జగన్ కూల్చివేతలకు మూడేళ్లు.. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఫైర్

ఏపీలో జగన్ సర్కార్ కూల్చివేతల పర్వానికి నేటితో మూడేళ్లు నిండాయని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. జగన్ అధికారంలోనికి వచ్చిన తరువాత చేసిన మొదటి పని ప్రజా వేదిక కూల్చివేత అని పేర్కొన్న ఆయన దానితో మొదలైన కూల్చివేతల పర్వం ఈ మూడేళ్లుగా జగన్ ఒక ఉద్యమంలా చేశారనీ, ఆయన కూల్చివేతలన్నీ ప్రజలకు ఉపయోగపడేవేననీ అన్నారు. అన్న క్యాంటిన్లే, తెలుగుదేశం కార్యాలయం ఇలా చెప్పుకుంటూ పోతే వాటి లెక్క అలా పెరిగిపోతూనే ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజా వేదిక కూల్చివేతతోనే తన సైకో పాలన ఎలా ఉంటుందో తెలియజెప్పారనీ.. ఈ తరువాత ఈ మూడేళ్ల కాలంలో వ్యవస్థలను కూల్చేశారు. వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కూల్చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుప్ప కూల్చేశారు, అభివృద్ధిని కూల్చేశారని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, దళితుల గూడును, యువత భవితనున కూల్చేసిన జగన్ ఆఖరికి ప్రజారాజథాని అమరావతిని, రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం పురోగతిని కూడా కూల్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.

కూల్చివేతలు వినా జగన్ ఈ మూడేళ్లలో నిర్మించినది శూన్యం. కూల్చడం తేలికే.. నిర్మాణమే కష్టం ఈ విషయాన్ని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో జనం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అని చంద్రబాబు పేర్కొన్నారు.