  అయితే ఇప్పడు అదే కులగణన కర్ణాటక మంత్రి వర్గంలో కుంపట్లు రాజేసింది. అసలే ఉప్పు నిప్పులా ఉండే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్యన మరో కుంపటి వెలిగించింది.  నిజానికి  రాహుల్ గాంధీ మదిలో కులగణన మెరుపు మెరవక ముందు ఎప్పుడో దశాబ్దం క్రితం 2015లోనే.. ఇదే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  సామాజిక ,ఆర్థిక, విద్యా సర్వే పేరిట  కులగణన చేపట్టింది.  ప్రాథమిక   నివేదిక 2018 నాటికే సిద్దమైంది. అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ నివేదికను ముట్టుకోలేదు. పక్కన పెట్టింది.  అయితే.. 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. మళ్ళీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన మరోమారు తెర పైకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన జెండా పట్టిన తర్వాత  పాత సర్వే అంశం  పై కొచ్చింది. అయితే  ఓ వంక రాహుల్ గాంధీ,దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. సిద్ధంగా ఉన్న కులగణన నివేదికను బయట పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం నిన్న మొన్నటి వరకూ మీన మేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో  కాంగ్రెస్ అధిష్టానం కూడా వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే.. తాజాగా గత శుక్రవారం (ఏప్రిల్ 11) నివేదిక రాష్ట్ర మంత్రి వర్గం ముందు కొచ్చింది. నివేదిక కాపీలు మంత్రుల చేతుల్లోకి వచ్చాయి. అందులోని అంశాలు లీక్ అయ్యాయి.  సహజంగానే దుమారం చెలరేగింది. నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన కులాల జనాభా 69.60 శాతానికి చేరింది. ముస్లిములు సహా, మిగిలిన సామాజిక వర్గాల శాతం ఇంచు మించుగా రెట్టింపు అయింది. మరోవంక రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గం వీరశైవలింగాయతలలోని, లింగాయతులు, వక్క లింగాయతుల శాతం మాత్రం తగ్గింది.  దీంతో, నివేదిక విశ్వసనీయతను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు తప్పు పడుతున్నారు. కులగణన నివేదికను వీరశైవలింగాయతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నివేదికను చెత్తబుట్టలో పడేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 17) న కులగణన నివేదికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ప్రత్యేక సమావేశం  తీవ్ర వాదోపవాదాల నడుమ రసాభాసగా ముగిసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న లింగాయత్, వక్క లింగాయత్ కులాల మంత్రులు నివేదికను పూర్తిగా వ్యతిరేకిచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్తిగా ముగిసాయి, తిరిగి మే 2న జరిగే మంత్రివర్గ ప్రత్యేక సమవేశంలోమరో సారి  మరింత లోతుగా చర్చిస్తామని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సింగల్ పాయింట్ ఎజెండాగా ముదుకు తీసుకుపోతున్న కులగణనకు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనే ఎదురుదెబ్బ తగలడం  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.  మరోవంక  కులగణన వివాదం నేపథ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోకండని, కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సూచించారు. మీ మధ్య విభేదాలు మోడీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరిం చారు. ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. కాగా  ఖర్గే చేసిన బహిరంగ హెచ్చరిక ప్రమాద స్థాయిని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
 కర్నాటకంలో  కులకలం Publish Date: Apr 18, 2025 1:31PM

పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో కొత్త తిరకాసు!

తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు చెన్నైలో కూర్చుని మరీ పొత్తును పీటలెక్కించారు. స్వయంగా ఆయనే చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరంలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే’ పార్టీలు కలిసి  పోటీ చేస్తాయని ప్రకటించారు.  అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కే. పళని స్వామి, బీజేపీ నేత అన్నామలైలతో కలిసి  మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా స్వయంగా  పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు.. పొత్తుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని, అలాగే బీజేపీ నుంచి కూడా షరతులు ఏవీ లేవని స్పష్టం చేశారు. డీఎంకే దుష్ట దుర్మార్గ  పాలనను అంతమొందించడమే లక్ష్యంగా  బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఎ బ్యానర్ పై ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. అంత వరకు అంతా బాగుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు పొత్తు కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అయితే..  స్ట్రాంగర్ టుగెదర్   (‘కలిసి ఉంటే కలదు బలం’) అని ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే ఎన్డీఎ కూటమిలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతించారు. నిజానికి ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు, సంప్రదింపులు జరుగతున్న నేపధ్యంలో, పొత్తు ప్రకటన పెద్దగా సంచలనం కాలేదు. అయితే  పొత్తు పారాణి ఆరక ముందే.. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి  పొత్తుకు కొత్త అర్థం చెపుతూ చేసిన  ప్రకటన నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. చర్చకు దారి తీసింది.    అవును. ఎన్నికల వరకే పొత్తంటూ పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెప్పారు.ఎ న్నికలలో ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్నాడీఎంకే ఒప్పుకోదని స్పష్టం చేశారు. అంటే  పీటల వరకే పెళ్లి, సంసారం అంటే కుదరదు  అని పళని స్వామి మెలిక పెట్టారు. అంతే కాదు.. అమిత్ షా చెప్పింది కూడా అదే  అని వివరణ  కూడా ఇచ్చారు. అయితే  వాస్తవంలో అమిత్ షా చెప్పిన దానికి, పళని స్వామి చెప్పిన భాష్యానికి పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా చాలా  స్పష్టంగా  పొత్తుకు తమిళ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. కానీ  పళని స్వామి ఇప్పడు పొత్తుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు. అంతే కాదు.. పొత్తు ఎన్నికల వరకే, ఎన్డీఎ అధికారంలోకి వచ్చినా, బీజేపీ, ఇతర మిత్ర పక్షాలకు మంత్రివర్గంలో స్థానం ఉండదని  పళని స్వామి తేల్చేశారు.  మరో వంక రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అంతేగా ..అంతేగా అంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో వుందా అనేది ఇంకా స్పష్టం కాలేదని  పార్టీ వర్గాల సమాచారం. అయితే..  దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ నాయకత్వం,అన్నాడీఎంకే షరతులకు తాత్కాలికంగానే అయినా  ఓకే అంటుందని  అంటున్నారు.  నిజానికి  అన్నాడీఎంకే డిమాండ్ మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించిందనీ, అలాగే  పళని స్వామి తాజా డిమాండ్ ను అంగీకరించినా అంగీకరిస్తుందని అంటున్నారు.    అయితే.. పళని స్వామి రోజుల వ్యవధిలోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారు?  ఇంతలో ఏమి జరిగింది.. అంటే, బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వరం నేతల విముఖతే పళని సామి యు టర్న్ కు ప్రధాన కారణం అంటున్నారు. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటును పూర్తిగా దూరం చేస్తుందని అన్నాడీఎంకే నాయకులు  పొత్తును వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. అలాగే.. బీజేపీతో పొత్తు కారణంగా  2021 అసెంబ్లీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కూడా పొత్తు వద్దనడానికి కారణంగాచెపుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్నా  ఫలితం లేక పోయింది. అన్నాడీఎంకే సీట్ల సంఖ్య 136 నుంచి 75కి పడి పోయింది.  అధికారం అన్నాడీఎంకే చేజారింది. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 20 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.  అయితే  బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 33 సీట్లలో పోటీ చేసినా అన్నాడీఎంకేకి  ఆ ఒక్క సీటే దక్కింది. అందుకే  ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపట్ల అన్నాడీఎంకేలో విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే, పళని స్వామి యు టర్న్ తీసుకున్నారని అంటున్నారు.  అయితే.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలం మెల్ల మెల్లగా పెరుగుతోందని అంటున్నారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా బీజేపీకి  3-4 శాతం మధ్యనే ఓట్లు పోలయ్యాయి. కానీ,  2024 లోకసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకున్నా బీజేపీ ఓటు 7.58 శాతం పెరిగింది.  11 శాతానికి పైగా ఓట్లు బీజేపే  సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బీజేపీతో మళ్ళీ పొత్తుకు సిద్దమైంది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో  పళని స్వామి అటూ ఇటూ అవుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పళని  స్వామి  వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినా.. డీఎంకేను ఎదుర్కోవాలంటే  బీజేపీ ఓటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అన్నాడీఎంకేకు అవసరం అవుతుందనీ,  అలాగే  బీజేపీకి కూడా దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేనతో ఎలాగైతే పొత్తు  అవసరమో.. అదే విధంగా  తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు అనివార్యమని అంటున్నారు.  సో .. బీజేపీ, అన్నాడీఎంకే  పొత్తు ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నా చివరాఖరుకు పొత్తు  పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.  
 పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో  కొత్త తిరకాసు! Publish Date: Apr 18, 2025 1:12PM

బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. . .విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు... ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.
బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ? Publish Date: Apr 18, 2025 12:35PM

అసత్య ఆరోపణలు.. భూమనపై కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతి పై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో టీటీడీ తిరుపతి గోశాల గోవధ శాల గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. మూడు నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు. అదే రోజు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భూమన ఆరోపణలు అవాస్తవమని ఖండిచారు. గోశాల పై అసత్య ప్రచారం మైనుకోవాలని,  నేరుగా వస్తే సాక్షాలతో నిరూపిస్తామన్నారు.  ఇక ఆ తరువాత రోజుకొక్క అంశంతో ప్రచారం, వాదోపవాదాలు, సవాళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా గోశాల పై అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోశాల పరిధిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్వీయూ పోలీసులు క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు నమోదు చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ  టీటీడీ, అనుబంధట సంస్థ ల పై ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  భవిష్యత్తులో ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, టీటీడీ గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగ్గా పెట్టలేదు..  బక్కచిక్కి పోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి టీటీడీ ప్రతిష్ట ను దిగజార్చే విధంగా చేశారని అన్నారు. గో  హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ఆరోపణలు చేసిన   టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరినట్లు చెప్పారు. అదే ఫిర్యాదు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాననీ, దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. 
అసత్య ఆరోపణలు.. భూమనపై కేసు Publish Date: Apr 18, 2025 11:06AM

తిరుమల శ్రీవారి సేవలో ఫైనన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం అభిషేక సేవలో  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పనగారియా నేతృత్వంలోని 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలు దేరడానికి ముందు ఆయనతో భేటీ అయ్యింది. ఆ సందర్భంగా చంద్రబాబు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.   ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజంటేషన్ ఇవ్వడం తమను అబ్బుర పరిచిందని ఆ సందర్భంగా పనగారియా ప్రశంసించారు.  అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై  కూడా  ప్రశంసలు గుప్పించారు.  వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని   ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల శ్రీవారిని శుక్రవారం (ఏప్రిల్ 18) దర్శించుకున్నవారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు ఉన్నారు.  
తిరుమల శ్రీవారి సేవలో ఫైనన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా Publish Date: Apr 18, 2025 10:46AM

గోమాతల మరణాలతో వైసీపీ నీచ రాజకీయం!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, ఏడు కొండల పవిత్రతను ఎంతగా దిగాజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇంటి మనిషి  సొంత బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డిని ఒకటికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామి వారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు.. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని  పాపం అంటూ ఏదీ లేదు. అవును, టీటీడీ పాపాల పుట్టగా మారింది. అందుకే  వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించాడు. అయినా, జగన్ అండ్ కో .. తీరు మారలేదు. టీటీడీ గోశాలలో గోవులు ఆకలి, అనారోగ్యంతో కన్ను మూస్తున్నాయని అసత్య ప్రచారికి తెర తీశారు. ఒక విధంగా, అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు.    నిజానికి  బాబాయ్, అబ్బాయ్.. పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్య మత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు.. అనేక సార్లు అన్యమతస్తుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి, అయినా.. ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  అంతే కాదు.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్తులను గుర్తించి, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను  జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రికి  బదిలీ చేసింది. అన్యమతస్తులకు అండగా నిలిచింది. నిజానికి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం  సామాన్యమైనది కాదు . హిందూ దేవాలయాల ధ్వంస రచన లక్ష్యంగా తీసుకున్న వ్యూహాత్మక   నిర్ణయంగా అప్పట్లోనే అధికార వర్గాలు, ముఖ్యంగా మాజీ ఐఎఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వీ ఆకస్మిక బదిలీని అన్యమతస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాలి ఉంటుందని అప్పట్లోనే అధికారులు, పదవీ విరమణ చేసిన మాజీ అధికారులు  కొందరు పేర్కొన్నారు. ఒక్క తిరుమ లలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ దేవాలయంలో అయినా అన్యమత ఉద్యోగుల జోలికి వస్తే  ఖబడ్దార్‌  అని అధికారులను పరోక్షగానే అయినా  ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హెచ్చరించారని అంటారు.  మరో వంక అన్యమతస్తుల ఏరి వేతకు పూనుకున్నందుకే  చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిపై బదిలీ వేటు వేసిన తర్వాత  మరో అధికారి అలాంటి సాహసం చేయలేరని  అన్యమత ప్రచారం సాగిస్తున్న దేవాలయాల ఉద్యోగులు భరోసా ఇచ్చారు. అందుకే  ఆ తర్వాత ఏ అధికారీ ఆ సాహసం చేయలేదు. మరో వంక రాష్ట్రంలోని అనేక ప్రధాన దేవాలయాల్లో అన్యమత మత ప్రచారానికి అడ్డూ అదపూ లేకుండా  పోయిందని  అప్పట్లో అధికారులే కాదు భక్తులు కూడా ఆందోళన వ్యక్త పరిచారు.   ఆ విధంగా జగన్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే  ఆ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రలో ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రథాలు తగల బడ్డాయి.  గుళ్ళు కూలిపోయాయి. విగ్రహాల తలలు విరిగి పడ్డాయి. మరోవంక  ప్రభుత్వం అండదండలతో క్రైస్తవులు నామమాత్రంగా అయినా లేని గ్రామాల్లో  విదేశీ సంస్థలు సమకూర్చిన నిధులతో  చర్చిల నిర్మాణం జరిగింది.  అలాగే  కొన్ని కొన్ని చర్చిల నిర్మాణం,మరమత్తులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులనే జగన్ రెడ్డి ప్రభుతం ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి.  అందుకే  ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి  జగన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో హిందువులు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన వంటి దుర్మార్గ చర్యలకు  ఒడి గట్టినా ప్రభుత్వంపట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక్కరంటే ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ‘పాపం ..పిచ్చోళ్ళు’ అంటూ ధర్మ ద్రోహులకు జగన్ రెడ్డి ప్రభుత్వం  పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి  రక్షణ కవచంగా నిలిచింది.  అందుకే హిందూ ధార్మిక సంస్థలు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక పాలన సాగించారని  ముఖ్యంగా, తిరుమలను పవిత్రతను దిగజార్చే కుట్రలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని అనేక సందర్భాలలో ఆరోపించాయి.   ముఖ్యంగా వాటికన్ సిటీని మించిన ప్రపంచ ఆద్యాత్మిక కేంద్రంగా తిరుమల ఎదుగుదలను  తట్టుకోలేకనో ఏమో  జగన్ రెడ్డి తమ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో ఏడు కొండల ప్రతిష్టను దిగజార్చేందుకు శత విధాల ప్రయత్నించారని  అంటారు. అయితే.. ఆయన లక్ష్యం నెరవేరలేదు కానీ  దేవుని శిక్ష అయితే తప్పలేదు.  అవును. జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే.. వెంకన్న దేవుడు సమా ధానం ఇచ్చారు. అహంకారంతో ఊగిపోయిన, ఆయన్ని పదకొండు సీట్లకు పడగొట్టి  చూపారని భక్తులు ఇప్పటికీ సంతోషం వ్యక్త పరుస్తున్నారు.  నిజానికి  వెంకన్న దేవుని ప్రతిష్టను దెబ్బ తీసే కుట్రలు జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు . గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి  ఏడు కొండలను రెండు కొండలకు కుదించి, కొండ పైనే చర్చి నిర్మాణం చేపట్టేదుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది.   అందరికీ తెలిసిందే.  అయినా.. జగన్ రెడ్డి, చేసిందంతా చేసి ఇప్పడు టీటీడీ గోశాలో గోమాతలు చనిపోయిన సంఘటను ఆసరా చేసుకుని, రాజకీయం చేస్తున్నారు. గతంలో అయన హయాంలోనే నాసి రకం దాణా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వలన  గోమాతాల ఆరోగ్యం దెబ్బతిన్నదని విజిలెన్స్  నివేదిక చెప్పిన నిజాన్ని మరిచి పోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం  చేస్తున్నారు.  జగన్ రెడ్డి, తెర చాటు దర్శకత్వంలో భూమన నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం గట్టిగానే  చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా.. ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తుంది. అయితే  గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం  తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు.. మనిషన్నవాడు ఎవడూ సమర్ధించడు. నిజానికి  ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కొత్త కాదు. గతంలో వైఎస్  రాజశేఖర రెడ్డి  చెన్నా రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించి, వందల ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ తో జాగ్రత్త అంటున్నారు.
గోమాతల మరణాలతో వైసీపీ నీచ రాజకీయం! Publish Date: Apr 18, 2025 10:04AM