బాబోయ్ బాబోయ్ పెద్దపులులు.. తెలుగు రాష్ట్రాలలో భయాందోళనలు

posted on: Mar 18, 2026 9:31AM

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి ఓ వైపు హల్ చల్ చేస్తున్న సమయంలోనే తెలంగాణలో కూడా పెద్ద పులి సంచారం జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో  పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.  

స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  కొడిమ్యాల  మండలంలోని గంగారం తండా గ్రామంలో ఇటీవల రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి  చంపేసింది. దీంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. పులి సంచారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలను పరిశీలిస్తున్నారు. గ్రామస్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో పులి సంచారం స్థానికులను, భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది.  అటవీ శాఖ అధికారులతో పాటుగా దేవస్థానం అధికారులు, పోలీసులు అప్రమత్తమై భక్తులకు కీలక సూచనలు చేశారు. మెట్ల మార్గంలో, ఘాట్ రోడ్డులో ఒంటరిగా తిరగవద్దని, వాహనాలను ఘాట్ రోడ్డులో నిలపవద్దని సూచించారు. కొండపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా ప్రకటించారు. ఇక పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు  హనుమాన్ బృందాలను రంగంలోకి దింపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...